రాయుడు లేకే ఓటమి పాలు: ధోనీ

అంబటి రాయుడు లేకపోవడంతో ఓటమి పాలవుతున్నామని చెన్నై సారథి ఎంఎస్‌ ధోనీ అంటున్నాడు. అతడు లేకపోవడంతో జట్టు సమతూకం దెబ్బతింటోందని పేర్కొన్నాడు. తర్వాతి మ్యాచ్‌కు అతడు అందుబాటులోకి వస్తే అంతా సర్దుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు....

Published : 26 Sep 2020 08:01 IST

అతడొస్తే అంతా సర్దుకుంటుందని ధీమాగా మహీ

దుబాయ్‌: అంబటి రాయుడు లేకపోవడంతో ఓటమి పాలవుతున్నామని చెన్నై సారథి ఎంఎస్‌ ధోనీ అంటున్నాడు. అతడు లేకపోవడంతో జట్టు సమతూకం దెబ్బతింటోందని పేర్కొన్నాడు. తర్వాతి మ్యాచ్‌కు అతడు అందుబాటులోకి వస్తే అంతా సర్దుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు. దిల్లీ చేతిలో ఘోర పరాజయం తర్వాత మహీ మాట్లాడాడు.

దుబాయ్‌ వేదికగా జరిగిన మ్యాచులో మొదట బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ 3 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. పృథ్వీషా (64; 43 బంతుల్లో 9×4, 1×6), ధావన్‌ (35; 27 బంతుల్లో 3×4, 1×6), రిషభ్ పంత్‌ (37*; 25 బంతుల్లో 5×4), శ్రేయస్‌ అయ్యర్‌ (26; 22 బంతుల్లో 1×4) అదరగొట్టారు. ఛేదనకు దిగిన చెన్నైకి శుభారంభం దక్కలేదు. ఓపెనర్లిద్దరూ 34 పరుగుల్లోపే ఔటయ్యారు. ధోనీ (15; 12 బంతుల్లో 2×4) సైతం పరుగులేమీ చేయలేదు. డుప్లెసిస్‌ (43; 35 బంతుల్లో 4×4) ఒక్కడే రాణించాడు. దాంతో మహీసేన 131/7 పరుగులకే పరిమితమైంది.

‘అంబటి రాయుడు లేకపోవడంతో చివరి రెండు మ్యాచుల్లో ఓడిపోయాం. బ్యాటింగ్‌ ఆర్డర్లో సమతూకం రావడం లేదు. ఇది మాకు మంచి మ్యాచ్‌కాదు. తేమ లేనప్పటికీ వికెట్‌ నెమ్మదించింది. బ్యాటింగ్‌ విభాగంలో కసి తగ్గడం మమ్మల్ని బాధిస్తోంది. దూకుడైన ఆరంభం లేకపోవడంతో రన్‌రేట్‌తో పాటు ఒత్తిడి పెరుగుతోంది. స్పష్టమైన లక్ష్యం, కూర్పుతో మేం బరిలోకి దిగాలి. తర్వాతి మ్యాచ్‌లో రాయుడు వస్తే జట్టు సమతూకం మెరుగవ్వొచ్చు. అలా జరిగితే ఒక అదనపు బౌలర్‌తో ప్రయోగాలు చేసేందుకూ వీలుంటుంది’ అని ధోనీ అన్నాడు. ముంబయితో జరిగిన తొలి మ్యాచులో 48 బంతుల్లో 71 పరుగులతో అదరగొట్టిన రాయుడు గాయపడ్డ సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని