CSK vs MI: కూల్‌గా కొట్టేశారు

ఐపీఎల్‌-16లో గత రెండు మ్యాచ్‌ల్లో 200పైన లక్ష్యాలను ఛేదించింది ముంబయి ఇండియన్స్‌. చెన్నై సూపర్‌కింగ్స్‌తో మ్యాచ్‌లో మాత్రం అతికష్టంగా 139 పరుగులకే పరిమితమైంది. ఫలితం ముంబయికి చేదు అనుభవం.

Updated : 07 May 2023 13:43 IST

ముంబయిపై చెన్నై గెలుపు
రాణించిన పతిరన, కాన్వే

ఐపీఎల్‌-16లో గత రెండు మ్యాచ్‌ల్లో 200పైన లక్ష్యాలను ఛేదించింది ముంబయి ఇండియన్స్‌. చెన్నై సూపర్‌కింగ్స్‌తో మ్యాచ్‌లో మాత్రం అతికష్టంగా 139 పరుగులకే పరిమితమైంది. ఫలితం ముంబయికి చేదు అనుభవం. అటు బౌలింగ్‌లో ప్రత్యర్థికి కళ్లెం వేసి.. ఇటు బ్యాటింగ్‌లో ప్రశాంతంగా ఆడిన చెన్నై మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. 11 మ్యాచ్‌ల్లో 13 పాయింట్లతో ప్లేఆఫ్స్‌ అవకాశాలను మెరుగుపరుచుకుంది.

చెన్నై సూపర్‌కింగ్స్‌ మెరిసింది. గత మ్యాచ్‌లో లఖ్‌నవూపై అదరగొట్టినా వర్షం కారణంగా పాయింట్లు పంచుకున్న సీఎస్కే.. ముంబయి ఇండియన్స్‌పై అదే జోరు ప్రదర్శించి పూర్తి పాయింట్లు ఖాతాలో వేసుకుంది. శనివారం ఆ జట్టు 6 వికెట్ల తేడాతో ముంబయిని ఓడించింది. మొదట ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పతిరన (3/15), దీపక్‌ చాహర్‌ (2/18), తుషార్‌ దేశ్‌పాండే (2/26) ధాటికి ముంబయి 139/8కే పరిమితమైంది. నేహల్‌ వధేరా (64; 51 బంతుల్లో 8×4, 1×6) టాప్‌ స్కోరర్‌. ఛేదనలో డెవోన్‌ కాన్వే (44; 42 బంతుల్లో 4×4) సంయమనం.. రుతురాజ్‌ గైక్వాడ్‌ (30; 16 బంతుల్లో 4×4, 2×6), శివమ్‌ దూబె (26 నాటౌట్‌; 18 బంతుల్లో 3×6) మెరుపులతో చెన్నై 17.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.

మెరుపు ఆరంభం

చెన్నై ఛేదన ముంబయి ఇన్నింగ్స్‌కు భిన్నంగా జరిగింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన రుతురాజ్, కాన్వే సీఎస్కేకు శుభారంభం ఇచ్చారు. ముఖ్యంగా ఉన్నంతసేపు మెరుపు షాట్లు ఆడిన రుతురాజ్‌ స్కోరుబోర్డు పరుగులెత్తించాడు. అర్షద్‌ వేసిన మూడో ఓవర్లో అతడు రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లతో చెలరేగిపోయాడు. కాన్వే కూడా కొన్ని షాట్లు ఆడడంతో 4 ఓవర్లకు 46/0తో చెన్నై లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. కానీ రుతురాజ్‌ను పియూష్‌ చావ్లా (2/25) ఔట్‌ చేయడం, రహానె (21) ఎక్కువసేపు నిలవకపోవడంతో సీఎస్కే జోరుకు కళ్లెం పడింది. 10-12 ఓవర్ల మధ్య ఆ జట్టుకు ఒక్క బౌండరీ కూడా రాలేదు. దీనికి తోడు రాయుడు (12) ఔటయ్యాడు. 13 ఓవర్లకు సమీకరణం 42 బంతుల్లో 35. ఈ స్థితిలో దూకుడుగా ఆడిన శివమ్‌ దూబె.. గోయల్‌ వేసిన 14వ ఓవర్లో రెండు సిక్స్‌లు అందుకోవడంతో ముంబయి ఓటమి ఖాయమైంది. ఆఖర్లో కాన్వే వెనుదిరిగినా.. ధోని (2 నాటౌట్‌)తో కలిసి దూబె చెన్నైని విజయతీరాలకు చేర్చాడు. 14 బంతులు ఉండగానే సీఎస్కే విజయం సాధించింది.

ముంబయి కట్టడి

ఆరంభంలో తడబాటు.. ఆ తర్వాత నిలకడ.. మళ్లీ తడబాటు..! ఇదీ మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబయి ఇన్నింగ్స్‌ సాగిన తీరు. చెన్నై పేసర్ల దెబ్బకు 3 ఓవర్లకు 16/3తో ఆ జట్టు కష్టాల్లో పడింది. రెండో ఓవర్లో గ్రీన్‌ (6)ను బౌల్డ్‌ చేసి తుషార్‌ పతనాన్ని మొదలు పెట్టగా.. ఆ తర్వాతి ఓవర్లో కిషన్‌ (7), రోహిత్‌శర్మ (0) వికెట్లు తీసిన దీపక్‌ చాహర్‌ ప్రత్యర్థిని గట్టి దెబ్బ కొట్టాడు. ఈ స్థితిలో నేహల్‌-సూర్యకుమార్‌ (26; 22 బంతుల్లో 3×4) నిలిచారు. గ్రౌండ్‌ షాట్లతోనే పరుగులు సాధించిన ఈ ద్వయం.. నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను నిర్మించింది. 10 ఓవర్లకు 64/3తో ముంబయి కోలుకున్నట్లే కనిపించింది. గేర్లు మారుస్తాడనుకున్న సమయంలో జడేజా బౌలింగ్‌లో సూర్య ఔటవడంతో ముంబయి ఆశలకు బ్రేకులు పడ్డాయి. శ్రీలంక ద్వయం పతిరన-తీక్షణ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పరుగుల రాకే కష్టంగా మారింది. ముంబయి ఆ మాత్రం స్కోరైనా చేసిందంటే అది నేహల్‌ వలనే. స్టబ్స్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 54 పరుగులు చేసిన నేహల్‌.. అర్ధసెంచరీ చేసి వెనుదిరిగాడు. ఇన్నింగ్స్‌ 18వ ఓవర్లో అతడిని పెవిలియన్‌ చేర్చిన పతిరన.. ఆఖరి ఓవర్లో స్టబ్స్‌ (20), అర్షద్‌ఖాన్‌ (1) వికెట్లు తీసి 5 పరుగులే ఇచ్చాడు.

రోహిత్‌ డకౌట్‌ రికార్డు

ఈ ఐపీఎల్‌లో రోహిత్‌ వరుసగా రెండో మ్యాచ్‌లో డకౌటయ్యాడు. ఐపీఎల్‌లో 16వ సారి సున్నాకే  వెనుదిరిగిన అతడు  నరైన్‌, కార్తీక్‌, మన్‌దీప్‌ (15)ల పేరిట ఉన్న అత్యధిక డకౌట్ల రికార్డును తిరగరాశాడు.

ముంబయి ఇన్నింగ్స్‌: గ్రీన్‌ (బి) తుషార్‌ 6; ఇషాన్‌ (సి) తీక్షణ (బి) దీపక్‌ చాహర్‌ 7; రోహిత్‌ (సి) జడేజా (బి) దీపక్‌ చాహర్‌ 0; నేహల్‌ (బి) పతిరన 64; సూర్యకుమార్‌ (బి) జడేజా 26; స్టబ్స్‌ (సి) జడేజా (బి) పతిరన 20; డేవిడ్‌ (సి) రుతురాజ్‌ (బి) తుషార్‌ 2; అర్షద్‌ఖాన్‌ (సి) రుతురాజ్‌ (బి) పతిరన 1; ఆర్చర్‌ నాటౌట్‌ 3; చావ్లా నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 139; వికెట్ల పతనం: 1-13, 2-13, 3-14, 4-69, 5-123, 6-127, 7-134, 8-137; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 3-0-18-2; తుషార్‌ 4-0-26-2; జడేజా 4-0-37-1; మొయిన్‌ 1-0-10-0; తీక్షణ 4-0-28-0; పతిరన 4-0-15-3

చెన్నై ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ (సి) ఇషాన్‌ (బి) చావ్లా 30; కాన్వే ఎల్బీ (బి) ఆకాశ్‌ మధ్వాల్‌ 44; రహానె ఎల్బీ (బి) చావ్లా 21; రాయుడు (సి) గోయల్‌  (బి) స్టబ్స్‌ 12; దూబె నాటౌట్‌ 26; ధోని నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (17.4 ఓవర్లలో 4 వికెట్లకు) 140; వికెట్ల పతనం: 1-46, 2-81, 3-105, 4-130; బౌలింగ్‌: గ్రీన్‌ 1-0-10-0; ఆర్చర్‌ 4-0-24-0; అర్షద్‌ఖాన్‌ 1.4-0-28-0; పియూష్‌ చావ్లా 4-0-25-2; రాఘవ్‌ గోయల్‌ 4-0-33-0; స్టబ్స్‌ 2-0-14-1; ఆకాశ్‌ మధ్వాల్‌ 1-0-4-1

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని