ఖతార్‌తో స్నేహ సంబంధాలకు భారత్‌ ప్రాధాన్యం

మూడు దేశాల పర్యటనలో భాగంగా భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆదివారం ఖతార్‌ ప్రధానమంత్రి షేక్‌ ఖాలిద్‌ బిన్‌ ఖలీఫా బిన్‌ అబ్దుల్‌అజీజ్‌ అల్‌ థనీతో దోహాలో భేటీ అయ్యారు. ఉభయ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక, భద్రతాసహకారం

Published : 06 Jun 2022 05:59 IST

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

దోహా: మూడు దేశాల పర్యటనలో భాగంగా భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆదివారం ఖతార్‌ ప్రధానమంత్రి షేక్‌ ఖాలిద్‌ బిన్‌ ఖలీఫా బిన్‌ అబ్దుల్‌అజీజ్‌ అల్‌ థనీతో దోహాలో భేటీ అయ్యారు. ఉభయ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక, భద్రతాసహకారం వంటి రంగాల్లో పెరుగుతున్న సంబంధాలను నేతలిద్దరూ సమీక్షించారు. ఖతార్‌తో స్నేహ సంబంధాలకు భారత్‌ చాలా ప్రాధాన్యం ఇస్తోందని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు పునరుద్ఘాటించారు. ఇంధనం, ఆహార భద్రత, రక్షణ, సాంకేతికతలు, సాంస్కృతికం, విద్య, ఆరోగ్యం, మీడియా, ప్రజా సంబంధాలు వంటి అంశాల్లో ద్వైపాక్షిక సహకారం పెంపొందించుకోవడానికి భారత్‌ నిబద్ధతతో ఉన్నట్లు తెలిపారు. పర్యటనలో భాగంగా వెంకయ్యనాయుడు ఖతార్‌ రాజు తండ్రి ఆమిర్‌ షేక్‌ హమాద్‌ బిన్‌ ఖలీఫా అల్‌ థనీతోనూ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల సహకారం వంటి అంశాలను మరింత పెంచేందుకు గట్టి నిబద్ధతను ఉభయ దేశాలూ వ్యక్తం చేశాయి. అలాగే ఖతార్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీతో కలిసి ఫిక్కీ, సీఐఐ, అసోచామ్‌లు సంయుక్తంగా నిర్వహించిన భారత్‌-ఖతార్‌ బిజినెస్‌ ఫోరమ్‌ను ఉద్దేశించి వెంకయ్యనాయుడు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉభయ దేశాల అంకుర పరిశ్రమలకు ఊతమిచ్చేలా రూపొందించిన ‘ఇండియా-ఖతార్‌ స్టార్ట్‌-అప్‌ బ్రిడ్జి’ని ఆయన ప్రారంభించారు. ఇది పరస్పర వాణిజ్య రంగాల అభివృద్ధికి దోహదపడుతుంది. ఇరు దేశాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా వెంకయ్యనాయుడు ఖతార్‌కు చెందిన మరికొందరు ప్రముఖులతోనూ భేటీ కానున్నారు. వెంకయ్యనాయుడు శనివారం సెనెగల్‌ నుంచి ఖతార్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఖతార్‌ రాజధాని దోహా విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఖతార్‌లో భారతీయులు కూడా సాదర స్వాగతం పలికారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు 50 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఉత్సవాలకు సిద్ధమవుతున్న వేళ.. ఆయన ఖతార్‌కు చేరుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు