ICC ODI Rankings: కెరీర్‌లో బెస్ట్ ర్యాంక్‌ను అందుకున్న ఇషాన్‌ కిషన్‌.. ఆమ్లా రికార్డును బ్రేక్‌ చేసిన గిల్

ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో భారత యువ ఆటగాళ్లు శుభ్‌మన్‌ గిల్, ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan) తమ స్థానాలను గణనీయంగా మెరుగుపర్చుకున్నారు. 

Updated : 06 Sep 2023 19:56 IST

ఇంటర్నెట్ డెస్క్: బుధవారం ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో భారత యువ ఆటగాళ్లు శుభ్‌మన్‌ గిల్, ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan) తమ స్థానాలను గణనీయంగా మెరుగుపర్చుకున్నారు. ఆసియా కప్‌లో భాగంగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 67 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన శుభ్‌మన్ గిల్ (Shubman Gill) కెరీర్‌లో అత్యుత్తమ రేటింగ్ పాయింట్లను పొందాడు. అతడు 750 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. వన్డేల్లో ఇప్పటివరకు గిల్‌కిదే అత్యుత్తమ ర్యాంకు. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 82 పరుగులతో సత్తా చాటిన ఇషాన్‌ కిషన్‌ ఏకంగా 12 స్థానాలు మెరుగుపర్చుకుని కెరీర్‌లో బెస్ట్ ర్యాంకు అందుకున్నాడు. ప్రస్తుతం అతడు 624 రేటింగ్ పాయింట్లతో 12వ స్థానంలో నిలిచాడు. మరోవైపు, నేపాల్‌పై భారీ శతకం (151) బాదిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్‌ 882 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సౌతాఫ్రికా బ్యాటర్ డస్సెన్ రెండో స్థానంలో ఉన్నాడు. 

సూపర్‌-4లో భారత్‌, పాక్‌ మ్యాచ్‌.. అభిమానులకు గుడ్‌న్యూస్‌

ఆమ్లా రికార్డును బ్రేక్‌ చేసిన గిల్

భారత యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 67 పరుగులతో అజేయంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఇన్నింగ్స్‌తో అతడు వన్డే క్రికెట్‌లో కొత్త రికార్డును నెలకొల్పాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 1,500 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. గిల్‌ ఇప్పటివరకు 29 ఇన్నింగ్స్‌లు ఆడి 1,514 పరుగులు చేశాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీ, మూడు సెంచరీలు, ఏడు అర్ధ శతకాలున్నాయి. అంతకుముందు వేగంగా 1,500 పరుగులు చేసిన రికార్డు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఆషీమ్ ఆమ్లా (Hashim Amla) పేరిట ఉండేది. ఆమ్లా 30 మ్యాచ్‌ల్లో 1500 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తాజాగా ఆ రికార్డును గిల్ బ్రేక్ చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని