Updated : 15 Oct 2021 04:08 IST

దసరా ధమాకా

ఐపీఎల్‌-14 ఫైనల్‌ నేడే

మూడో ట్రోఫీ కోసం కోల్‌కతా తహతహ

నాలుగో టైటిల్‌పై చెన్నై కన్ను

రాత్రి 7.30 నుంచి

ఈ ఏడాది ఎప్పుడో ఏప్రిల్‌ 9న మొదలైంది ఐపీఎల్‌. ఈ రోజు అక్టోబరు 15. ఈ సీజన్లో విజేతను చూడ్డానికి ఇప్పటిదాకా ఎదురు చూడాల్సి వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు! మేలో కరోనా వల్ల ఆగిన టోర్నీ సెప్టెంబరులో యూఏఈలో పునఃప్రారంభమై ఎట్టకేలకు ఆఖరి ఘట్టంలోకి అడుగు పెట్టింది.

సమయం మారింది. వేదిక మారింది. జట్ల ఆట మారింది. అంచనాలు మారాయి. చివరికొచ్చేసరికి చెన్నై సూపర్‌కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మిగిలాయి. దసరా శుభ సందర్భాన ఈ రెండు జట్లు టైటిల్‌ కోసం తలపడబోతున్నాయి.

రెండు జట్లకూ ఫైనల్‌ కొత్త కాదు. ఐపీఎల్‌ విజేతగా నిలవడమూ కొత్త కాదు. చెన్నై ఎనిమిది సార్లు ఫైనల్‌ ఆడి మూడుసార్లు ట్రోఫీ అందుకుంది. కోల్‌కతా ఫైనల్‌ ఆడిన రెండుసార్లూ టైటిల్‌ సాధించింది. మరి విభిన్న ప్రయాణంతో ఇక్కడిదాకా వచ్చిన ఈ రెండు జట్లలో అంతిమ విజేత ఎవరో?

దుబాయ్‌

పీఎల్‌-14 తుది పోరుకు రంగం సిద్ధమైంది. శుక్రవారం దుబాయ్‌లో మాజీ ఛాంపియన్లు చెన్నై సూపర్‌కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ టైటిల్‌ కోసం తలపడబోతున్నాయి. బలాబలాల్లో సమవుజ్జీలుగా కనిపిస్తున్నప్పటికీ.. తాజా ఫామ్‌ ప్రకారం కోల్‌కతాది కాస్త పైచేయే. అయితే ధోని నాయకత్వంలోని చెన్నై ఎప్పుడైనా ఫలితాలను మార్చేయగలదు. కాబట్టి ఫైనల్‌ హోరాహోరీగా సాగడం ఖాయమని అంచనా. గత సీజన్లో చెన్నై ఆడిన తీరు.. ఈ సీజన్‌ తొలి అంచెలో కోల్‌కతా ఆట చూసిన వాళ్లకు ఆ రెండు జట్లూ ఫైనల్‌ చేరడం ఆశ్చర్యం కలిగించే విషయమే. మరి తుది పోరులో ఈ రెండు జట్లలో ఏది పైచేయి సాధిస్తుందో చూడాలి.

ఇటు రుతురాజ్‌.. అటు వెంకటేశ్‌: చెన్నై, కోల్‌కతా రెండు జట్లలోనూ స్టార్‌ ఆటగాళ్లు, అనుభవజ్ఞులు ఉన్నారు. అయితే వాళ్లను మించి ఇద్దరు దేశవాళీ యువ ఆటగాళ్లు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. వాళ్లే రుతురాజ్‌ గైక్వాడ్‌, వెంకటేశ్‌ అయ్యర్‌. గత సీజన్లో ఐపీఎల్‌ అరంగేట్రం చేసి ఆరంభంలో ఆశించిన ప్రదర్శన చేయలేకపోయిన రుతురాజ్‌ గైక్వాడ్‌.. చెన్నై ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించాక చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈసారి మరింత ఆత్మవిశ్వాసంతో ఆడిన అతను 600 పైచిలుకు పరుగులతో సీజన్‌ టాప్‌స్కోరర్లలో రెండో స్థానంలో నిలవడం విశేషం. స్వదేశంలోనే కాక.. యూఏఈలోనూ అతను నిలకడగా రాణిస్తున్నాడు. రాజస్థాన్‌పై అతడి మెరుపు శతకాన్ని అంత సులువుగా మరిచిపోలేం. డుప్లెసిస్‌తో కలిసి అతడి ఆరంభాలు జట్టుకు ఎంతో ఉపకరిస్తున్నాయి. ఫైనల్లోనూ రుతురాజ్‌ జోరు కొనసాగించాలని కోరుకుంటోంది చెన్నై. ఇక యూఏఈ అంచెలో అనుకోకుండా కోల్‌కతా తుది జట్టులోకి వచ్చిన వెంకటేశ్‌ అయ్యర్‌ ఈ సీజన్లో ఓ సంచలనమే. ఐపీఎల్‌లో ప్రతి సీజన్లోనూ ఓ యువ ఆటగాడు వెలుగులోకి వస్తుంటాడు. వెంకటేశ్‌ అలాంటివాడే. అతడి రాకతోనే కోల్‌కతా జట్టుకు సమతూకం వచ్చింది. ఓవైపు గిల్‌తో కలిసి జట్టుకు మంచి ఆరంభాలందించడమే కాదు.. మరోవైపు పార్ట్‌టైం బౌలర్‌గా, చక్కటి ఫీల్డర్‌గానూ ఎంతో ఉపయోగపడుతున్నాడు వెంకటేశ్‌. స్వల్ప స్కోర్లు నమోదైన రెండో క్వాలిఫయర్‌లో అర్ధశతకంతో జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించిన వెంకటేశ్‌ నుంచి ఫైనల్లోనూ మెరుపులు ఆశిస్తోంది కోల్‌కతా.


కోల్‌కతా నైట్‌రైడర్స్‌

బలాలు

* చెన్నై మాదిరే కోల్‌కతాకు కూడా టాప్‌ఆర్డరే బలం. ఓపెనర్లు వెంకటేశ్‌ అయ్యర్‌, శుభ్‌మన్‌ జట్టుకు మంచి ఆరంభాలిస్తున్నారు. నితీశ్‌, త్రిపాఠి అవసరమైనపుడు కీలక ఇన్నింగ్స్‌ ఆడుతున్నారు.

* చెన్నైతో పోలిస్తే విజయాలు తక్కువే కానీ.. లీగ్‌లో రెండో దశలో కోల్‌కతానే ఎక్కువ నిలకడగా ఆడుతోంది. చివరి 9 మ్యాచ్‌ల్లో ఆ జట్టు ఏడు నెగ్గింది. ఇంతకుముందు రెండు ఫైనల్స్‌లోనూ గెలిచిన ఆ జట్టు.. మూడోసారి కూడా నెగ్గి హ్యాట్రిక్‌ సాధించాలనుకుంటోంది.

* బౌలింగ్‌లో కోల్‌కతాదే పైచేయి. స్పిన్‌లో ఆ జట్టుకు తిరుగులేదు. వరుణ్‌, నరైన్‌, షకిబ్‌ గత కొన్ని మ్యాచ్‌ల నుంచి నిలకడగా రాణిస్తున్నారు. యూఏఈ పిచ్‌లను బాగా ఉపయోగించుకుంటున్నారు. ఫైనల్లో కూడా వీరి నుంచి చెన్నైకి ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఫెర్గూసన్‌, మావితో పేస్‌ విభాగం బలంగా ఉంది.

బలహీనతలు

* కోల్‌కతాకు మిడిలార్డర్‌ ఎప్పుడూ సమస్యే. ఈ సీజన్‌ కూడా అందుకు మినహాయింపు కాదు. దినేశ్‌ కార్తీక్‌, మోర్గాన్‌ పూర్తిగా నిరాశ పరుస్తున్నారు.

* రెండో క్వాలిఫయర్‌లో మంచి స్థితి నుంచి కుప్పకూలి, పీకల మీదికి తెచ్చుకోవడం కోల్‌కతాను కలవరపరిచేదే. త్రిపాఠి సిక్స్‌ కొట్టబట్టి సరిపోయింది కానీ.. లేకుంటే అంతే సంగతులు. ఫైనల్లో ఇలాంటి ఒత్తిడితో కూడిన పరిస్థితి ఎదురైతే కోల్‌కతా పరిస్థితేంటో?

* చెన్నై జట్టులో డుప్లెసిస్‌, మొయిన్‌ అలీ, ఉతప్ప తరహాలో విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడి మ్యాచ్‌ ఫలితాలను మార్చేసే ఆటగాడు కోల్‌కతా జట్టులో లేడు. పిచ్‌ బ్యాటింగ్‌కు సహకరిస్తే కోల్‌కతా భారీ స్కోరు చేస్తుందా అన్నది సందేహమే.


చెన్నై సూపర్‌కింగ్స్‌
బలాలు

* చెన్నైకి ఓపెనర్లే పెద్ద బలం. రుతురాజ్‌, డుప్లెసిస్‌ నిలకడగా రాణిస్తున్నారు. రైనా స్థానంలో వచ్చిన ఉతప్ప క్వాలిఫయర్‌లో చెలరేగి ఆడటం జట్టును సంతోష పెట్టేదే. టాప్‌ఆర్డర్‌లో చెన్నైకి సమస్యల్లేవు.

* హేజిల్‌వుడ్‌, శార్దూల్‌, బ్రావో, దీపక్‌ చాహర్‌లతో చెన్నై పేస్‌ బలంగా ఉంది. హేజిల్‌వుడ్‌, శార్దూల్‌ నిలకడగా వికెట్లు తీస్తుండటం కలిసొచ్చే అంశం. మొయిన్‌ అలీ, జడేజాల రూపంలో నాణ్యమైన ఆల్‌రౌండర్లుండటం చెన్నైకి సానుకూలతే.

* ఐపీఎల్‌లో అత్యధిక ఫైనల్స్‌ ఆడిన అనుభవం చెన్నై సొంతం. ధోని లాంటి కెప్టెన్‌ ఉండటం తుది పోరులో కచ్చితంగా కలిసొచ్చే అంశమే. క్వాలిఫయర్‌లో ధోని చెలరేగడం జట్టులో సంతోషాన్ని నింపేదే.

బలహీనతలు

* చెన్నై మిడిలార్డర్‌ ఈ సీజన్లో అనుకున్నంతగా రాణించలేదు. రాయుడు, అలీ, ధోని ఏదో ఒక మ్యాచ్‌లో మెరుపులు మెరిపించడమే తప్ప నిలకడగా రాణించలేదు.

* కోల్‌కతాతో పోలిస్తే బౌలింగ్‌లో చెన్నై బలహీనమే. ఆ జట్టుకున్నట్లు స్పిన్‌ బలం చెన్నైకి లేదు. జడేజా, అలీ స్పిన్‌ బాధ్యతలు మోస్తున్నప్పటికీ.. వరుణ్‌, నరైన్‌లా ప్రభావం చూపట్లేదు. 

* బాగా ఆడుతూనే కొన్ని మ్యాచ్‌ల్లో చెన్నై నిరాశపరుస్తోంది. ప్రత్యర్థి జట్టుకు భారీగా పరుగులిచ్చేస్తోంది. ఆ బలహీనత ఫైనల్లోనూ వెంటాడుతుందేమో అన్న ఆందోళన లేకపోలేదు. చెన్నై 8 ఫైనల్స్‌లో 5  ఓడిపోవడం కలవరపరిచే విషయమే.


చెన్నై ఇలా.. కోల్‌కతా అలా

సారి లీగ్‌ దశలో ఐపీఎల్‌ ఫైనలిస్టుల ప్రయాణం భిన్నంగా సాగింది. స్వదేశంలో జరిగిన ఐపీఎల్‌ తొలి అంచెలో చెన్నై 7 మ్యాచ్‌ల్లో 5 నెగ్గి, 2 ఓడగా.. కోల్‌కతా అన్నే మ్యాచ్‌లాడి 2 నెగ్గి, అయిదు ఓడింది. రెండో అంచెలో చెన్నై జోరు కొనసాగిస్తూ, ఎలాంటి ఒత్తిడి లేకుండా చాలా ముందుగానే ప్లేఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకుంది. కానీ ప్లేఆఫ్స్‌ రేసులో బాగా వెనుకబడి రెండో అంచెలో అడుగు పెట్టిన కోల్‌కతా చక్కటి ప్రదర్శనతో విజయాలందుకుంటూ ప్లేఆఫ్స్‌ రేసులో ముందుకొచ్చింది. ఏడు విజయాలే సాధించినప్పటికీ నెట్‌ రన్‌రేట్‌లో ముంబయిని వెనక్కి నెట్టి తర్వాతి దశలో అడుగు పెట్టింది. తొలి క్వాలిఫయర్‌లో దిల్లీపై నెగ్గి చెన్నై ఫైనల్‌ చేరితే.. ముందుగా ఎలిమినేటర్‌లో బెంగళూరును, ఆ తర్వాత రెండో క్వాలిఫయర్‌లో దిల్లీని ఓడించి నైట్‌రైడర్స్‌ తుది పోరుకు అర్హత సాధించింది.


తుది జట్లు (అంచనా)

చెన్నై సూపర్‌కింగ్స్‌: డుప్లెసిస్‌, రుతురాజ్‌, ఉతప్ప, మొయిన్‌ అలీ, రాయుడు, ధోని (కెప్టెన్‌, వికెట్‌కీపర్‌), జడేజా, బ్రావో, శార్దూల్‌ ఠాకూర్‌, హేజిల్‌వుడ్‌, దీపక్‌ చాహర్‌.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌: శుభ్‌మన్‌ గిల్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, నితీశ్‌ రాణా, రాహుల్‌ త్రిపాఠి, ఇయాన్‌ మోర్గాన్‌ (కెప్టెన్‌), దినేశ్‌ కార్తీక్‌ (వికెట్‌కీపర్‌), షకిబ్‌, నరైన్‌, ఫెర్గూసన్‌, మావి, వరుణ్‌ చక్రవర్తి.


* చెన్నై 2010, 2011, 2018 సీజన్లలో ఐపీఎల్‌ ఛాంపియన్‌ అయింది. 2008, 2012, 2013, 2015, 2019ల్లో  రన్నరప్‌గా నిలిచింది.

* ఐపీఎల్‌లో కోల్‌కతా ఫైనల్‌ చేరిన రెండుసార్లు (2012, 2014) విజేతగా నిలిచింది.


6.40

కోల్‌కతా స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి ఎకానమీ. ఈ సీజన్లో కనీసం పది వికెట్లు తీసిన బౌలర్లలో దిల్లీ ఆటగాడు నార్జ్‌ (6.17)ను మినహాయిస్తే వరుణ్‌దే అత్యుత్తమ ఎకానమీ. అతను 16 మ్యాచ్‌లాడి 22.77 సగటుతో 18 వికెట్లు పడగొట్టాడు. ఉత్తమ ప్రదర్శన 3/13.


603

ఈ సీజన్లో చెన్నై ఓపెనర్‌ రుతురాజ్‌ పరుగులు. ఇంకో 24 పరుగులు చేస్తే, కేఎల్‌ రాహుల్‌ (626)ను అధిగమించి ఆరెంజ్‌ క్యాప్‌ అందుకుంటాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని