ఇంగ్లాండ్‌ టీ20, వన్డే కెప్టెన్‌గా బట్లర్‌

వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ ఇంగ్లాండ్‌ టీ20, వన్డే కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. అతడు 2015 నుంచి వైస్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. మోర్గాన్‌ రిటైర్మెంట్‌తో ఇంగ్లాండ్‌కు కొత్త కెప్టెన్‌ అవసరమైన సంగతి తెలిసిందే. 31 ఏళ్ల బట్లర్‌ 151 వన్డేల్లో 41.20 సగటుతో

Published : 01 Jul 2022 03:43 IST

లండన్‌: వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ ఇంగ్లాండ్‌ టీ20, వన్డే కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. అతడు 2015 నుంచి వైస్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. మోర్గాన్‌ రిటైర్మెంట్‌తో ఇంగ్లాండ్‌కు కొత్త కెప్టెన్‌ అవసరమైన సంగతి తెలిసిందే. 31 ఏళ్ల బట్లర్‌ 151 వన్డేల్లో 41.20 సగటుతో 4120 పరుగులు చేశాడు. ఇందులో 10 శతకాలు, 21 అర్ధశతకాలు ఉన్నాయి. బట్లర్‌ 88 టీ20ల్లో 34.51 సగటుతో 2140 పరుగులు సాధించాడు.


ఆస్ట్రేలియాకు ఆధిక్యం

గాలె: శ్రీలంకతో తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఆధిక్యం సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 98/3తో గురువారం, రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆసీస్‌ను ఆట ముగిసే సమయానికి 313/8తో నిలిచింది. గాలి వాన కారణంగా గురువారం 44 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఆట ఎక్కువసేపు సాగకపోయినా శ్రీలంక స్కోరును అధిగమించేందుకు ఆసీస్‌కు ఎక్కువ సమయం పట్టలేదు. ఉస్మాన్‌ ఖవాజా (71; 130 బంతుల్లో 74), కామెరూన్‌ గ్రీన్‌ (77; 109 బంతుల్లో 64) దూకుడుగా ఆడారు. అలెక్స్‌ కేరీ (45) రాణించాడు. కమిన్స్‌ (26), లైయన్‌ (8) క్రీజులో ఉన్నారు ఆసీస్‌ 101 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో లంక 212 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.


నార్వేతో డేవిస్‌ కప్‌ పోరు

దిల్లీ: డేవిస్‌ కప్‌లో నార్వేతో తొలిసారి భారత్‌ తలపడబోతుంది. ప్రపంచ గ్రూప్‌- 1 పోరులో భాగంగా భారత జట్టుకు నార్వే ఆతిథ్యమివ్వనుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 16, 17 తేదీల్లో ఈ పోరు జరుగుతుందని అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) గురువారం ప్రకటించింది. గురు, శుక్ర లేదా శుక్ర, శనివారాల్లో భారత్‌తో మ్యాచ్‌లు ఆడే అవకాశం నార్వేకు ఉండగా.. మొదటి రెండు రోజులను ఆ దేశం ఎంచుకుంది.


మరో కోచ్‌పై వేటు

దిల్లీ: మహిళా క్రీడాకారిణుల పట్ల కోచ్‌ల వ్యవహారశైలి రోజురోజుకూ తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పటికే లైంగికంగా హింసించారంటూ సైక్లింగ్‌, సెయిలింగ్‌ క్రీడాకారిణులు ఆయా కోచ్‌లపై ఫిర్యాదు చేశారు. తాజాగా ఐరోపా పర్యటనలో ఉన్న భారత అండర్‌-17 అమ్మాయిల ఫుట్‌బాల్‌ జట్టులోని ఓ మైనర్‌ బాలికతో సహాయక కోచ్‌ అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిసింది. దీంతో వెంటనే అతనిపై వేటు వేసిన అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌).. నార్వే నుంచి స్వదేశానికి రావాల్సిందిగా తనను ఆదేశించింది. అక్టోబర్‌లో భారత్‌లో జరిగే అండర్‌-17 ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌కు ముందు సన్నాహకం కోసం అమ్మాయిల జట్టు ఐరోపా వెళ్లింది.


హాకీ జట్టుకు కరోనా సెగ

బెంగళూరు: కామన్వెల్త్‌ క్రీడలకు సిద్ధమవుతున్న భారత హాకీ జట్టుకు కరోనా సెగ తగిలింది. స్ట్రైకర్‌ గుర్జాంత్‌ సింగ్‌, మిడ్‌ఫీల్డర్‌ ఆశిష్‌ కుమార్‌ పాటు చీఫ్‌ కోచ్‌ గ్రాహం రీడ్‌, వీడియో ఎనలిస్ట్‌ అశోక్‌ కుమార్‌తో పాటు మరొకరు ఈ వైరస్‌ బారిన పడినట్లు సమాచారం. హాకీ ఇండియా అధికారికంగా ఎవరి పేర్లను ధ్రువీకరించలేదు. బుధవారం ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించగా వీరికి పాజిటివ్‌గా తేలినట్లు.. అందర్ని ఐసోలేషన్‌కు తరలించినట్లు హాకీ ఇండియా వర్గాలు వెల్లడించాయి. బెంగళూరులోని సాయ్‌ కేంద్రంలో నిర్వహిస్తున్న ఈ శిబిరంలో పీఆర్‌ శ్రీజేశ్‌, మన్‌ప్రీత్‌సింగ్‌, లలిత్‌కుమార్‌, హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ లాంటి టాప్‌ ఆటగాళ్లు ఉన్నారు. జులై 23న ఈ శిబిరం ముగుస్తుంది.


వయసు మోసాలపై విచారణకు ప్యానెల్‌

దిల్లీ: తప్పుడు వయసు ధ్రువపత్రాలు సమర్పించి, టోర్నీల్లో లాభం పొందాలనుకునే ఆటగాళ్ల మోసాలపై పూర్తి స్థాయి విచారణ కోసం భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) ఓ ప్యానెల్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గత నెలలో హైదరాబాద్‌లో జరిగిన అఖిల భారత సబ్‌ జూనియర్‌ అండర్‌-13 ర్యాంకింగ్‌, ప్రస్తుతం మొహాలీలో జరుగుతున్న అండర్‌-13 ర్యాంకింగ్‌ టోర్నీల్లో కొంతమంది షట్లర్లు తమ వయసు గురించి తప్పుడు సమాచారమిచ్చారనే ఫిర్యాదులు వచ్చాయి. ఎక్కువ వయసు ఉన్నప్పటికీ తప్పుడు పత్రాలు సమర్పించి ఈ టోర్నీల్లో పాల్గొన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వయసు మోసాల కమిటీ సభ్యుడు సందీప్‌ హెబ్లే ఈ విషయంపై దృష్టి సారించాలని బాయ్‌కు లేఖ రాశాడు. దీంతో ఓ ప్యానెల్‌ ఏర్పాటు చేసి దీనిపై విచారణ జరపాలని, దోషులుగా తేలిన షట్లర్లపై 2 నుంచి 3 ఏళ్ల పాటు నిషేధం విధించాలని బాయ్‌ అనుకుంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని