వచ్చే ఎన్నికల్లో బీసీలకు 50 శాతం సీట్లు

వచ్చే ఎన్నికల్లో 50 శాతం సీట్లను ముఖ్యమంత్రి జగన్‌ బీసీలకే కచ్చితంగా ఇస్తారని శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు.

Updated : 07 Dec 2022 10:57 IST

జగనే ఇస్తుంటే.. మేం అడిగేదేముంది?
మూడు రాజధానుల బిల్లుపై చెప్పలేను
స్పీకర్‌నే కాని, ప్రాథమికంగా వైకాపా కార్యకర్తను 
శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాం

ఈనాడు, అమరావతి: వచ్చే ఎన్నికల్లో 50 శాతం సీట్లను ముఖ్యమంత్రి జగన్‌ బీసీలకే కచ్చితంగా ఇస్తారని శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. విలేకరుల ప్రశ్నలకు ఇలా జవాబులిచ్చారు.

విలేకరులు: 50 శాతం సీట్లను బీసీలకు ఇవ్వాలని వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తెదేపా నేతగా మీరు డిమాండ్‌ చేశారు. ఇప్పుడు జగన్‌నూ అదే డిమాండ్‌ చేస్తారా?

స్పీకర్‌: మేం డిమాండ్‌ చేయడం ఎందుకు? తీసుకోండి అని ఆయనే ఇస్తున్నారు కదా? కచ్చితంగా ఇస్తారు, అనుమానం ఎందుకు?

వి: మీరు ముఖ్యమంత్రి జగనే పెద్ద బీసీ అంటున్నారు, 2004లో చంద్రబాబే పెద్ద బీసీ అని అన్నారు!

స్పీకర్‌: చంద్రబాబు అలా ఉండాలని అన్నా. కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోయారు, అందుకే ఓడిపోయారు.

వి: రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అవుతారా?

స్పీకర్‌: బీసీ అంటేనే భారత్‌ కల్చర్‌. నాగరికతను నేర్పి, చేయి పట్టుకుని నడిపించింది బీసీలే. దేశానికి ఒక బీసీ ప్రధానిగా ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ను రెడ్డి అని ఎవరన్నారు? ఆయనో పెద్ద బీసీ. పెద్ద ఎస్సీ. పెద్ద ఎస్టీ. పెద్ద మైనారిటీ కూడా. ఆయన్ను రెడ్డి కులానికి చెందిన వ్యక్తని ఎవరన్నారు?

వి: మూడు రాజధానులు అని చెబుతున్నప్పటికీ విశాఖనే రాష్ట్ర రాజధాని అవుతుంది అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అంటున్నారుగా?

స్పీకర్‌: పరిపాలనా రాజధాని ఎక్కడుంటే అదే రాజధాని. ధర్మాన చెప్పిన దాంట్లో తప్పేముంది? సీఎం ఎక్కడ నిర్ణయిస్తే, ఎక్కడి నుంచి పాలించాలనుకుంటే అదే రాజధాని. ఎనీ డౌట్‌?

వి: వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు పెడతారా?

స్పీకర్‌: అది ప్రభుత్వ నిర్ణయం. ప్రభుత్వం ప్రవేశపెడితే ఆ బిల్లును సభకు పరిచయం చేయడమే నా పరిధిలో ఉంటుంది. బిల్లును ఆమోదించడమా లేదా అనేది సభ నిర్ణయిస్తుంది. సమావేశాలు పెట్టాలని ఇంతవరకూ ప్రభుత్వం నుంచి సంకేతాలే రాలేదు. బిల్లు వచ్చే అవకాశం ఉందని నేనెలా చెప్పగలను?

వి: బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు కాని, వాటికి ఏ పవర్సూ లేవు కదా?

స్పీకర్‌: ‘పవర్‌ అంటే ఏంటి? ప్లగ్‌లో వేలు పెడితే షాక్‌ కొట్టడమా?

వి: పవర్‌ లేకపోవడమంటే గతంలో వెలుగు వెలిగిన మంత్రి బొత్స లాంటి సీనియర్లు సాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి వంటివారి కింద పనిచేయాల్సి వస్తోంది కదా?
స్పీకర్‌: ఎంత గొప్పవాడైనా పార్టీ ఎజెండాకు కట్టుబడాల్సిందే. జగన్‌, అధిష్ఠానం అంటూ.. కొన్ని నియమాలుంటాయి. ఇవన్నీ మా పార్టీ అంతర్గత విషయాలు. వీటిని ప్రశ్నించడానికి మీరెవరు?

వి: బీసీ జనగణనపై కేంద్రాన్ని అడుగుతారా?

స్పీకర్‌: ప్రధాని మోదీకి ఫోన్‌ చేసి బీసీ జనగణనను ఎందుకు తేల్చలేదని మీరే అడగండి. బీసీ జనగణన చేయాల్సిన అధికారం కేంద్రానిది. కేంద్రం అధికారాన్ని ప్రశ్నించే అధికారం మనకు లేదు కదా? ఆ అధికారాన్ని మాకు ఇవ్వమనండి. ఐదు నిమిషాల్లో చేసేస్తాం.

వి: స్పీకర్లు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదన్న సంప్రదాయం ఉంది కదా?

స్పీకర్‌: గత ప్రభుత్వంలో ఈ సంప్రదాయాలను ఎక్కడ గౌరవించారు? నేను గౌరవిస్తున్నాను కాబట్టే, సంప్రదాయం ముసుగు నుంచి బయటకు వచ్చి జయహో బీసీ, జయహో జగనన్న అన్న నినాదంతో ముందుకు వస్తున్నా. నేను బీసీని. బుధవారం జయహో బీసీ సభలో పాల్గొంటా. నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అని జగన్‌ అంటుంటారు. జగన్‌ ‘మా, మన బీసీ’ అని రేపు డిక్లరేషన్‌ ఇవ్వబోతున్నారు. నేను స్పీకర్‌నే కానీ, ప్రాథమికంగా వైకాపా కార్యకర్తను. దీనిపై మొదట్లోనే స్పష్టత ఇచ్చా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని