ICC U19 World Cup 2024: ఆతిథ్య వేదికను మారుస్తూ ఐసీసీ నిర్ణయం

అండర్‌-19 వరల్డ్‌ కప్‌ ఆతిథ్య వేదికను మార్చినట్లు ఐసీసీ తెలిపింది. అహ్మదాబాద్‌లో జరిగిన సమావేశంలో ఐసీసీ బోర్డు దీనికి ఆమోదం తెలిపింది. 

Updated : 21 Nov 2023 19:11 IST

అహ్మదాబాద్‌: వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ అండర్‌-19 క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ (ICC U19 World Cup 2024) ఆతిథ్య వేదికలో మార్పు చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లను శ్రీలంకలో కాకుండా దక్షిణాఫ్రికాలో నిర్వహించనున్నట్లు మంగళవారం ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ జోక్యం కారణంగా శ్రీలంక క్రికెట్‌ బోర్డు (SLC)పై ఐసీసీ నిషేధం విధించిన 11 రోజుల తర్వాత ఆతిథ్య వేదికలో మార్పు చోటు చేసుకోవడం గమనార్హం. 

‘‘ఎస్‌ఎల్‌సీపై నిషేధం కారణంగా అండర్‌-19 ప్రపంచకప్‌ ఆతిథ్య వేదికను శ్రీలంక నుంచి దక్షిణాఫ్రికాకు మార్చడం జరిగింది. అహ్మదాబాద్‌లో జరిగిన సమావేశంలో ఐసీసీ బోర్డు దీనికి ఆమోదం తెలిపింది. ఇదే విషయాన్ని టోర్నీలో పాల్గొంటున్న జట్లకు తెలియజేశాం. 2020లో దక్షిణాఫ్రికా అండర్‌-19 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ఈ నిర్ణయం వల్ల శ్రీలంక దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్‌పై ఎలాంటి ప్రభావం ఉండదు’’ అని ఐసీసీ బోర్డు సభ్యుడు తెలిపారు. 

గత నెలలో ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 4 వరకు శ్రీలంకలో మ్యాచ్‌లు జరుగుతాయని ప్రకటించింది. తాజాగా ఆతిథ్య వేదికను దక్షిణాఫ్రికాకు మార్చింది. కొద్దిరోజుల క్రితం తమపై నిషేధం ఎత్తివేయాలని ఐసీసీని ఎస్‌ఎల్‌సీ కోరింది. వన్డే ప్రపంచకప్ 2023లో శ్రీలంక ఘోర వైఫల్యం తర్వాత ఆ దేశ క్రికెట్ బోర్డుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఎస్‌ఎల్‌సీని శ్రీలంక క్రీడా శాఖ రద్దు చేసింది. దీనిపై ఎస్‌ఎల్‌సీ కోర్టును ఆశ్రయించడంతో క్రీడా శాఖ నిర్ణయంపై స్టే విధించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎస్‌ఎల్‌సీపై రాజకీయ జోక్యాన్ని తప్పుబడుతూ శ్రీలంక బోర్డుపై ఐసీసీ నిషేధం విధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని