IND vs SL: టీమ్‌ఇండియా చెత్త రికార్డు.. 49 ఏళ్ల వన్డే క్రికెట్‌ చరిత్రలో తొలిసారి

ఆసియా కప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన సూపర్‌-4 మ్యాచ్‌లో టీమ్‌ఇండియా (Team India) 41 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.  మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించినా ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. 

Published : 13 Sep 2023 18:34 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్‌లో భాగంగా మంగళవారం శ్రీలంక (Srilanka)తో జరిగిన సూపర్‌-4 మ్యాచ్‌లో టీమ్‌ఇండియా (Team India) 41 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా భారీ స్కోరు చేస్తుందని భావించగా.. శ్రీలంక స్పిన్నర్ల ధాటికి 213 పరుగులకే ఆలౌటైంది. అనంతరం టీమ్‌ఇండియా బౌలర్లు కూడా చెలరేగడంతో ఆతిథ్య శ్రీలంక 172 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించినా ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. 

ఆసియా కప్‌ ఫైనల్‌ : భారత్‌ vs పాక్‌ పోరును మళ్లీ చూస్తామా..? సమీకరణాలు ఎలా ఉన్నాయంటే..?

మ్యాచ్‌లో భారత్‌ పదికి పది వికెట్లు స్పిన్నర్లకే సమర్పించుకుంది. 49 ఏళ్ల భారత వన్డే క్రికెట్‌ చరిత్రలో బ్యాటర్లందరూ ఇలా స్పిన్‌ బౌలింగ్‌లో ఔట్‌ కావడం ఇదే మొదటిసారి. యువ స్పిన్ ఆల్‌రౌండర్‌ దునిత్‌ వెల్లలాగె (40/5) టీమ్‌ఇండియా టాప్‌ ఆర్డర్‌ను పెవిలియన్‌కు పంపాడు. తర్వాత అసలంక (4/18) విజృంభించగా.. మహీశ్‌ తీక్షణ చివరి వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ను ఆలౌట్ చేయడం ద్వారా శ్రీలంక అరుదైన రికార్డును అందుకుంది. వన్డేల్లో వరుసగా 14 సార్లు ప్రత్యర్థి జట్టును ఆలౌట్‌ చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలోనే 13 మ్యాచ్‌ల్లో వరుస విజయాలతో జైత్రయాత్ర కొనసాగిస్తున్న శ్రీలంకకు భారత్‌ చేతిలో పరాభావం ఎదురైంది. భారత్‌ తన చివరి సూపర్‌-4 మ్యాచ్‌లో శుక్రవారం బంగ్లాదేశ్‌ను ఢీకొననుంది. అంతకంటే ముందు గురువారం కీలక పోరులో పాక్‌, లంక తలపడతాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్లో భారత్‌ను ఢీకొంటుంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దయితే మెరుగైన రన్‌రేట్‌ కలిగిన శ్రీలంక ఫైనల్‌ చేరుతుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని