ODI, T20ల్లో ‘స్టాప్‌ క్లాక్‌’ నిబంధన.. టీ20 ప్రపంచకప్‌ నుంచే అమల్లోకి..

ప్రస్తుతం ట్రయల్‌లో ఉన్న ‘స్టాప్‌ క్లాక్’ రూల్‌ను ఐసీసీ వన్డే, టీ20లకు తప్పనిసరి చేసింది. టీ20 ప్రపంచకప్‌ టోర్నీ నుంచి ఇది అమల్లోకి రానుంది.

Updated : 15 Mar 2024 22:15 IST

దుబాయ్‌: క్రికెట్‌లో మరో కొత్త నిబంధన ప్రవేశపెట్టేందుకు ఐసీసీ (ICC) సిద్ధమైంది. ఇకపై వన్డేలు, టీ20ల్లో ‘స్టాప్‌ క్లాక్‌’ (Stop Clock) రూల్‌ను అమలుచేయనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఇప్పటివరకు ప్రయోగాత్మకంగా అమల్లో ఉన్న ఈ నిబంధన జూన్‌లో జరగబోయే టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup 2024) టోర్నీ నుంచి పూర్తిస్థాయిలో అమలవుతుందని వెల్లడించింది. ఈమేరకు బోర్డు వార్షిక సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ‘‘ముందుగా నిర్ణయించిన దాని ప్రకారం ‘స్టాప్‌ క్లాక్‌’ రూల్‌ ప్రయోగాత్మక పరిశీలన ఏప్రిల్‌ 2024 వరకు నిర్వహించాల్సిఉంది. కానీ, ఇప్పటికే అనుకున్న ఫలితాలు రావడంతో ముందుగానే అమలుచేస్తున్నాం. ఈ నిబంధన అమలుతో వన్డే మ్యాచ్‌ల నిర్వహణలో 20 నిమిషాల సమయం ఆదా అవుతుంది’’ అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. 

ఏంటీ స్టాప్‌ క్లాక్‌ రూల్‌?

ఈ నిబంధన ప్రకారం బౌలింగ్ చేసే జట్టు తన తర్వాతి ఓవర్‌లోని మొదటి బంతిని మునుపటి ఓవర్ పూర్తయిన 60 సెకన్ల లోపే ప్రారంభించాలి. అలా చేయలేకపోతే రెండుసార్లు స్లో ఓవర్ వార్నింగ్ ఇస్తారు. మూడోసారి కూడా అలాగే జరిగితే.. బౌలింగ్ జట్టుకు 5 పరుగుల పెనాల్టీ విధిస్తారు. నిబంధన అమల్లో కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. ఒకవేళ ఓవర్ల మధ్యలో బ్యాటర్‌ క్రీజులోకి వచ్చినా.. గాయం కారణంగా మైదానాన్ని వీడి కొత్త బ్యాటర్‌ వచ్చే సమయంలో క్లాక్‌ ప్రారంభమైనా దాన్ని రద్దు చేయొచ్చు. అలాగే, పరిస్థితులు అనుకూలించని సమయంలో ఈ వెసులుబాటు ఉంటుంది. 

రిజర్వ్‌ డేకు ఓకే

స్టాప్‌ క్లాక్‌ రూల్‌తోపాటు మరో నిబంధనను ఐసీసీ అమలుచేయనుంది. జూన్‌ 27న జరిగే టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్, జూన్‌ 29న జరిగే ఫైనల్‌ మ్యాచ్‌లకు రిజర్వ్‌డేకు ఆమోదం తెలిపింది. ఇందులోభాగంగా లీగ్ లేదా సూపర్‌ 8 దశలో లక్ష్య ఛేదనకు దిగిన జట్టు ఐదు ఓవర్లు బ్యాటింగ్ చేస్తేనే ఆట పూర్తైనట్లు పరిగణిస్తారు. నాకౌట్‌ మ్యాచ్‌లలో రెండో ఇన్నింగ్స్‌లో కనీసం 10 ఓవర్లు బౌలింగ్ చేయాల్సిఉంటుంది. 

భారత్‌, శ్రీలంకలో 2026 టీ20 ప్రపంచకప్‌

ఈ సమావేశంలో టీ20 ప్రపంచకప్‌ 2026ను భారత్‌, శ్రీలంకలో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 20 జట్లు పాల్గొంటాయి. ఇందులో 12 జట్లను ఆటోమేటిక్‌ క్వాలిఫైయర్లుగా పరిగణిస్తారు. వీటిలో 2024 ప్రపంచకప్‌లో టాప్‌ 8 జట్లు కాగా, మిగిలిన నాలుగు జట్లు ఐసీసీ ర్యాంకుల ఆధారంగా ఎంపికవుతాయి. మిగిలిన 8 జట్లను ఐసీసీ రీజినల్‌ క్వాలిఫైయర్‌ మ్యాచ్‌ల ద్వారా ఎంపిక చేస్తారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని