GT vs RR: సూపర్‌ హిట్‌మయర్‌

ఆహా.. విధ్వంసం అదిరిపోయింది. ఇటు శాంసన్‌.. అటు హెట్‌మయర్‌ దంచుడే దంచుడు. ప్రతికూల పరిస్థితుల్లో ఇద్దరూ వీరవిహారం చేయడంతో టైటాన్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్‌ విజయాన్ని లాగేసుకుంది.

Updated : 17 Apr 2023 07:43 IST

విండీస్‌ స్టార్‌ సంచలన ఇన్నింగ్స్‌
చెలరేగిన శాంసన్‌
గుజరాత్‌పై రాజస్థాన్‌ విజయం
అహ్మదాబాద్‌

ఆహా.. విధ్వంసం అదిరిపోయింది. ఇటు శాంసన్‌.. అటు హెట్‌మయర్‌ దంచుడే దంచుడు. ప్రతికూల పరిస్థితుల్లో ఇద్దరూ వీరవిహారం చేయడంతో టైటాన్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్‌ విజయాన్ని లాగేసుకుంది. 178 పరుగుల లక్ష్య ఛేదనలో పది ఓవర్లు ముగిసేసరికి 53 పరుగులే చేసిన రాయల్స్‌.. మరో నాలుగు బంతులు మిగిలుండగానే పని పూర్తి చేసింది.

రాజస్థాన్‌ రాయల్స్‌కు అదిరే విజయం. హెట్‌మయర్‌ (56 నాటౌట్‌; 26 బంతుల్లో 2×4, 5×6), సంజు శాంసన్‌ (60; 32 బంతుల్లో 3×4, 6×6) చెలరేగడంతో ఆదివారం రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో ఆ జట్టు 3 వికెట్ల తేడాతో గుజరాత్‌ టైటాన్స్‌ను ఓడించింది. మిల్లర్‌ (46; 30 బంతుల్లో 3×4, 2×6), శుభ్‌మన్‌ గిల్‌ (45; 34 బంతుల్లో 4×4, 1×6), హార్దిక్‌ పాండ్య (28; 19 బంతుల్లో 3×4, 1×6), అభినవ్‌ మనోహర్‌ (27; 13 బంతుల్లో 3×6) బ్యాట్‌ ఝుళిపించడంతో మొదట గుజరాత్‌ 7 వికెట్లకు 177 పరుగులు చేసింది. హెట్‌మయర్‌, సంజు మెరుపులతో లక్ష్యాన్ని రాజస్థాన్‌ 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

ఆ ఇద్దరు అదరహో..: ఆరు ఓవర్లలో 26/2, 10 ఓవర్లు ముగిసేసరికి 53/3. ఛేదనలో తడబడ్డ  రాజస్థాన్‌ రాయల్స్‌ పరిస్థితిది. ఆ జట్టుకు గెలుపు కష్టమే అనిపించింది. కానీ టైటాన్స్‌కు షాకిస్తూ.. మెరుపు విన్యాసాలతో సంజు శాంసన్‌, విధ్వంసక ఇన్నింగ్స్‌తో హెట్‌మయర్‌ విజయాన్ని లాగేసుకున్నారు. ఈ కుర్రాళ్ల బ్యాటింగ్‌ అదరహో. ఆరంభంలో రాజస్థాన్‌ పరుగులు చూసిన వారికి ఆ జట్టు విజయం ఆశ్చర్యం కలిగిస్తుంది.  టైటాన్స్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పరుగులు ధాటిగా చేయలేకపోయిన రాజస్థాన్‌.. బట్లర్‌ (0)తో పాటు జైస్వాల్‌ (1), పడిక్కల్‌ (26; 25 బంతుల్లో 2×4, 2×6) వికెట్లను కోల్పోయింది. అప్పటికే నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసిన హార్దిక్‌ 24 పరుగులే ఇచ్చి ఓ వికెట్‌ పడగొట్టగా.. షమి మూడు ఓవర్లలో కేవలం 9 పరుగులకే ఓ వికెట్‌ తీశాడు. ఓ వైపు శాంసన్‌ నిలిచినా ధాటిగా ఆడలేకపోయాడు. తొలి 20 బంతుల్లో 18 పరుగులే చేశాడు. మరోవైపు 11వ ఓవర్లో పరాగ్‌ (5) కూడా ఔటయ్యాడు. సాధించాల్సిన రన్‌రేట్‌ దాదాపు 13కు చేరగా.. రాజస్థాన్‌కు చాలా కష్టమే అనిపించింది. కానీ ఇన్నింగ్స్‌ ద్వితీయార్ధం ఆ జట్టుదే. శాంసన్‌కు విధ్వంసక వీరుడు హెట్‌మయర్‌ తోడవడంతో మ్యాచ్‌ స్వరూపమే మారిపోయింది. రషీద్‌ ఖాన్‌కు శాంసన్‌ చుక్కలు చూపించాడు. 11వ ఓవర్లో అతడి బౌలింగ్‌లో ఓ సిక్స్‌ దంచిన శాంసన్‌.. అతడి తర్వాతి ఓవర్లో వరుసగా 6, 6, 6 బాదేశాడు.  కాసేపు జాగ్రత్తగా ఆడిన హెట్‌మయర్‌.. జోసెఫ్‌ బౌలింగ్‌లో సిక్స్‌, ఫోర్‌ బాదాడు. 15వ ఓవర్లో శాంసన్‌ ఔట్‌ కాగా.. చివరి 5 ఓవర్లలో రాజస్థాన్‌ 64 పరుగులు చేయాల్సిన పరిస్థితి. కానీ స్వేచ్ఛగా చెలరేగిపోయిన హెట్‌మయర్‌ సిక్స్‌లు, ఫోర్లతో అదరగొట్టాడు. అతడి ధాటికి 16వ ఓవర్లో జోసెఫ్‌ 20 పరుగులు ఇచ్చాడు. 18వ ఓవర్లో రషీద్‌ 13 పరుగులిచ్చాడు. 19వ ఓవర్లో జురెల్‌ సిక్స్‌, అశ్విన్‌ ఫోర్‌ సిక్స్‌ కొట్టి ఔట్‌ కావడంతో రాజస్థాన్‌కు చివరి ఓవర్లో 7 పరుగులు చేయాల్సివచ్చింది. తొలి బంతికి రెండు తీసిన హెట్‌మయర్‌.. తర్వాతి బంతికి సిక్స్‌ కొట్టి పని పూర్తి చేశాడు.

రాణించిన మిల్లర్‌, గిల్‌: అంతకుముందు గిల్‌, హార్దిక్‌ గుజరాత్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దితే.. మిల్లర్‌, అభినవ్‌ మెరుపు ముగింపునిచ్చారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు అంత మంచి ఆరంభమేమీ దక్కలేదు. సాహా, సుదర్శన్‌ పెవిలియన్‌ చేరగా ఆ జట్టు 5 ఓవర్లలో 32/2తో నిలిచింది. ఓ వైపు నిలబడ్డ ఓపెనర్‌ గిల్‌కు ఆ దశలో తోడయ్యాడు హార్దిక్‌. ఇద్దరూ చక్కగా బ్యాటింగ్‌ చేశారు. 59 పరుగుల వీరి భాగస్వామ్యం గుజరాత్‌ ఇన్నింగ్స్‌ను నిలబెట్టడమే కాదు.. ఆఖర్లో బ్యాటర్లు విధ్వంసం సృష్టించడానికి ఉపయోగపడింది.  11వ ఓవర్లో హార్దిక్‌ను చాహల్‌ ఔట్‌ చేసేటప్పటికి గుజరాత్‌ స్కోరు 91. అక్కడ గిల్‌కు మిల్లర్‌ తోడైనా పరుగులు ఎక్కువ వేగంగా రాలేదు. ఎదుర్కొన్న తొలి 14 బంతుల్లో మిల్లర్‌ 11 పరుగులే చేశాడు. అయితే ఆ తర్వాత చాహల్‌ (15వ ఓవర్‌) బౌలింగ్‌లో ఓ సిక్స్‌ కొట్టి అతడు జోరందుకున్నాడు. తర్వాతి ఓవర్లోనే గిల్‌ నిష్క్రమించినా.. మిల్లర్‌, అభినవ్‌ మనోహర్‌ చెలరేగిపోవడంతో టైటాన్స్‌ ఆఖరి నాలుగు ఓవర్లలో 52 పరుగులు రాబట్టింది. ఈ జంట అయిదో వికెట్‌కు 22 బంతుల్లోనే 45 పరుగులు జోడించింది.


గుజరాత్‌ ఇన్నింగ్స్‌: సాహా (సి) అండ్‌ (బి) బౌల్ట్‌ 4; గిల్‌ (షి) బట్లర్‌ (బి) సందీప్‌ 45; సుదర్శన్‌ రనౌట్‌ 20; హార్దిక్‌ (సి) జైస్వాల్‌ (బి) చాహల్‌ 28; మిల్లర్‌ (సి) హెట్‌మయర్‌ (బి) సందీప్‌ 46; మనోహర్‌ (సి) పడిక్కల్‌ (బి) జంపా 27; తెవాతియా నాటౌట్‌ 1; రషీద్‌ రనౌట్‌ 1; జోసెఫ్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 177;

వికెట్ల పతనం: 1-5, 2-32, 3-91, 4-121, 5-166, 6-175, 7-176;

బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-46-1; సందీప్‌ 4-0-25-2; జంపా 4-0-32-1; అశ్విన్‌ 4-0-37-0; చాహల్‌ 4-0-36-1


రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌: యశస్వి (సి) శుభ్‌మన్‌ (బి) హార్దిక్‌ 1; బట్లర్‌ (బి) షమి 0; పడిక్కల్‌ (సి) మోహిత్‌ (బి) రషీద్‌ 26; శాంసన్‌ (సి) మిల్లర్‌ (బి) నూర్‌ అహ్మద్‌ 60; పరాగ్‌ (సి) మిల్లర్‌ (బి) రషీద్‌ 5; హెట్‌మయర్‌ నాటౌట్‌ 56; ధ్రువ్‌ జురెల్‌ (సి) మోహిత్‌ (బి) షమి 18; అశ్విన్‌ (సి) తెవాతియా (బి) షమి 10; బౌల్ట్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 3 మొత్తం: (19.2 ఓవర్లలో 7 వికెట్లకు) 179;

వికెట్ల పతనం: 1-2, 2-4, 3-47, 4-55, 5-114, 6-161, 7-171;

బౌలింగ్‌: షమి 4-1-25-3; హార్దిక్‌ 4-0-24-1; జోసెఫ్‌ 3-0-47-0; రషీద్‌ 4-0-46-2; మోహిత్‌ 2-0-7-0;  నూర్‌ అహ్మద్‌ 2.2-0-29-1


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని