మీ పెళ్లి బారాత్‌ కోసం చూస్తున్నా.. రాహుల్‌తో లాలూ ప్రసాద్‌ వ్యాఖ్యలు

విపక్షాల భేటీలో కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)కి ఆర్జేడీ (RJD) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌ (Lalu Prasad Yadav) కీలక సూచన చేశారు. 

Updated : 23 Jun 2023 23:15 IST

పట్నా: 2024 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా (BJP) ఓటమే లక్ష్యంగా విపక్ష పార్టీలు శుక్రవారం పట్నాలో సమావేశమయ్యాయి. ఈ భేటీకి బిహార్‌ (Bihar) సీఎం నీతీశ్‌ కుమార్‌ (Nitish Kumar) ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తనదైన శైలిలో ప్రత్యర్థులపై చలోక్తులు విసురుతూ విమర్శలు చేస్తుంటారు ఆర్జేడీ (RJD) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌ (Lalu Prasad Yadav). ప్రతిపక్ష పార్టీల సమావేశం అనంతరం విలేఖరుల సమావేశంలో చివరిగా మాట్లాడిన లాలూ.. కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)కి కీలక సూచన చేశారు. రాహుల్‌ త్వరగా పెళ్లి చేసుకోవాలని సూచించారు. దీంతో అక్కడున్న వారందరి మొహాల్లో నవ్వులు విరిశాయి. టీ-షర్ట్ ధరించినందుకు రాహుల్‌ను అభినందిస్తూనే.. మోదీ కుర్తాకు ఇదే సరైన సమాధానమని వ్యాఖ్యానించారు. 

‘‘రాహుల్‌జీ పెళ్లి చేసుకోమని మేం చేస్తున్న సూచనను మీరు పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా మా మాట విని.. పెళ్లి చేసుకోండి. మీరు పెళ్లికి నిరాకరించడం వల్ల మీ అమ్మ ఎంతో బాధపడుతున్నారు. మేమంతా మీ పెళ్లి బారాత్‌ కోసం ఎదురుచూస్తున్నాం’’ అని లాలూ ప్రసాద్‌ అన్నారు. లాలూ వ్యాఖ్యలకు రాహుల్‌ చిరునవ్వులు చిందిస్తూ సరే అంటూ సమాధానమిచ్చారు. అలాగే భారత్‌ జోడో యాత్ర విజయవంతంగా పూర్తి చేసినందుకు కూడా రాహుల్‌ గాంధీపై లాలూ ప్రసాద్‌ ప్రశంసలు కురిపించారు. రూ.2 వేల నోటు ఉపసంహరణ విషయంలో భాజపా ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. 

విపక్షాల ఐక్యతపై సుమారు 15 ప్రతిపక్ష పార్టీలు నాలుగు గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిపాయి. భేటీ అనంతరం చర్చించిన అంశాలను విపక్ష నేతలు మీడియాకు వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు అన్ని పార్టీలు అంగీకరించినట్లు బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ తెలిపారు. సీట్ల పంపకాలు, పార్టీల వారీగా విభజన వంటి అంశాలపై మరింత స్పష్టత కోసం వచ్చే నెల శిమ్లాలో మరోసారి సమావేశం కానున్నట్లు తెలిపారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని