కోల్‌కతా ఎట్టకేలకు..

ఈ ఐపీఎల్‌ సీజన్‌ను మెరుగ్గానే ఆరంభించినా..  ఆ తర్వాత తడబడి, వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌.. ఎట్టకేలకు మళ్లీ గెలుపు బాట పట్టింది.

Updated : 27 Apr 2023 07:09 IST

4 ఓటముల తర్వాత విజయం
చెలరేగిన రాయ్‌, నితీశ్‌
మెరిసిన వరుణ్‌, సుయాశ్‌
బెంగళూరు ఓటమి

ఈ ఐపీఎల్‌ సీజన్‌ను మెరుగ్గానే ఆరంభించినా..  ఆ తర్వాత తడబడి, వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌.. ఎట్టకేలకు మళ్లీ గెలుపు బాట పట్టింది. ఇంగ్లిష్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ ఇచ్చిన మెరుపు ఆరంభాన్ని ఉపయోగించుకుని మిగతా ఆటగాళ్లూ సత్తా చాటడంతో బెంగళూరుకు 201 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన ఆ జట్టు.. స్పిన్నర్ల ప్రతిభతో ప్రత్యర్థిని 179/8కే కట్టడి చేసి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. తాత్కాలిక కెప్టెన్‌ కోహ్లి సారథ్యంలో వరుసగా రెండు విజయాలందుకున్న బెంగళూరు హ్యాట్రిక్‌ కొట్టలేకపోయింది.

బెంగళూరు

పీఎల్‌-16లో పరాజయ పరంపరకు తెరదించుతూ కోల్‌కతా అత్యావశ్యక విజయాన్నందుకుంది. బుధవారం ఆ జట్టు 21 పరుగుల తేడాతో బెంగళూరును ఓడించింది. జేసన్‌ రాయ్‌ (56; 29 బంతుల్లో 4×4, 5×6), నితీశ్‌ రాణా (48; 21 బంతుల్లో 3×4, 4×6)ల మెరుపులతో మొదట కోల్‌కతా 5 వికెట్లకు 200 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆర్సీబీ బౌలర్లలో హసరంగ (2/24), విజయ్‌కుమార్‌ వైశాఖ్‌ (2/41) రాణించారు. ఛేదనలో విరాట్‌ కోహ్లి (54; 37 బంతుల్లో 6×4), లొమ్రార్‌ (34; 18 బంతుల్లో 1×4, 3×6) సత్తా చాటినా.. మిగతా బ్యాటర్లు చేతులెత్తేయడంతో బెంగళూరుకు ఓటమి తప్పలేదు. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 179 పరుగులే చేయగలిగింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ వరుణ్‌ చక్రవర్తి (3/27), సుయాశ్‌ (2/30), రసెల్‌ (2/29) ఆ జట్టును దెబ్బ తీశారు. 8 మ్యాచ్‌ల్లో కోల్‌కతా మూడో విజయం సాధించగా.. బెంగళూరు నాలుగో ఓటమిని ఖాతాలో వేసుకుంది.

ఆ ఇద్దరి నిష్క్రమణతో..: 200 పైచిలుకు లక్ష్యం అయినప్పటికీ.. బ్యాటింగ్‌కు స్వర్గధామం అయిన చిన్నస్వామిలో కోహ్లి, డుప్లెసిస్‌, మ్యాక్స్‌వెల్‌లతో కూడిన బ్యాటింగ్‌ ఆర్డర్‌కు ఛేదన కష్టం కాదనే అనుకున్నారు ఆర్సీబీ అభిమానులు. కానీ ఈ ముగ్గురిలో ఇద్దరు చేతులెత్తేయడంతో ఆ జట్టుకు ఆరంభంలోనే దారులు మూసుకుపోయినట్లయింది. రెండు మెరుపు సిక్సర్లతో ఊపుమీద కనిపించిన డుప్లెసిస్‌ (17).. రాయ్‌ స్థానంలో ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’గా వచ్చిన యువ స్పిన్నర్‌ సుయాశ్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడబోయి బౌండరీ వద్ద రింకు చేతికి చిక్కడంతో బెంగళూరుకు ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. షాబాజ్‌ (2) ఎప్పట్లాగే ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. అతణ్నీ సుయాశే ఔట్‌ చేశాడు. బెంగళూరుకు అసలైన దెబ్బ మరో స్పిన్నర్‌ వరుణ్‌ వేసిన ఆరో ఓవర్లో తగిలింది. మెరుపు వీరుడు మ్యాక్స్‌వెల్‌ (5) షాట్‌ గురి తప్పి షార్ట్‌ కవర్స్‌లో వీజ్‌కు దొరికిపోవడంతో స్టేడియం ఒక్కసారిగా ఉస్సూరుమంది. పవర్‌ప్లేలో స్కోరు 58/3. ఈ దశలో నిలకడగా ఆడుతున్న కోహ్లికి జత కలిసిన లొమ్రార్‌.. మ్యాక్సీ లోటును భర్తీ చేయాలని చూశాడు. ఒక దశలో తాను ఎదుర్కొన్న 7 బంతుల్లో అతను మూడు సిక్సర్లు బాదాడు.  మరో ఎండ్‌లో కోహ్లి కూడా ఉండటంతో బెంగళూరు ఆశలు సజీవంగానే ఉన్నాయి. కానీ లొమ్రార్‌, కోహ్లి వరుస ఓవర్లలో వెనుదిరగడంతో ఆ జట్టు పనైపోయింది. కోహ్లి క్యాచ్‌ను మిడ్‌వికెట్‌లో పక్కకు పరుగెడుతూ వెంకటేశ్‌ డైవ్‌ చేసి చక్కగా అందుకున్నాడు. ఆ తర్వాత కార్తీక్‌ (22; 18 బంతుల్లో 1×4, 1×6) కాసేపు నిలబడ్డా అద్భుతాలేమీ చేయలేకపోయాడు.

రాయ్‌ వేసిన పునాదిపై..: మొదట టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా.. బ్యాటింగ్‌కు స్వర్గధామంలా కనిపించిన చిన్నస్వామి పిచ్‌పై పరుగుల పండుగ చేసుకుంది. ఆలస్యంగా నైట్‌రైడర్స్‌ జట్టులోకి వచ్చి ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ చెలరేగిపోయిన ఇంగ్లిష్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ వేసిన బలమైన పునాదిని ఉపయోగించుకుని మిగతా బ్యాటర్లు 200 స్కోరు సాధించి పెట్టారు. రాయ్‌ని స్పిన్నర్‌ హసరంగ తప్ప ఎవ్వరూ ఇబ్బంది పెట్టలేకపోయారు. పవర్‌, టైమింగ్‌ కలగలిపి అతను కొట్టిన బుల్లెట్‌ షాట్లకు సమాధానమే లేకపోయింది. కొత్త బంతిని పంచుకున్న సిరాజ్‌, విల్లీలను రాయ్‌ అలవోకగా ఎదుర్కొన్నాడు. హసరంగ బౌలింగ్‌లో తడబడ్డ రాయ్‌.. మరో స్పిన్నర్‌ షాబాజ్‌ బంతి అందుకున్నాడో లేదో, ఇదే ఛాన్స్‌ అన్నట్లు అతడిపై విరుచుకుపడ్డాడు రాయ్‌. తన ఓవర్లో ఏకంగా నాలుగు సిక్సర్లు బాదేశాడు. ఆ దెబ్బకు షాబాజ్‌ మళ్లీ బౌలింగ్‌కు రాలేదు. గత మ్యాచ్‌లో 19 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన జేసన్‌.. ఈసారి 22 బంతుల్లో ఆ మార్కును అందుకున్నాడు. మరో ఎండ్‌లో జగదీశన్‌ నెమ్మదిగా బ్యాటింగ్‌ చేసినా.. రాయ్‌ దూకుడుతో కోల్‌కతా 9 ఓవర్లలో 82/0తో పటిష్ట స్థితిలో నిలిచింది. పేసర్‌ వైశాఖ్‌ ఒకే ఓవర్లో ఓపెనర్లను ఔట్‌ చేసినా.. నైట్‌రైడర్స్‌కు ఇబ్బంది లేకపోయింది. కెప్టెన్‌ నితీశ్‌ రాణా.. వెంకటేశ్‌ అయ్యర్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వైశాఖ్‌ బౌలింగ్‌లో సిరాజ్‌ తేలికైన క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన నితీశ్‌.. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని చెలరేగిపోయాడు. వెంకీ కూడా నిలకడగా ఆడటంతో 17 ఓవర్లకు కోల్‌కతా 167/2తో తిరుగులేని స్థితికి చేరుకుంది. అయితే 18వ ఓవర్లో హసరంగ కేవలం 3 పరుగులే ఇచ్చి నితీశ్‌, వెంకటేశ్‌లను ఔట్‌ చేశాడు. ఆఖరి 2 ఓవర్లలో రింకు (10 బంతుల్లో 18 నాటౌట్‌; 2×4, 1×6), వీజ్‌ (3 బంతుల్లో 12 నాటౌట్‌; 2×6) మెరుపులతో కోల్‌కతా 200 స్కోరును చేరుకుంది.

కోల్‌కతా ఇన్నింగ్స్‌: జేసన్‌ రాయ్‌ (బి) వైశాఖ్‌ 56; జగదీశన్‌ (సి) విల్లీ (బి) వైశాఖ్‌ 27; వెంకటేశ్‌ అయ్యర్‌ (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) హసరంగ 31; నితీశ్‌ రాణా (సి) వైశాఖ్‌ (బి) హసరంగ 48; రసెల్‌ (బి) సిరాజ్‌ 1; రింకు నాటౌట్‌ 18; వీజ్‌ నాటౌట్‌ 12; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 200; వికెట్ల పతనం: 1-83, 2-88, 3-168, 4-169, 5-185; బౌలింగ్‌: సిరాజ్‌ 4-0-33-1; విల్లీ 3-0-31-0; హసరంగ 4-0-24-2; షాబాజ్‌ అహ్మద్‌ 1-0-25-0; విజయ్‌కుమార్‌ వైశాఖ్‌ 4-0-41-2; హర్షల్‌ పటేల్‌ 4-0-44-0

బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (సి) వెంకటేశ్‌ (బి) రసెల్‌ 54; డుప్లెసిస్‌ (సి) రింకు (బి) సుయాశ్‌ 17; షాబాజ్‌ ఎల్బీ (బి) సుయాశ్‌ 2; మ్యాక్స్‌వెల్‌ (సి) వీజ్‌ (బి) వరుణ్‌ 5; లొమ్రార్‌ (సి) రసెల్‌ (బి) వరుణ్‌ 34; దినేశ్‌ కార్తీక్‌ (సి) రింకు (బి) వరుణ్‌ 22; ప్రభుదేశాయ్‌ రనౌట్‌ 10; హసరంగ (సి) అనుకుల్‌ (బి) రసెల్‌ 5; విల్లీ నాటౌట్‌ 11; వైశాఖ్‌ నాటౌట్‌ 13; ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 179; వికెట్ల పతనం: 1-31, 2-51, 3-58, 4-113, 5-115, 6-137, 7-152, 8-154; బౌలింగ్‌: వైభవ్‌ అరోరా 2-0-22-0; ఉమేశ్‌ 1-0-19-0; సుయాశ్‌ 4-0-30-2; వరుణ్‌ చక్రవర్తి 4-0-27-3; రసెల్‌ 4-0-29-2; నరైన్‌ 4-0-41-0; నితీశ్‌ రాణా 1-0-8-0

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని