No Ball Controversy: పాక్‌ క్రీడాకారులకు నిబంధనలు తెలియవు.. ఆటపై బుర్రపెట్టలేదు: సల్మాన్‌ భట్‌

పాక్‌ ఆటగాళ్లకు మ్యాచ్‌పై శ్రద్ధలేదని ఆ దేశ మాజీ కెప్టెన్‌ విమర్శించారు. కనీసం ఆట నిబంధలు.. వాటిని సందర్భాన్ని బట్టి అన్వయించుకోవడం కూడా తెలియదని తప్పుబట్టాడు. 

Updated : 26 Oct 2022 10:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగిన తొలిమ్యాచ్‌లో తమ దేశ ఆటగాళ్లు శ్రద్ధ పెట్టలేదని పాక్‌ మాజీ కెప్టెన్‌ సల్మాన్‌ భట్‌ విమర్శించాడు. అంతేకాదు.. కోహ్లీ పూర్తిగా ఆటలో నిమగ్నమైపోవడంతోనే అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకొని భారత్‌ను గెలిపించాడని పొగడ్తలతో ముంచెత్తాడు. ఇక సెలక్షన్‌ కమిటీ ప్రాథమిక అంశాలను కూడా విస్మరించిందని తప్పుబట్టాడు. సల్మాన్‌ భట్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడుతూ చివరి ఓవర్‌ నాలుగో బంతి కచ్చితంగా నోబాలే అని పేర్కొన్నాడు. మ్యాచ్‌లో చివరి వరకూ విజయం ఇరుపక్షాల మధ్య దోబూచులాడిందని.. కేవలం విరాట్‌ యత్నంతోనే భారత్‌ మ్యాచ్‌ గెలిచిందన్నాడు.

‘‘నోబాల్‌ వివాదానికి వస్తే బంతి బ్యాట్‌కు కనెక్ట్‌ అయ్యే సమయంలో బ్యాటర్‌ నడుము కంటే కొంచెం ఎత్తులో ఉంది. అంటే.. నోబాల్‌ అనిపించుకొనే అర్హత దానికి ఉంది. ఆ బంతికి సిక్స్‌ కొట్టాడు. అదే వికెట్‌ పడితే.. నోబాలా కాదా అనే అంశంపై థర్డ్‌ అంపైర్‌కు వెళ్లవచ్చు. అంటే ఈ మ్యాచ్‌లో థర్డ్‌ అంపైర్‌ వద్దకు వెళ్లే అవకాశమే లేదు. ఇక ఫ్రీహిట్‌ విషయానికి వస్తే.. రనౌట్‌, బంతిని చేతితో ఆపటం,ఫీల్డింగ్‌ను అడ్డుకోవడం, రెండుసార్లు బంతిని కొట్టడం వంటివి జరిగితేనే ఔట్‌గా ఇస్తారు. ఇవి కాకుండా ఏం జరిగినా ఔట్‌ కాదు. ఇక్కడ బంతి వికెట్లను తాకి థర్డ్‌మెన్‌ వైపు వెళ్లింది. ఈ సమయంలోనే ‘ప్రజన్స్‌ ఆఫ్‌ మైండ్‌’ చాలా ముఖ్యం. అది ఉండటంతో బ్యాటర్లు మూడు పరుగులు చేశారు. దురదృష్టవశాత్తు మనవాళ్లు (పాక్‌ ఆటగాళ్లు) ఆటపై అవగాహన లేకుండా అంపైర్‌తో వాగ్వాదానికి దిగారు. ప్రపంచ వ్యాప్తంగా లీగ్స్‌ ఆడే పాక్‌ ఆటగాళ్లకు క్రికెట్‌ నిబంధనలు తెలిసి ఉండాలి. క్రికెట్‌ చట్టాలు.. వాటిని సందర్భానికి అన్వయించుకొనే విషయానికి వస్తే మనవాళ్ల తీరుకు ఓ ఉదాహరణ చెబుతా. కిందటి ప్రపంచకప్‌ మ్యాచ్‌లో డేవిడ్‌ వార్నర్‌.. హఫీజ్‌ వేసిన బంతిని సిక్స్‌ కొట్టాడు. వాస్తవానికి ఆ బంతి హఫీజ్‌ చేయిజారి పిచ్‌ మధ్యలో పడింది. అది నోబాల్‌. రెండు సార్లు నేలను తాకిన బంతిని కూడా చాలా అవగాహనతో వార్నర్‌ సిక్స్‌గా మలిచాడు. ఆ బంతికి అతడు అవుటయ్యే ఛాన్స్‌ లేదు.. ఈ విషయంపై స్పష్టమైన అవగాహన ఉండటంతో ధైర్యం చేసి సిక్స్‌ కొట్టాడు. దీంతో సిక్స్‌, నోబాల్‌ రన్‌, ఫ్రీ హిట్‌ లభించాయి. అప్పుడు కూడా పాక్‌ ఆటగాళ్లు అంపైర్‌తో చర్చలు జరిపారు. క్రికెట్‌ చట్టాలను అన్వయించుకోవడం, తెలుసుకోవడంలో ఆటగాళ్ల లోపాన్ని ఇది తెలియజేస్తోంది. ఇటువంటి సందర్భాలు తక్కువగా వస్తాయి.. కానీ.. అవి కూడా ఒత్తిడితో కూడిన మ్యాచుల్లోనే ఎదురవుతాయి’’

‘‘ప్రస్తుత చర్చ కారణంగా.. అద్భుతమైన ఈ మ్యాచ్‌ స్థాయి తగ్గుతోంది. ఫాస్ట్‌బౌలింగ్‌ చూడండి.. కొత్త బంతితో భారత్‌ బౌలర్లు రాణించారు.. పాక్‌ ఆటగాళ్లూ వికెట్లు సాధించారు. రోహిత్‌, రాహుల్‌, బాబర్‌, రిజ్వాన్‌ ప్రపంచ స్థాయి ఆటగాళ్లు. పిచ్‌ నుంచి మద్దతు రావడంతో బౌలర్లు వారిని కుదురుకోకుండా చేశారు. ఇక తన కెరీర్‌లో ఈ ఇన్నింగ్స్‌ను కోహ్లీ లాంటి అద్భుతమైన ఆటగాడు బెస్ట్‌గా పేర్కొన్నాడు. పాక్‌ ఆటగాళ్లు చట్టాలు తెలుసుకోవాలి. మీ హక్కు కోసం మాట్లాడేటప్పుడు.. మీరు ఎక్కడ ఉన్నారో తెలుసుకొని మీ మాటకు విలువ ఉండేట్లు చూసుకోవాలి’’ అని అభిప్రాయపడ్డాడు.  భవిష్యత్తులో పాక్‌ టీమ్‌ సెలక్షన్‌ను మెరుగుపర్చుకోవాలని సల్మాన్‌ సూచించాడు. ఆస్ట్రేలియా వంటి పిచ్‌లపై నలుగురు ఫాస్ట్‌ బౌలర్లతో ఆడిస్తే ఫలితాలు ఉంటాయన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని