IND vs ENG: ఇంగ్లాండ్‌పై బుమ్రా ‘సిక్సర్‌’.. రెండో రోజు ముగిసిన ఆట

భారత్‌లో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 253 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా.. వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది.

Updated : 03 Feb 2024 17:25 IST

విశాఖపట్నం: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ఇండియా పేసర్‌ జస్‌ప్రీత్ బుమ్రా (6/45) విజృంభించాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో పర్యటక జట్టు 253 పరుగులకే ఆలౌటైంది. ఈక్రమంలో మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 143 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్.. వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (13*), యశస్వి జైస్వాల్ (15*) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమ్ఇండియా ఆధిక్యం 171 రన్స్‌. 

బుమ్రా దెబ్బకు బెంబేలు..

ఇంగ్లాండ్‌ ఈ మాత్రం స్కోరు చేయగలిగిందంటే దానికి కారణం ఇద్దరు.. ఓపెనర్‌ జాక్‌ క్రాలీ (76; 78 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌ ఆడి అర్ధ శతకం బాదాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్, కెప్టెన్ బెన్‌స్టోక్స్‌ (47; 54 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా దూకుడు ప్రదర్శించాడు. తొలుత బెన్‌ డకెట్ (21)ని కుల్‌దీప్‌ ఔట్‌ చేయగా.. దూకుడుగా ఆడుతున్న క్రాలీ.. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడబోయి శ్రేయస్‌ అయ్యర్‌కు దొరికిపోయాడు. అనంతరం బుమ్రా తన వరుస ఓవర్లలో జో రూట్‌ (21), తొలి మ్యాచ్‌ సెంచరీ హీరో ఓలీ పోప్‌ (23)ని పెవిలియన్‌కు పంపాడు. టీ విరామ సమయానికి ఇంగ్లాండ్ 155/4 స్కోరుతో నిలిచింది.

మూడో సెషన్‌ ప్రారంభమైన కొద్దిసేపటికి బుమ్రా బౌలింగ్‌లో బెయిర్‌స్టో (25).. స్లిప్‌లో గిల్‌కు చిక్కాడు. కుల్‌దీప్‌ యాదవ్‌ స్వల్పవ్యవధిలో బెన్‌ ఫోక్స్‌ (6), రెహాన్ అహ్మద్‌ (6)లను వెనక్కి పంపాడు. అర్ధ శతకం దిశగా సాగుతున్న స్టోక్స్‌ని బుమ్రా క్లీన్‌బౌల్డ్ చేసి టెస్టుల్లో 150 వికెట్ల మైలురాయిని అదుకున్నాడు. చివరి రెండు వికెట్లు హార్ట్‌లీ (21), జేమ్స్‌ అండర్సన్‌ (6) కూడా బుమ్రాకే దక్కాయి. కుల్‌దీప్‌ యాదవ్‌ 3, అక్షర్ పటేల్ ఓ వికెట్ పడగొట్టారు. అంతకుముందు 336/6 స్కోరుతో రెండోరోజు ఆటను ప్రారంభించిన రోహిత్‌ సేన.. 396 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (209) డబుల్ సెంచరీ బాదాడు. 

అతి తక్కువ బంతుల్లో 150 టెస్టు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు  

  • 6781- జస్‌ప్రీత్‌ బుమ్రా
  • 7661- ఉమేశ్ యాదవ్
  • 7755- మహ్మద్‌ షమి
  • 8378- కపిల్ దేవ్
  • 8380- రవిచంద్రన్‌ అశ్విన్  
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని