SRH vs MI: ముంబయిదే హ్యాట్రిక్‌

ముంబయి ఇండియన్స్‌ మురిసింది. ఛాంపియన్‌ ఆటతీరుతో హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో సత్తా చాటి ఐపీఎల్‌-16లో వరుసగా మూడో విజయం సాధించింది.

Updated : 19 Apr 2023 08:17 IST

సొంతగడ్డపై సన్‌రైజర్స్‌కు నిరాశే
సత్తాచాటిన గ్రీన్‌, తిలక్‌, బెరెన్‌డార్ఫ్‌

ముంబయి ఇండియన్స్‌ మురిసింది. ఛాంపియన్‌ ఆటతీరుతో హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో సత్తా చాటి ఐపీఎల్‌-16లో వరుసగా మూడో విజయం సాధించింది. ముంబయి లాగే తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడి, ఆ తర్వాత పుంజుకుని హ్యాట్రిక్‌ విజయంపై కన్నేసిన సన్‌రైజర్స్‌కు బ్రేక్‌ పడింది. ఈ సీజన్‌లో సొంతగడ్డపై మూడు మ్యాచ్‌లాడిన సన్‌రైజర్స్‌.. రెండో ఓటమితో అభిమానులను నిరాశపరిచింది.

ఈనాడు, హైదరాబాద్‌ : ఐపీఎల్‌-16ను రెండు ఓటములతో మొదలుపెట్టిన ముంబయి.. ఇప్పుడు వరుసగా మూడో విజయంతో అదరగొట్టింది. మంగళవారం కామెరూన్‌ గ్రీన్‌ (64; 40 బంతుల్లో 6×4, 2×6) మెరిసిన వేళ ఉప్పల్‌లో ముంబయి 14 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ను ఓడించింది. మొదట ముంబయి 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు సాధించింది. ముంబయికి ఆడుతున్న హైదరాబాద్‌ కుర్రాడు తిలక్‌ వర్మ (37; 17 బంతుల్లో 2×4, 4×6) సొంతగడ్డపై సత్తా చాటాడు. అనంతరం సన్‌రైజర్స్‌ 19.5 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటైంది. మయాంక్‌ అగర్వాల్‌ (48; 41 బంతుల్లో 4×4, 1×6), క్లాసెన్‌ (36; 16 బంతుల్లో 4×4, 2×6) పోరాడినా ఫలితం లేకపోయింది. బెరెన్‌డార్ఫ్‌ (2/37), మెరిడిత్‌ (2/33), పియూష్‌ చావ్లా (2/43) ఆ జట్టును దెబ్బ తీశారు.


ఆరంభం నుంచే తడబాటు

భారీ లక్ష్యమే అయినా గత మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన హ్యారీ బ్రూక్‌ ఉండటంతో సన్‌రైజర్స్‌ ధీమాగానే కనిపించింది. కానీ అతను 9 పరుగులే చేసి బెరెన్‌డార్ఫ్‌ బౌలింగ్‌లో వెనుదిరగడంతో ఛేదనలో సన్‌రైజర్స్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. రాహుల్‌ త్రిపాఠి (7)ని సైతం బెరెన్‌డార్ఫ్‌ ఎక్కువ సేపు నిలవనివ్వలేదు. బెరెన్‌డార్ఫ్‌తో కలిసి కొత్త బంతిని పంచుకున్న అర్జున్‌ తెందుల్కర్‌ కట్టుదిట్టంగా బంతులేసి ఆకట్టుకున్నాడు. 25/2తో కష్టాల్లో పడ్డ సన్‌రైజర్స్‌కు మయాంక్‌ అగర్వాల్‌, మార్‌క్రమ్‌ అండగా నిలిచారు. ఈ సీజన్‌లో తొలిసారి మయాంక్‌ ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్‌ చేశాడు. మార్‌క్రమ్‌ (22; 17 బంతుల్లో 1×4, 1×6)తో అతను 46 పరుగులు జోడించడంతో హైదరాబాద్‌ కోలుకున్నట్లే కనిపించింది. కానీ మార్‌క్రమ్‌, అభిషేక్‌శర్మ (1) ఒక్క పరుగు వ్యవధిలో ఔటవడంతో సన్‌రైజర్స్‌ 72/4తో మరోసారి చిక్కుల్లో పడింది. ఈ స్థితిలో అగర్వాల్‌కు క్లాసెన్‌ జత కలవడంతో మళ్లీ హైదరాబాద్‌లో ఆశలు కలిగాయి. ఇద్దరూ ముంబయి బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. క్లాసెన్‌.. పియూష్‌ చావ్లా వేసిన 14వ ఓవర్లో రెండేసి బౌండరీలు, సిక్సర్లతో చెలరేగాడు. దీంతో సమీకరణం 37 బంతుల్లో 66 పరుగులతో కాస్త అందుబాటులోకి వచ్చింది. కానీ చావ్లా చివరి బంతికి కూడా భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించిన క్లాసెన్‌ లాంగాన్‌లో డేవిడ్‌ చేతికి చిక్కాడు. దీంతో మ్యాచ్‌ మలుపు తిరిగింది. ఆ తర్వాతి ఓవర్లో మెరిడిత్‌.. అగర్వాల్‌ ఆట కట్టించడంతో సన్‌రైజర్స్‌ పనైపోయింది. జాన్సన్‌ (13), అబ్దుల్‌ సమద్‌ (9), సుందర్‌ (10)ల పోరాటం సరిపోలేదు. చివరి ఓవర్లో 20 పరుగులు చేయాల్సి రాగా.. అర్జున్‌ 5 పరుగులే ఇవ్వడంతో మ్యాచ్‌ ముంబయి సొంతమైంది.

బ్యాటు × బంతి

మొదట సన్‌రైజర్స్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకోగా.. పిచ్‌ నుంచి బౌలర్లకు సహకారం లభించడంతో బ్యాటు, బంతికి మధ్య మంచి పోరాటం కనిపించింది. ఇన్నింగ్స్‌ తొలి అర్ధంలో సన్‌రైజర్స్‌ బౌలర్లదే పైచేయి కాగా.. చివరికి ముంబయి బ్యాటర్లదే ఆధిపత్యం అయింది. మంచి స్వింగ్‌తో భువనేశ్వర్‌ తొలి ఓవర్‌ను పూర్తి చేయగా.. జాన్సన్‌ బౌలింగ్‌లో ఇషాన్‌ కిషన్‌ (38; 31 బంతుల్లో 3×4, 2×6) భారీ సిక్సర్‌తో ఇన్నింగ్స్‌లో ఊపు తెచ్చాడు. వాషింగ్టన్‌ సుందర్‌ వేసిన మూడో ఓవర్లో వరుసగా మూడు బౌండరీలతో రోహిత్‌ శర్మ (28; 18 బంతుల్లో 6×4) కూడా జోరు చూపించాడు. అయితే సుందర్‌ స్థానంలో బౌలింగ్‌కు వచ్చిన నటరాజన్‌.. రోహిత్‌ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. రెండు బౌండరీలు రాబట్టి జోరు మీదున్న రోహిత్‌ను స్వింగ్‌తో బోల్తా కొట్టించాడు. బంతిని ఫ్లిక్‌ చేసేందుకు ప్రయత్నించిన రోహిత్‌.. మిడాఫ్‌లో మార్‌క్రమ్‌ చేతికి చిక్కాడు. 19 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడిన ఇషాన్‌.. దూకుడుగా ఆడలేకపోయాడు. గ్రీన్‌ కూడా నెమ్మదిగానే బ్యాటింగ్‌ చేయగా.. 11 ఓవర్లకు ముంబయి 87 పరుగులే (వికెట్‌ నష్టానికి) చేయగలిగింది. దీనికి తోడు జాన్సన్‌ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి ముంబయిని గట్టి దెబ్బ కొట్టాడు. ఇషాన్‌, సూర్యకుమార్‌ల క్యాచ్‌లను మార్‌క్రమ్‌ కళ్లు చెదిరే రీతిలో అందుకున్నాడు. 12 ఓవర్లకు స్కోరు 95/3.

ఇటు తిలక్‌.. అటు గ్రీన్‌

హైదరాబాద్‌ కుర్రాడు తిలక్‌వర్మ (37; 17 బంతుల్లో 2×4, 4×6) రాకతో ముంబయి ఇన్నింగ్స్‌ గమనం పూర్తిగా మారిపోయింది. మంచి ఫామ్‌లో ఉన్న తిలక్‌ సాధికారిక బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఉప్పల్‌ స్టేడియం పిచ్‌, పరిస్థితులపై పూర్తి అవగాహనతో తొందరగానే బౌలర్ల లైన్‌ను దొరకబుచ్చుకున్నాడు. మార్కండే బౌలింగ్‌లో బౌండరీతో జూలు విదిల్చిన తిలక్‌.. వరుసగా రెండు భారీ సిక్సర్లతో జాన్సన్‌కు చుక్కలు చూపించాడు. ఈ ఓవర్లో ముంబయికి 21 పరుగులు లభించాయి. ఆ తర్వాతి ఓవర్లో మార్కండేనూ అతను వదల్లేదు. ఫోర్‌, సిక్సర్‌తో 14 పరుగులు రాబట్టాడు. భువనేశ్వర్‌ బౌలింగ్‌లోనూ సిక్సర్‌తో చెలరేగిన తిలక్‌.. తర్వాతి బంతికే భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచౌట్‌ అయ్యాడు. గ్రీన్‌తో కలిసి తిలక్‌ నాలుగో వికెట్‌కు 56 పరుగులు జోడించాడు. గ్రీన్‌ సైతం చివరి ఓవర్లలో ధాటిగా ఆడాడు. 18వ ఓవర్లో వరుసగా 3 బౌండరీలు, ఒక సిక్సర్‌తో 20 పరుగులు రాబట్టి ఐపీఎల్‌లో తొలి అర్ధశతకాన్ని పూర్తి చేశాడు. 19వ ఓవర్లో భువి 6 పరుగులతో కట్టడి చేసినా.. నటరాజన్‌ బౌలింగ్‌లో టిమ్‌ డేవిడ్‌ (16; 11 బంతుల్లో 2×4) 14 పరుగులు రాబట్టి స్కోరును 190 దాటించాడు. చివరి 8 ఓవర్లలో ముంబయి 97 పరుగులు సాధించింది.

ముంబయి ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) మార్‌క్రమ్‌ (బి) నటరాజన్‌ 28; ఇషాన్‌ (సి) మార్‌క్రమ్‌ (బి) జాన్సన్‌ 38; గ్రీన్‌ నాటౌట్‌ 64; సూర్యకుమార్‌ (సి) మార్‌క్రమ్‌ (బి) జాన్సన్‌ 7; తిలక్‌వర్మ (సి) మయాంక్‌ అగర్వాల్‌ (బి) భువనేశ్వర్‌ 37; టిమ్‌ డేవిడ్‌ రనౌట్‌ 16; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 192

వికెట్ల పతనం: 1-41, 2-87, 3-95, 4-151, 5-192

బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-31-1; మార్కో జాన్సన్‌ 4-0-43-2; వాషింగ్టన్‌ సుందర్‌ 4-0-33-0; నటరాజన్‌ 4-0-50-1; మయాంక్‌ మార్కండే 4-0-35-0

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: బ్రూక్‌ (బి) సూర్యకుమార్‌ (బి) బెరెన్‌డార్ఫ్‌ 9; మయాంక్‌ అగర్వాల్‌ (సి) డేవిడ్‌ (బి) మెరిడిత్‌ 48; రాహుల్‌ త్రిపాఠి (సి) ఇషాన్‌ (బి) బెరెన్‌డార్ఫ్‌ 7; మార్‌క్రమ్‌ (సి) షోకీన్‌ (బి) గ్రీన్‌ 22; అభిషేక్‌ (సి) డేవిడ్‌ (బి) చావ్లా 1; క్లాసెన్‌ (సి) డేవిడ్‌ (బి) చావ్లా 36; అబ్దుల్‌ సమద్‌ రనౌట్‌ 9; జాన్సన్‌ (సి) డేవిడ్‌ (బి) మెరి…త్‌ 13; సుందర్‌ రనౌట్‌ 10; భువనేశ్వర్‌ (సి) రోహిత్‌ (బి) అర్జున్‌ 2; మార్కండే నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం: (19.5 ఓవర్లలో ఆలౌట్‌) 178

వికెట్ల పతనం: 1-11, 2-25, 3-71, 4-72, 5-127, 6-132, 7-149, 8-165, 9-174

బౌలింగ్‌: అర్జున్‌ తెందుల్కర్‌ 2.5-0-18-1; బెరెన్‌డార్ఫ్‌ 4-0-37-2; మెరిడిత్‌ 4-0-33-2; హృతిక్‌ షోకీన్‌ 1-0-12-0; చావ్లా 4-0-43-2; గ్రీన్‌ 4-0-29-1

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని