Sanket: ఆ చాయ్‌వాలా.. ఇప్పుడు ఛాంపియన్‌

ఉదయాన్నే 5.30 గంటలకు నిద్ర లేవడం.. తన తండ్రి నడిపే చాయ్‌ దుకాణంలో పని చేయడం.. వెయిట్‌లిఫ్టింగ్‌ శిక్షణకు వెళ్లడం.. పాఠశాలకు వెళ్లి చదువుకోవడం.. సాయంత్రం కాగానే మళ్లీ దుకాణంలో పాన్‌లు కట్టడం.. జిమ్‌లో కసరత్తులు చేయడం.. ఇదీ ఒకప్పుడు సంకేత్‌ దినచర్య.

Updated : 31 Jul 2022 09:26 IST

ఉదయాన్నే 5.30 గంటలకు నిద్ర లేవడం.. తన తండ్రి నడిపే చాయ్‌ దుకాణంలో పని చేయడం.. వెయిట్‌లిఫ్టింగ్‌ శిక్షణకు వెళ్లడం.. పాఠశాలకు వెళ్లి చదువుకోవడం.. సాయంత్రం కాగానే మళ్లీ దుకాణంలో పాన్‌లు కట్టడం.. జిమ్‌లో కసరత్తులు చేయడం.. ఇదీ ఒకప్పుడు సంకేత్‌ దినచర్య. ఆర్థిక ఇబ్బందులు అడ్డుగా నిలిచినా.. పేదరికం వెక్కిరిస్తున్నా.. ఆటనే నమ్ముకున్న అతను పోరాటం వదల్లేదు. బరువులు ఎత్తడంలో పట్టు సాధించి ఇప్పుడు కామన్వెల్త్‌లో రజతాన్నే ఎత్తేశాడు. బాల్యం నుంచి ఎన్నో సవాళ్లు దాటి ఇప్పుడు దేశానికి వెండి వెలుగులు అందించిన అతని ప్రయాణం స్ఫూర్తిదాయకం.

ఈనాడు క్రీడావిభాగం

కామన్వెల్త్‌ క్రీడల పోటీల్లో క్లీన్‌ అండ్‌ జర్క్‌లో రెండో ప్రయత్నంలో తన మోచేతికి తీవ్ర గాయమై నొప్పితో బాధపడుతున్నా మరోసారి బరువులెత్తేందుకు సంకేత్‌ సిద్ధమయ్యాడు. ఎలాగైనా సరే పసిడి దక్కించుకోవాలనే పట్టుదలే అందుకు కారణం. ఆ క్రమంలో విఫలమైనా అతని తెగువ, తపన అందరినీ ఆకట్టుకుంది. పోరాటాన్ని నమ్ముకుని ప్రయాణం చేయడం అతనికి ఎప్పటి నుంచో అలవాటు. వెయిట్‌లిఫ్టర్ల అడ్డాగా పేరొందిన మహారాష్ట్రలోని సాంగ్లీ నుంచి వచ్చిన సంకేత్‌ కూడా ఆ ఆటలోనే అడుగులు వేశాడు. తనది పేద కుటుంబం. తన తండ్రి నడిపే టీ, పాన్‌ షాప్‌ మాత్రమే ఆధారం. సంకేత్‌ కూడా తన తండ్రికి సాయంగా ఆ దుకాణంలో పని చేసేవాడు. పకోడి, వడా పావ్‌ తయారు చేసేవాడు. తమ ఆర్థిక పరిస్థితిని మార్చాలన్న పట్టుదలతో ఆటలో అదరగొడుతున్నాడు. అతని తండ్రి మహాదేవ్‌ వెయిట్‌లిఫ్టర్‌ కావాలని అనుకున్నాడు. కానీ ఆర్థిక సమస్యల కారణంగా ఆగిపోయాడు. ఇప్పుడు తన సంతానాన్ని ఆటలో ప్రోత్సహిస్తున్నాడు. సంకేత్‌ చెల్లి కాజోల్‌ కూడా వెయిట్‌లిఫ్టరే.

నాలుగేళ్ల కల..: 2022 కామన్వెల్త్‌ క్రీడల్లో ఛాంపియన్‌గా నిలవాలి.. ఇదీ నాలుగేళ్ల క్రితం సంకేత్‌ తనకు తాను చేసుకున్న ప్రతిజ్ఞ. 2018 క్రీడల్లో రజతం గెలిచిన గురు రాజాను టీవీలో చూసి సంకేత్‌ కూడా కామన్వెల్త్‌లో పసిడి నెగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. బాల్యంలో తన తాతయ్యతో కలిసి చాయ్‌ దుకాణానికి దగ్గర్లో ఉన్న దిగ్విజయ్‌ వ్యాయమశాలకు సంకేత్‌ వెళ్లేవాడు. అక్కడ బరువులు ఎత్తుతున్న వెయిట్‌లిఫ్టర్లను చూసి అతనూ ఆటపై ప్రేమ పెంచుకున్నాడు. 13 ఏళ్ల వయసులో బరువులు ఎత్తడం మొదలెట్టి అంచెలంచెలుగా ఎదిగాడు. ముగ్గురు సంతానం ఉన్న ఆ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా సంకేత్‌ ఫిట్‌నెస్‌ కోసం సరైన ఆహారం అందించడం ఇబ్బందిగా ఉండేది. ఉదయం 5.30 గంటలకే లేచి చాయ్‌ దుకాణంలో పని.. ఆ తర్వాత శిక్షణ.. అనంతరం చదువు.. సాయంత్రం మళ్లీ ఇదే పునరావృతం అయ్యేది. అయినా ఆటపై అశ్రద్ధ చూపలేదు. కోచ్‌ ప్రోత్సాహంతో ఇబ్బందులను దాటి పయనం సాగించాడు. రాష్ట్ర స్థాయిలో ఛాంపియన్‌గా నిలిచి సత్తాచాటాడు. 2020లో ఖేలో ఇండియా, ఖేలో ఇండియా విశ్వవిద్యాలయాల క్రీడల్లో స్వర్ణాలు సొంతం చేసుకున్నాడు. అదే ఏడాది తొలిసారి జాతీయ సీనియర్‌ ఛాంపియన్‌గా నిలిచి వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత రెండేళ్లూ ఆ టైటిల్‌ అతనిదే. ఈ ఏడాది సింగపూర్‌ అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లో 256 (113+143) కేజీల బరువెత్తి జాతీయ, కామన్వెల్త్‌ రికార్డునూ తిరగరాశాడు. ఇప్పుడు కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం గెలిచేలా కనిపించిన అతను.. దురదృష్టవశాత్తూ రజతానికే పరిమితమయ్యాడు. 61 కేజీల విభాగంలోకి మారి 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిథ్యం వహించడమే అతని లక్ష్యం.


‘‘క్లీన్‌ అండ్‌ జర్క్‌ రెండో ప్రయత్నంలో బరువు ఎత్తేటప్పుడు ఎలాంటి తప్పు చేయలేదు. కానీ ఒక్కసారిగా ఆ భారం మొత్తం నా కుడి మోచేతిపై పడడంతో నియంత్రణ కోల్పోయా. రెండు సార్లు ఎముక చిట్లినట్లు శబ్దం వినిపించింది. శిక్షణలో నేను 143 కేజీలెత్తా. కేవలం పసిడి సాధించాలనే బరిలో దిగా. నాలుగేళ్ల నుంచి దాని కోసమే కష్టపడ్డా. అందుకే ఇప్పుడు సంతృప్తిగా లేదు. కాస్త ఆనందంగా ఉన్నా కానీ మరింత మెరుగ్గా రాణించాల్సింది. ఇప్పుడు మోచేయి చాలా నొప్పిగా ఉంది. ఎక్స్‌రే తీసిన తర్వాతే గాయం తీవ్రత తెలుస్తుంది. స్వర్ణం గెలవనందుకు నిరాశ పడుతున్నా. తిరిగి బలంగా పుంజుకుంటా’’  

- సంకేత్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని