RCB vs CSK: దంచుడు పోటీలో చెన్నై పైచేయి

కాన్వే, రహానెలది క్లాస్‌ కొట్టుడు.. దూబెది నాటు కొట్టుడు..! మాకేం తక్కువ అన్నట్లుగా రెండో ఇన్నింగ్స్‌లో మ్యాక్స్‌వెల్‌, డుప్లెసిస్‌లది ఇంకో స్థాయి వీరబాదుడు! ఎవరు గెలిచారు.. ఎవరు ఓడారన్నది పక్కన పెడితే.. ఐపీఎల్‌లో అత్యంత ఆకర్షణీయ జట్లయిన చెన్నై, బెంగళూరు జట్ల మధ్య మెగా మ్యాచ్‌ చూసేందుకు చిన్నస్వామి స్టేడియానికి వచ్చిన అభిమానులకు పండగే.

Updated : 18 Apr 2023 07:48 IST

చెలరేగిన కాన్వే, దూబె, రహానె
మ్యాక్స్‌వెల్‌, డుప్లెసిస్‌ మెరుపులు వృథా
పోరాడి ఓడిన బెంగళూరు

కాన్వే, రహానెలది క్లాస్‌ కొట్టుడు.. దూబెది నాటు కొట్టుడు..!
మాకేం తక్కువ అన్నట్లుగా రెండో ఇన్నింగ్స్‌లో మ్యాక్స్‌వెల్‌, డుప్లెసిస్‌లది ఇంకో స్థాయి వీరబాదుడు!
ఎవరు గెలిచారు.. ఎవరు ఓడారన్నది పక్కన పెడితే.. ఐపీఎల్‌లో అత్యంత ఆకర్షణీయ జట్లయిన చెన్నై, బెంగళూరు జట్ల మధ్య మెగా మ్యాచ్‌ చూసేందుకు చిన్నస్వామి స్టేడియానికి వచ్చిన అభిమానులకు పండగే. టీవీల ముందు చూస్తున్న కోట్ల మందికి కూడా అపరిమిత వినోదమే.
227 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించి కూడా చెన్నై చచ్చీ చెడీ గెలిచిందంటే ఈ మ్యాచ్‌లో బ్యాటర్ల ఊచకోత ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. నాలుగు క్యాచ్‌లు జారవిడిచి పీకల మీదికి తెచ్చుకున్న సీఎస్‌కే ఆఖరి ఓవర్లలో వికెట్లు పడగొట్టడంతో గట్టెక్కింది.

బెంగళూరు

చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వర్షం కురిసిన మ్యాచ్‌లో చెన్నై అతి కష్టం మీద గట్టెక్కింది. సోమవారం ఆ జట్టు 8 పరుగుల బెంగళూరును ఓడించింది. మొదట ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కాన్వే (83; 45 బంతుల్లో 6×4, 6×6), దూబె (52; 27 బంతుల్లో 2×4, 5×6), రహానె (37; 20 బంతుల్లో 3×4, 2×6) మెరుపులతో చెన్నై 6 వికెట్లకు 226 పరుగులు చేసింది. అనంతరం మ్యాక్స్‌వెల్‌ (76; 36 బంతుల్లో 3×4, 8×6), డుప్లెసిస్‌ (62; 33 బంతుల్లో 5×4, 4×6) విధ్వంసం సృష్టించడంతో ఆర్సీబీ ఛేదనలో దూసుకెళ్లినా.. చివరి ఓవర్లలో ఒత్తిడికి గురై వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఓటమి తప్పలేదు. తుషార్‌ దేశ్‌పాండే (3/45), పతిరన (2/42) బెంగళూరును దెబ్బ తీశారు.

పేలవ ఆరంభం.. ఆపై విధ్వంసం: లక్ష్యం చూస్తే 227.. 2 ఓవర్లు అయ్యేసరికి బెంగళూరు స్కోరేమో 15/2. అందులోనూ సూపర్‌ ఫామ్‌లో ఉన్న కోహ్లి (6) నాలుగో బంతికే వెనుదిరిగాడు. లొమ్రార్‌ (0) ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. ఇలాంటి ఆరంభం దక్కిన జట్టు అంత పెద్ద లక్ష్యానికి చేరువగా వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. కానీ మ్యాక్స్‌వెల్‌, డుప్లెసిస్‌ కలిసి మొత్తం కథ మార్చేశారు. కోహ్లిని బౌల్డ్‌ చేసిన ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’ ఆకాశ్‌ సింగ్‌ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాదడంతో ఆర్సీబీ మీద ఒత్తిడంతా ఎగిరిపోయింది. తర్వాత డుప్లెసిస్‌ సైతం గేర్‌ మార్చాడు. ఇద్దరూ గల్లీ క్రికెట్‌ చూస్తున్న భావన కలిగిస్తూ.. పదే పదే బంతిని గాల్లోకి లేపి నేరుగా బౌండరీ అవతల పడేశారు. వీరి ధాటికి 4 ఓవర్ల వ్యవధిలో 60 పరుగులు రాబట్టిన బెంగళూరు పవర్‌ప్లే ముగిసేటప్పటికి 75/2కు చేరుకుంది. 9వ ఓవర్లోనే బెంగళూరు 100 దాటేయగా.. డుప్లెసిస్‌ 23 బంతుల్లో, మ్యాక్సీ 24 బంతుల్లో అర్ధశతకాలు అందుకున్నారు. 12 ఓవర్లకు 141/2తో నిలిచిన బెంగళూరు సులువుగానే లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. కానీ మ్యాక్స్‌వెల్‌, డుప్లెసిస్‌ వరుస ఓవర్లలో వెనుదిరగడంతో చెన్నై పోటీలోకి వచ్చింది. వీళ్లిద్దరూ స్పిన్నర్ల బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడబోయి గురి తప్పడంతో వికెట్‌ కీపర్‌ ధోనీకి దొరికిపోయారు. తర్వాత దినేశ్‌ కార్తీక్‌ కొన్ని మెరుపు షాట్లు ఆడి బెంగళూరు ఆశలను సజీవంగా ఉంచాడు. కానీ 20 బంతుల్లో 36 పరుగులు చేయాల్సిన స్థితిలో కార్తీక్‌ (28; 14 బంతుల్లో 3×4, 1×6) వెనుదిరగడంతో మ్యాచ్‌ చెన్నై వైపు మొగ్గింది. ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’గా వచ్చిన ప్రభుదేశాయ్‌ (19; 11 బంతుల్లో 2×6) చివరిదాకా పోరాడినా ఆర్సీబీని గెలిపించలేకపోయాడు. మ్యాచ్‌లో చెన్నై ఏకంగా నాలుగు క్యాచ్‌లు జారవిడిచింది. డుప్లెసిస్‌ ఖాతా తెరవకుండానే వెనుదిరగాల్సింది. అతడి క్యాచ్‌ను ధోని తప్పుగా అంచనా వేయడం వల్ల అందుకోలేకపోయాడు. లొమ్రార్‌, మ్యాక్స్‌వెల్‌, కార్తీక్‌ల క్యాచ్‌లు కూడా నేలపాలయ్యాయి.

చెన్నై వీరబాదుడు..: మొదట టాస్‌ గెలిచి చెన్నైకి బ్యాటింగ్‌ చేయనిచ్చినందుకు బెంగళూరు చింతించే ఉంటుంది. రుతురాజ్‌ (3)ను ఔట్‌ చేసి సిరాజ్‌ బెంగళూరుకు శుభారంభమే అందించినా.. ఆ జట్టు అంతకుమించి ఆనందించడానికి ఏమీ లేకపోయింది. మరో ఓపెనర్‌ కాన్వే చెలరేగి ఆడటం.. ఈ సీజన్లో సంచలన బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న రహానె మరోసారి దూకుడుగా ఆడటంతో చెన్నై స్కోరు బోర్డు ఎక్స్‌ప్రెస్‌ వేగంతో దూసుకెళ్లింది. ఇద్దరూ శక్తి కంటే టైమింగ్‌ను ఉపయోగించి అలవోకగా భారీ షాట్లు ఆడారు. రహానె వచ్చీ రాగానే రెండు సిక్సర్లు బాదేశాడు. కాన్వే సైతం అలవోకగా బంతిని స్టాండ్స్‌లోకి తీసుకెళ్లాడు. పవర్‌ప్లే అయ్యేసరికి 53/1తో ఉన్న చెన్నై.. 9 ఓవర్లకు 83/1కు చేరుకుంది. తర్వాతి ఓవర్లో రహానెను హసరంగ గూగ్లీతో బౌల్డ్‌ చేశాడు. రహానె వికెట్‌ పడ్డాక బెంగళూరు పని పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్లయింది. నాలుగో స్థానంలో వచ్చిన దూబె మరింతగా చెలరేగిపోయాడు. అతను కూడా ఓ బంతిని స్టేడియం పైకప్పును తాకేలా కొట్టాడు. కాన్వే కూడా టాప్‌ గేర్‌ను అందుకోవడంతో 11-15 మధ్య అయిదు ఓవర్లలోనే చెన్నై 67 పరుగులు రాబట్టడం విశేషం. తన ఐపీఎల్‌ అరంగేట్ర మ్యాచ్‌లో పొదుపుగా బౌలింగ్‌ చేసి 3 వికెట్లు పడగొట్టిన వైశాఖ్‌.. చెన్నై బ్యాటర్ల ధాటికి 4 ఓవర్లలో ఏకంగా 62 పరుగులు సమర్పించుకుని ఒక వికెట్‌తో సరిపెట్టుకున్నాడు. సెంచరీ దిశగా సాగుతున్న కాన్వేను 16వ ఓవర్లో హర్షల్‌ బౌల్డ్‌ చేయడం, వెంటనే దూబె కూడా వెనుదిరగడంతో స్కోరు వేగం కాస్త తగ్గింది. కానీ చివర్లో రాయుడు (14), మొయిన్‌  అలీ (19 నాటౌట్‌), జడేజా (10) ధాటిగా ఆడి స్కోరును 220 దాటించారు. చివరి ఓవర్లో హర్షల్‌ 2 బీమర్లు వేయడంతో అతణ్ని అంపైర్‌ బౌలింగ్‌ నుంచి తప్పించాడు. దీంతో చివరి 4 బంతులు మ్యాక్స్‌వెల్‌ వేశాడు.

చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ (సి) పార్నెల్‌ (బి) సిరాజ్‌ 3; కాన్వే (బి) హర్షల్‌ 83; రహానె (బి) హసరంగ 37; దూబె (సి) సిరాజ్‌ (బి) పార్నెల్‌ 52; రాయుడు (సి) కార్తీక్‌ (బి) వైశాఖ్‌ 14; మొయిన్‌ అలీ నాటౌట్‌ 19; జడేజా (సి) ప్రభుదేశాయ్‌ (బి) మ్యాక్స్‌వెల్‌ 10; ధోని నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 226; వికెట్ల పతనం: 1-16, 2-90, 3-170, 4-178, 5-198, 6-224; బౌలింగ్‌: సిరాజ్‌ 4-0-30-1; పార్నెల్‌ 4-0-48-1; విజయ్‌కుమార్‌ వైశాఖ్‌ 4-0-62-1; మ్యాక్స్‌వెల్‌ 2.4-0-28-1; హసరంగ 2-0-21-1; హర్షల్‌ పటేల్‌ 3.2-0-36-1

బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (బి) ఆకాశ్‌ 6; డుప్లెసిస్‌ (సి) ధోని (బి) మొయిన్‌ 62; మహిపాల్‌ (సి) రుతురాజ్‌ (బి) తుషార్‌ 0; మ్యాక్స్‌వెల్‌ (సి) ధోని (బి) తీక్షణ 76; షాబాజ్‌ (సి) రుతురాజ్‌ (బి) పతిరన 12; కార్తీక్‌ (సి) తీక్షణ (బి) తుషార్‌ 28; ప్రభుదేశాయ్‌ (సి) జడేజా (బి) పతిరన 19; పార్నెల్‌ (సి) దూబె (బి) తుషార్‌ 2; హసరంగ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 11 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 218; వికెట్ల పతనం: 1-6, 2-15,  3-141, 4-159, 5-191, 6-192, 7-197, 8-218; బౌలింగ్‌: ఆకాశ్‌ సింగ్‌ 3-0-35-1; తుషార్‌ దేశ్‌పాండే 4-0-45-3; తీక్షణ 4-0-41-1; జడేజా 4-0-37-0; పతిరన 4-0-42-2; మొయిన్‌ అలీ 1-0-13-1


రహానె కొడితే పైకప్పుపై..

టీ20లకు తగ్గట్లు వేగంగా ఆడలేడని ముద్ర వేయించుకున్న రహానె ఈ సీజన్లో తన శైలికి భిన్నంగా చెలరేగిపోతున్నాడు. ముంబయిపై 27 బంతుల్లో 61 పరుగుల సంచలన ఇన్నింగ్స్‌తో అందరినీ షాక్‌కు గురి చేసిన రహానె.. సోమవారం బెంగళూరుపైనా దూకుడు చూపించాడు. 20 బంతుల్లో 37 పరుగులు చేశాడు. మ్యాచ్‌లో తొలి రెండు సిక్సర్లు బాదింది అతనే. అతడి తొలి సిక్సర్‌కు బంతి ఏకంగా చిన్నస్వామి స్టేడియం పైకప్పుపై పడటం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని