Stephen Fleming: చెన్నైకి షాక్‌ తప్పదా.. ఐదుగురు బౌలర్ల గైర్హాజరీపై ఫ్లెమింగ్‌ ఏమన్నాడంటే?

లీగ్‌ స్టేజ్‌ చివరిదశకు చేరుకుంటున్న సమయంలో అన్ని ఫ్రాంచైజీలకు ఇబ్బందులు తప్పేలా లేవు. మరీ ముఖ్యంగా చెన్నై అభిమానులకు నిరాశ కలిగించే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Published : 02 May 2024 14:37 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్‌లో చెన్నై నిలకడగా విజయాలు సాధించలేకపోతోంది. తాజాగా పంజాబ్‌ చేతిలోనూ ఓటమి పాలైనప్పటికీ ఆ జట్టు టాప్‌-4లో కొనసాగుతోంది. ప్లే ఆఫ్స్ బెర్తు రేసు రసవత్తరంగా మారిన తరుణంలో ఇకపై ప్రతీ మ్యాచ్‌ గెలవాల్సిందే. ఇటువంటి సమయంలో చెన్నై అభిమానులకు నిరాశ కలిగించే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మే 5న ధర్మశాల వేదికగా పంజాబ్‌తోనే చెన్నై తన తదుపరి మ్యాచ్‌ ఆడనుంది. అయితే, ఐదుగురు బౌలర్లు దూరమయ్యే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అందులో ముస్తాఫిజుర్ రహ్మాన్ తన దేశానికి వెళ్లిపోవడం ఖాయం. బుధవారం ఆడిన మ్యాచ్‌ అతడికి ఈ సీజన్‌లో చివరిది. టీ20 ప్రపంచకప్‌ కోసం సన్నాహాల్లో భాగంగా బంగ్లా బోర్డు అతడిని వెనక్కి పిలిపించింది. కనీసం లీగ్‌ మ్యాచ్‌ల వరకూ అనుమతివ్వాలని సీఎస్కే మేనేజ్‌మెంట్ కోరినా బంగ్లా బోర్డు సమ్మతించలేదు. పతిరన గాయాల బారినపడటంతో పాటు తీక్షణతో కలిసి శ్రీలంకకు వెళ్లాడు. వీసా సంబంధిత వ్యవహారాల కోసం స్వదేశానికి వెళ్లినట్లు సమాచారం. దీపక్ చాహర్ కూడా గాయపడటంతో పంజాబ్‌తో మ్యాచ్‌లో మధ్యలోనే వైదొలిగాడు. తుషార్‌ దేశ్‌పాండే జ్వరం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నట్లు చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌ వెల్లడించాడు. 

‘‘దీపక్ చాహర్‌ పూర్తి ఫిట్‌నెస్‌తో లేడు. గాయం కారణంగా మైదానాన్ని వీడాడు. అతడి రిపోర్ట్ కోసం వేచి చూస్తున్నాం. ఫిజియో, వైద్యులు అతడిని పరిశీలిస్తున్నారు. శ్రీలంకకు చెందిన పతిరన, తీక్షణ వీసా కోసం వెళ్లారు. త్వరగా పూర్తై ధర్మశాల చేరుకుంటారని ఆశిస్తున్నాం. డెబ్యూ చేసిన రిచర్డ్ మంచి ప్రదర్శనే ఇచ్చాడు. తుషార్‌ జ్వరం బారినపడ్డాడు. అందుకే, పంజాబ్‌తో మ్యాచ్‌లో మార్పులు చేయాల్సివచ్చింది’ అని ఫ్లెమింగ్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని