Mumbai vs Delhi: రాత మార్చిన ఓవర్‌.. 32 పరుగులతో షెఫర్డ్‌ విధ్వంసం

ఒక్క ఓవర్‌ మ్యాచ్‌ను ఎలా మార్చిందో.. ఆఖరి ఓవర్లో షెఫర్డ్‌ ఊచకోత ముంబయికి ఎలా విజయాన్ని కట్టబెట్టిందో చెప్పేందుకు ఇదే నిదర్శనం. దిల్లీ ఓటమి బాధకు..

Updated : 08 Apr 2024 15:51 IST

ముంబయి బోణీ... దిల్లీ క్యాపిటల్స్‌పై విజయం

202/5.. 19 ఓవర్లకు ముంబయి స్కోరు. కానీ చివరకు 234/5.
201/5.. 19 ఓవర్లకు దిల్లీ స్కోరు. కానీ ఆఖరికి 205/8.

ఒక్క ఓవర్‌ మ్యాచ్‌ను ఎలా మార్చిందో.. ఆఖరి ఓవర్లో షెఫర్డ్‌ ఊచకోత ముంబయికి ఎలా విజయాన్ని కట్టబెట్టిందో చెప్పేందుకు ఇదే నిదర్శనం. దిల్లీ ఓటమి బాధకు.. ముంబయి తొలి విజయానందానికి మధ్య తేడా ఆ ఓవరే! గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన సూర్యకుమార్‌పై అందరి దృష్టి ఉండగా.. చివరి ఓవర్లో 32 పరుగులతో రెచ్చిపోయిన షెఫర్డ్‌ ముంబయి హీరోగా నిలిచాడు. బౌండరీల వర్షం కురిసి.. పరుగుల వరద పారిన మ్యాచ్‌లో నెగ్గిన హార్దిక్‌ సేన.. హ్యాట్రిక్‌ ఓటముల తర్వాత సీజన్‌లో తొలి గెలుపు రుచిచూసింది. దిల్లీ అయిదు మ్యాచ్‌ల్లో నాలుగో ఓటమితో పట్టికలో అట్టడుగుకు పడిపోయింది.  

ముంబయి

ఐపీఎల్‌-17లో ముంబయి ఇండియన్స్‌ తొలి విజయాన్ని అందుకుంది. ఆదివారం 29 పరుగుల తేడాతో దిల్లీ క్యాపిటల్స్‌పై గెలిచింది. మొదట ముంబయి 20 ఓవర్లలో 5 వికెట్లకు 234 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (49; 27 బంతుల్లో 6×4, 3×6), ఇషాన్‌ కిషన్‌ (42; 23 బంతుల్లో 4×4, 2×6) మెరవగా.. టిమ్‌ డేవిడ్‌ (45 నాటౌట్‌; 21 బంతుల్లో 2×4, 4×6), రొమారియో షెఫర్డ్‌ (39 నాటౌట్‌; 10 బంతుల్లో 3×4, 4×6) విధ్వంసం సృష్టించారు. అక్షర్‌ పటేల్‌ (2/35) ఆకట్టుకున్నారు. ఛేదనలో దిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 205 పరుగులు చేయగలిగింది. ట్రిస్టన్‌ స్టబ్స్‌ (71 నాటౌట్‌; 25 బంతుల్లో 3×4, 7×6), పృథ్వీ షా (66; 40 బంతుల్లో 8×4, 3×6) పోరాటం సరిపోలేదు. బుమ్రా (2/22), కొయెట్జీ (4/34) రాణించారు.
గట్టిగానే పోరాడినా: భారీ లక్ష్య ఛేదనలో దిల్లీ గెలుపు కోసం పృథ్వీ, అభిషేక్‌ పోరెల్‌ (41; 31 బంతుల్లో 5×4), స్టబ్స్‌ గట్టిగానే పోరాడారు. కానీ ఎంత ప్రయత్నించినా లక్ష్యం అందకుండా పోయింది. కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం దెబ్బతీసింది. వార్నర్‌ (10) త్వరగానే నిష్క్రమించినా.. అభిషేక్‌తో కలిసి పృథ్వీ రెండో వికెట్‌కు 88 పరుగులు జోడించాడు. సిక్సర్‌తో పరుగుల ఖాతా తెరిచిన పృథ్వీ.. చూడముచ్చటైన స్ట్రోక్‌ప్లేతో అలరించాడు. క్రమంగా జోరందుకున్న అతను.. చావ్లా ఓవర్లో వరుసగా 6, 4, 4 కొట్టాడు. నబి బౌలింగ్‌లో స్లాగ్‌స్వీప్‌తో పృథ్వీ కొట్టిన సిక్సర్‌ చూడాల్సిందే. దిల్లీ 11 ఓవర్లకు 107/1తో మెరుగ్గానే కనిపించింది. కానీ ఆ తర్వాతి ఓవర్లోనే కళ్లుచెదిరే యార్కర్‌తో పృథ్వీని బుమ్రా బౌల్డ్‌ చేశాడు. కొద్దిసేపటికే అభిషేక్‌నూ అతనే ఔట్‌ చేశాడు. పంత్‌ (1) ఇలా వచ్చి అలా వెళ్లాడు. వికెట్లు పడుతున్నా మరోవైపు మాత్రం స్టబ్స్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌తో పోరాటం కొనసాగించాడు. బౌండరీల వర్షం కురిపించాడు. క్రీజులో నాట్యమాడుతూ అన్నివైపులా షాట్లు కొట్టాడు. ఆకాశ్‌ బౌలింగ్‌లో రివర్స్‌ స్కూప్‌తో అతను రాబట్టిన ఫోర్‌ ఆకట్టుకుంది. చివరి రెండు ఓవర్లలో దిల్లీకి 55 పరుగులు కావాల్సిన దశలో 19వ ఓవర్లో స్టబ్స్‌ మూడు సిక్సర్లు కొట్టాడు. ఆఖరి ఓవర్లో మొదటి బంతికి లలిత్‌ రెండు పరుగులు చేయడంతో 5 బంతుల్లో 32 పరుగులుగా సమీకరణం అసాధ్యంగా మారింది. దిల్లీ ఓటమి ఖాయమైంది. చివరి నాలుగు బంతుల్లో కొయెట్జీ మూడు వికెట్లు తీయడం కొసమెరుపు.

బలమైన పునాది: అంతకుముందు ఓపెనర్లు రోహిత్‌, ఇషాన్‌ దూకుడుతో ఇన్నింగ్స్‌ను ఘనంగా ఆరంభించిన ముంబయి.. డేవిడ్‌, షెఫర్డ్‌ మెరుపులతో గొప్పగా ముగించింది. బ్యాటింగ్‌కు చక్కగా అనుకూలించిన వాంఖడె పిచ్‌పై టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకోవడం ఎంత పెద్ద తప్పో పంత్‌కు తెలిసొచ్చేలా రోహిత్‌, ఇషాన్‌ ముంబయి ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశారు. పేసర్‌ జే రిచర్డ్‌సన్‌ (0/40), స్పిన్‌ ఆల్‌రౌండర్‌ లలిత్‌ (ఒక ఓవర్లో 15)ను జట్టులోకి తీసుకున్నా దిల్లీ బౌలింగ్‌ ఏం మారలేదు. పరుగులు ఇవ్వడం ఆపలేదు. స్కూప్‌ షాట్‌తో బౌండరీల ఖాతా తెరిచిన రోహిత్‌ ఏ దశలోనూ తడబడలేదు. ఇషాన్‌ కూడా తనదైన శైలి బ్యాటింగ్‌తో సాగిపోయాడు. దిల్లీ తరపున తొలి మ్యాచ్‌ ఆడిన రూ.5 కోట్ల ఆటగాడు రిచర్డ్‌సన్‌ ఓవర్లో రోహిత్‌ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. దిల్లీ పవర్‌ప్లేలోనే స్పిన్నర్లకు బంతి అందించినా లాభం లేకపోయింది. 6 ఓవర్లకు స్కోరు 75/0. ఆ దశలో వరుస ఓవర్లలో రోహిత్‌, సూర్యకుమార్‌ (0)ను ఔట్‌ చేసి దిల్లీ పుంజుకునే ప్రయత్నం చేసింది. తన బౌలింగ్‌లోనే మెరుపు వేగంతో స్పందించి అక్షర్‌ ఒంటి చేతి క్యాచ్‌తో ఇషాన్‌ను వెనక్కి పంపాడు. తిలక్‌ (6) నిలబడకపోవడం, హార్దిక్‌ (33 బంతుల్లో 39) నెమ్మదిగా ఆడటంతో స్కోరు వేగం మందగించింది. 11 నుంచి 15 ఓవర్లు కలిపి 33 పరుగులే వచ్చాయి. 15 ఓవర్లకు 138/4తో ఉన్న ముంబయి 200 స్కోరైనా అందుకుంటుందా అనిపించింది. అప్పుడే డేవిడ్‌ ఉప్పెనలా ముంచెత్తగా.. షెఫర్డ్‌ పిడుగులా పడ్డాడు. ఈ ఇద్దరు అభేద్యమైన ఆరో వికెట్‌కు 13 బంతుల్లోనే 53 పరుగులు జోడించారు.


ఏమా దంచుడు

అనూహ్యంగా విండీస్‌ ఆల్‌రౌండర్‌ షెఫర్డ్‌ రెచ్చిపోవడం ఈ ఇన్నింగ్స్‌లో హైలైట్‌. అతను 10 బంతుల్లోనే ప్రళయం సృష్టించాడు. ముఖ్యంగా చివరి ఓవర్లో అతని విధ్వంసం గురించి ఎంత చెప్పినా తక్కువే. అత్యంత వేగంతో బౌలింగ్‌ చేసే ప్రమాదకర పేసర్‌ నోకియా (2/65) బౌలింగ్‌ను షెఫర్డ్‌ చీల్చి చెండాడాడు. వరుసగా 4, 6, 6, 6, 4, 6తో ముంబయికి సంచలన ముగింపునిచ్చాడు. బంతి ఎలా వచ్చినా.. ఎక్కడ పడ్డా షెపర్డ్‌ ధాటికి చివరకు ఫోర్‌ లేదా సిక్సర్‌గా మారింది. లాంగాన్‌, స్క్వేర్‌లెగ్‌, డీప్‌ కవర్‌ మీదుగా అతను బంతిని స్టాండ్స్‌లో పడేశాడు. అతని ధాటికి ఆఖరి ఓవర్లో నోకియా 32 పరుగులు ఇచ్చేసుకున్నాడు. చివరి అయిదు ఓవర్లలో ముంబయి 96 పరుగులు పిండుకోవడం విశేషం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని