World Cup 2023 Final: ఇప్పుడుకాక.. ఇంకెప్పుడు

ఇంకొన్ని రోజుల్లో ప్రపంచకప్‌ ఆరంభం కానుండగా.. ఆశలకు లోటు లేదు..! కానీ మన జట్టు కప్పు గెలుస్తుందా అంటే.. ఔనని ధీమాగా చెప్పలేని పరిస్థితి! ఎన్నో సమస్యలు.. ఏవేవో భయాలు..! కానీ కప్పు ముందుకు సాగుతున్న కొద్దీ.. ఏదో మంత్రం వేసినట్లుగా అన్ని సమస్యలూ తొలగిపోయాయి. అన్ని భయాలూ ఎగిరిపోయాయి.

Updated : 19 Nov 2023 13:19 IST

నేడే వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌
మూడో టైటిల్‌పై భారత్‌ గురి
ఆసీస్‌తో అమీతుమీ
మధ్యాహ్నం 2 గంటల నుంచి
అహ్మదాబాద్‌

ఇంకొన్ని రోజుల్లో ప్రపంచకప్‌ (World Cup) ఆరంభం కానుండగా.. ఆశలకు లోటు లేదు..!

కానీ మన జట్టు కప్పు గెలుస్తుందా అంటే.. ఔనని ధీమాగా చెప్పలేని పరిస్థితి!

ఎన్నో సమస్యలు.. ఏవేవో భయాలు..!

కానీ కప్పు ముందుకు సాగుతున్న కొద్దీ.. ఏదో మంత్రం వేసినట్లుగా అన్ని సమస్యలూ తొలగిపోయాయి. అన్ని భయాలూ ఎగిరిపోయాయి.

రోహిత్‌ ఇంత నిలకడగా ఆడతాడని అనుకున్నామా? కోహ్లి మళ్లీ ఈ స్థాయిలో పరుగుల వరద పారిస్తాడని ఊహించామా? ప్రపంచకప్‌లో ఆడటమే కష్టమనుకున్న బుమ్రా, రాహుల్‌, శ్రేయస్‌ల నుంచి ఇంత మంచి ప్రదర్శన అంచనా వేశామా? షమి ఇలా రెచ్చిపోతాడని కలగన్నామా?

ఆస్ట్రేలియా (Asutralia)తో తొలి మ్యాచా, అమ్మో అన్నారు..  కష్టపడ్డా గెలిచేశారు! పాకిస్థాన్‌ (Pakistan)తో ఇప్పుడంత తేలిక కాదన్నారు.. చిత్తు కింద కొట్టేశారు. దక్షిణాఫ్రికా (South Africa) జోరు చూసి వామ్మో అన్నారు.. ఉఫ్‌మని ఊదేశారు. చరిత్ర మనవైపు లేదు, న్యూజిలాండ్‌(New Zealand)తో కష్టమన్నారు.. సెమీస్‌లో  పట్టుబట్టి గెలిచారు. టోర్నీలో ఎలాంటి ప్రత్యర్థి ఎదురైనా.. భారత్‌కు దాసోహమే.

ఎప్పుడూ లేనంత ఆధిపత్యం.. ఎన్నడూ చూడని అప్రతిహత విజయాలు.. ఎప్పటికీ నిలిచిపోయే ప్రదర్శన.

బ్యాటర్ల నిలకడ అమోఘం.. బౌలర్ల మెరుపులు అద్భుతం.. మొత్తంగా జట్టు ప్రదర్శన అసాధారణం.

కానీ ఇప్పటిదాకా సాగించిన ఆధిపత్యం, సాధించిన విజయాలు, నెలకొల్పిన రికార్డులు.. అన్నింటికీ సార్థకత చేకూరేది ఈ ఒక్క విజయంతోనే.

క్రికెట్లో కప్పులెన్నో ఉన్నా వన్డే ప్రపంచకప్‌ (World Cup) అత్యున్నతం. క్రికెట్‌ అంటే పడిచచ్చే మన దేశం ఈసారి ఆ అత్యున్నత టోర్నీకి వేదిక. ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంలో ఆ టోర్నీ ఫైనల్‌.. ఆ ఫైనల్లో మన జట్టు.. ఎదురుగా ఆస్ట్రేలియా లాంటి దీటైన ప్రత్యర్థి.. ఇంతకంటే గొప్ప క్లైమాక్స్‌ ఏముంటుంది? మరి ఆ పతాక ఘట్టంలో కంగారూలను కొట్టి మన జట్టు కప్పు అందుకుంటే...? లక్షమందికి పైగా అభిమానులు స్టేడియాన్ని హోరెత్తిస్తుండగా.. త్రివర్ణ పతాకాలు రెపరెపలాడుతుండగా.. ఆరాధ్య ఆటగాళ్లు కోహ్లి (Kohli), రోహిత్‌ (Rohit) కప్పు చేతబూని స్టేడియంలో విజయయాత్ర చేస్తే.. ఇంతకంటే గొప్ప దృశ్యం ఉంటుందా? ఆ చారిత్రక క్షణాల కోసమే ఇప్పుడందరి ఎదురు చూపులు!

మళ్లీ మళ్లీ రాని రోజిది.. జీవితకాల అవకాశమిది..!

రోహిత్‌.. ఇంకొక్కసారి చెలరేగు! విరాట్‌.. మరొక్కసారి నిలబడు! షమీ.. మళ్లీ ఒక్కసారి విజృంభించు! టీమ్‌ఇండియా.. ఈ ఒక్క రోజు రెచ్చిపో!

మీ ఎదురుగా పదకొండు మందే.. కానీ మీ వెంట 140 కోట్లమంది!

ఇప్పుడు కాక ఇంకెప్పుడు.. అదరగొట్టేయ్‌ టీమ్‌ఇండియా!

కప్పు కొట్టేయ్‌ ఇండియా..!

2023 ప్రపంచకప్‌ (World Cup 2023 Final) అంతిమ సమరానికి రంగం సిద్ధమైంది. ఒక్క మ్యాచ్‌ ఓడకుండా, ఎదురొచ్చిన ప్రతి ప్రత్యర్థినీ ఓడిస్తూ ఫైనల్‌ చేరిన భారత్‌ (Team India) ఓవైపు.. రెండు వరుస ఓటములతో టోర్నీని ఆరంభించినా, తర్వాత బలంగా పుంజుకుని వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకొచ్చిన ఆస్ట్రేలియా (Australia) ఇంకోవైపు. మూడోసారి ప్రపంచకప్‌ గెలవడానికి వచ్చిన సువర్ణావకాశాన్ని వదులకోకూడదని భారత్‌ పట్టుదలతో ఉంటే.. తమ టైటిళ్ల ఖజానాను అరడజనుకు పెంచాలని ఆస్ట్రేలియా చూస్తోంది. టోర్నీలో ఆధిపత్యానికి తోడు సొంతగడ్డపై ఆడుతుండటం రోహిత్‌సేనను ఫేవరెట్‌గా నిలబెడుతోంది. లీగ్‌ దశలో ఆస్ట్రేలియాను ఓడించడం కూడా కలిసొచ్చే విషయమే. కానీ పోరాటతత్వానికి మారుపేరైన ఆస్ట్రేలియాను ఎప్పుడూ తక్కువ అంచనా వేయలేం. పేలవారంభం తర్వాత పుంజుకున్న తీరు, ఓడిపోయే మ్యాచ్‌లను కాపాడుకున్న వైనం ఆ జట్టుతో అంత తేలిక కాదనడానికి సంకేతాలు. రోహిత్‌, శుభ్‌మన్‌, కోహ్లి, శ్రేయస్‌, రాహుల్‌.. ఇలా భారత ప్రధాన బ్యాటర్లందరూ నిలకడగా రాణించారు. బౌలింగ్‌లో షమి విజృంభిస్తున్నాడు. బుమ్రా, కుల్‌దీప్‌, జడేజా సైతం మంచి లయతో ఉన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం ఆడుతూ ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసిన టీమ్‌ఇండియా.. ఫైనల్లోనూ అదే ఆటను పునరావృతం చేస్తే కప్పు గెలవడం కష్టమేమీ కాదు. అయితే తీవ్ర ఒత్తిడితో కూడిన ఫైనల్లో ప్రణాళికలు దెబ్బతిని ప్రతికూల పరిస్థితులు ఎదురైతే టీమ్‌ఇండియా ఎలా నిబ్బరంగా నిలబడి గెలుస్తుందన్నది ప్రశ్న. బ్యాటింగ్‌లో హెడ్‌, వార్నర్‌, మార్ష్‌, స్మిత్‌, లబుషేన్‌, మ్యాక్స్‌వెల్‌.. బౌలింగ్‌లో స్టార్క్‌, హేజిల్‌వుడ్‌, కమిన్స్‌, జంపా.. ఇలా రెండు విభాగాల్లోనూ బలంగా ఉన్న ప్రత్యర్థిని కొట్టి కప్పు అందుకుంటే ఉండే కిక్కే వేరు. రోహిత్‌ సేన ఆదివారం రాత్రి ఆ కిక్కునే ఇస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

ODI WC Final 2023: భారత్‌ vs ఆస్ట్రేలియా ఫైనల్‌ మ్యాచ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌


ఆరంభమే ప్రధానం

ఈ ప్రపంచకప్‌లో భారత్‌ జైత్రయాత్ర.. శుభారంభంతోనే ముడిపడి ఉంది. ఆస్ట్రేలియాతో తొలి పోరును పక్కన పెడితే.. మిగతా మ్యాచ్‌ల్లో భారత్‌కు శుభారంభాలు దక్కాయి. రోహిత్‌ మెరుపు ఆరంభాలతో ప్రత్యర్థి బౌలర్ల లయను దెబ్బ తీయడం ద్వారా జట్టును పైచేయిలో నిలిపాడు. ఇన్నింగ్స్‌కు బలమైన పునాది పడటంతో జట్టు ఉత్సాహం రెట్టింపైంది. ఆటగాళ్లందరూ సమష్టిగా కదిలి ప్రత్యర్థులు పోటీలో లేకుండా చేశారు. చాలా మ్యాచ్‌ల్లో ఒక ఇన్నింగ్స్‌ అయ్యేసరికే భారత్‌ గెలుపు ఖరారైపోయింది. బౌలింగ్‌లోనూ భారత్‌కు అదిరే ఆరంభాలు దక్కాయి. ఆదివారం కూడా ఇలాగే ఆరంభంలో పైచేయి సాధించడం కీలకం.


టాస్‌ గెలిస్తే..?

‘‘ఈ ప్రపంచకప్‌లో కొన్ని మ్యాచ్‌ల్లో టాస్‌ కీలక పాత్ర పోషించింది. అహ్మదాబాద్‌లో జరిగిన నాలుగు లీగ్‌ మ్యాచ్‌ల్లో మూడుసార్లు రెండోసారి బ్యాటింగ్‌ చేసిన జట్టే గెలిచింది. పాకిస్థాన్‌తో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లోనూ భారత్‌ ఛేదనలోనే నెగ్గింది. ఆ మ్యాచ్‌లో మాదిరే ఫైనల్లోనూ టాస్‌ గెలిస్తే రోహిత్‌ బౌలింగ్‌ ఎంచుకునే అవకాశాలే ఎక్కువ. అయితే టోర్నీలో మెజారిటీ మ్యాచ్‌ల్లో మొదట బ్యాటింగ్‌ చేసి భారీ స్కోరుతో ఒత్తిడికి గురి చేసిన రోహిత్‌సేన.. ఆ దృష్టితో బ్యాటింగ్‌ చేసే అవకాశాన్నీ కొట్టి పారేయలేం.


వ్యూహం మారుతుందా?

ఈ ప్రపంచకప్‌ అంతా భారత్‌ ఆట ఒక ప్రణాళిక ప్రకారం సాగిపోయింది. ఓపెనింగ్‌లో రోహిత్‌ ధాటిగా ఆడి ప్రత్యర్థి బౌలర్ల లయను దెబ్బ తీయడం.. కోహ్లి కుదురుగా ఆడుతూ భాగస్వామ్యాలు నెలకొల్పడం.. మిగతా బ్యాటర్లు ధాటిగా బ్యాటింగ్‌ చేసి జట్టుకు భారీ స్కోరు సాధించి పెట్టడం.. ఇదీ బ్యాటింగ్‌ ప్రణాళిక. ఆపై బౌలింగ్‌లో బుమ్రా ఆరంభంలో పొదుపుగా బౌలింగ్‌ చేసి బ్యాటర్లను ఒత్తిడిలోకి నెడితే.. తర్వాత షమి వచ్చి వికెట్ల మీద వికెట్లు తీయడం.. మధ్య ఓవర్లలో స్పిన్నర్లు కట్టడి చేయడం.. ఇదీ బౌలింగ్‌ లెక్క! అయితే భారత్‌ ఆట మీద ఆసీస్‌ అధ్యయనం చేసే వస్తుందనడంలో సందేహం లేదు. కాబట్టి వారి అంచనాకు అందని విధంగా భారత్‌ భిన్నంగా ఏమైనా చేస్తుందేమో చూడాలి. ఆరంభ ఓవర్లలో రోహిత్‌ మీదే గురిపెడతారు కాబట్టి.. ఈసారి అతను తగ్గి శుభ్‌మన్‌ షాట్లకు దిగడం లాంటిది జరిగితే ఆశ్చర్యం లేదు.


ముగ్గురు మొనగాళ్లు..

టోర్నీలో భారత్‌ విజయాల్లో ముగ్గురు ఆటగాళ్లది అత్యంత కీలక పాత్ర. వాళ్లే.. కోహ్లి, షమి, రోహిత్‌ శర్మ. ప్రపంచకప్‌ ఆరంభానికి ముందు రోహిత్‌ ఫామ్‌ గొప్పగా ఏమీ లేదు. కానీ టోర్నీలో అతను అంచనాలను మించిపోయాడు. ధనాధన్‌ బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్ల లయను దెబ్బ తీస్తూ జట్టును పైచేయిలో నిలపడం లక్ష్యంగా సాగాడు. కోహ్లి ఈ స్థాయిలో పరుగుల వరద పారిస్తాడని ఊహించలేదు. ఓపెనర్లు ఇచ్చిన శుభారంభాలను సద్వినియోగం చేస్తూ ఇన్నింగ్స్‌ను నడిపించడం, కీలక భాగస్వామ్యాలతో జట్టుకు భారీ స్కోర్లు సాధించి పెట్టడంలో అతను కీలక పాత్ర పోషించాడు. ఇక బౌలింగ్‌లో షమి మెరుపుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆలస్యంగా జట్టులోకి వచ్చిన అతను.. కసిగా బౌలింగ్‌ చేస్తూ ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపించాడు. గొప్ప ప్రదర్శనతో భారత్‌ ఫైనల్‌ చేరడంలో ముఖ్య పాత్ర పోషించిన ఈ ముగ్గురు మొనగాళ్లు.. ఇంకొక్క రోజు ఇలాగే రాణించాలి.


రేసులో ఆ నలుగురు

ప్రపంచకప్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద టోర్నీ’ రేసులో నలుగురు భారత ఆటగాళ్లు నిలిచారు. ఈ అవార్డు కోసం మొత్తం తొమ్మిది మందిని పోటీదారులుగా ఐసీసీ ప్రకటించింది. ఇందులో టీమ్‌ఇండియా నుంచి కోహ్లి, రోహిత్‌, షమి, బుమ్రా ఉన్నారు. జంపా, మ్యాక్స్‌వెల్‌ (ఆస్ట్రేలియా), రచిన్‌ రవీంద్ర, డరైల్‌ మిచెల్‌ (న్యూజిలాండ్‌), డికాక్‌ (దక్షిణాఫ్రికా) కూడా పోటీలో ఉన్నారు. ఇందులో తమకు నచ్చిన ఆటగాళ్లకు ఓటు వేసే అవకాశాన్ని తమ వెబ్‌సైట్లో ఐసీసీ కల్పించింది.


దుర్బేధ్యం కాదు

ఆస్ట్రేలియా బలమైన ప్రత్యర్థి అనడంలో సందేహం లేదు. కానీ ఆ జట్టు అజేయం, దుర్బేధ్యం మాత్రం కాదు. ఆ విషయం ఈ ప్రపంచకప్‌లోనే కొన్ని మ్యాచ్‌ల్లో రుజువైంది. లీగ్‌ దశలో భారత్‌ చేతిలోనే ఆ జట్టు ఓడిన సంగతి మరువరాదు. చెన్నైలో స్పిన్‌ పిచ్‌పై తడబడ్డ ఆ జట్టు 199 పరుగులకే ఆలౌటైంది. అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో 292 పరుగుల ఛేదనలో 91కే 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచులదాకా వెళ్లింది. దక్షిణాఫ్రికా.. కంగారూలను చిత్తుగా ఓడించడం తెలిసిందే. సెమీస్‌లోనూ తడబడింది. ఆస్ట్రేలియాను ఒత్తిడికి గురి చేయడం కష్టమేమీ కాదనడానికివి సూచికలు. దూకుడుగా ఆడే వార్నర్‌, హెడ్‌లను త్వరగా పెవిలియన్‌ చేరిస్తే ఆస్ట్రేలియా ఒత్తిడిలో పడుతుంది. మధ్య ఓవర్లలో స్పిన్నర్ల దాడిని తట్టుకోవడం కూడా ఆ జట్టుకు కష్టమే. అలాగే బ్యాటింగ్‌లో ఓపెనర్లు.. స్టార్క్‌, హేజిల్‌వుడ్‌ లయను దెబ్బ తీసినా పైచేయి సాధించినట్లే.


ఆ నలుగురు..

ఆస్ట్రేలియా జట్టులో భారత్‌కు ప్రధానంగా ముప్పు నలుగురి నుంచే పొంచి ఉంది. వాళ్లను కట్టడి చేయడమే కీలకం.

హెడ్‌: ప్రపంచకప్‌లోకి ఆలస్యంగా అడుగు పెట్టిన హెడ్‌.. ఆసీస్‌కు రెండు విజయాలందించాడు. సెమీస్‌లో బంతితో, బ్యాటుతో అతను ఎలా రెచ్చిపోయాడో తెలిసిందే. గత ఏడాది ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో మెరుపు సెంచరీతో భారత్‌కు టైటిల్‌ను దూరం చేసింది హెడ్‌యే. క్రీజులో కుదురుకుంటే అతణ్ని ఆపడం కష్టం. అతడి ఆఫ్‌ స్పిన్‌తోనూ ప్రమాదమే.

స్టార్క్‌: భారత బ్యాటర్లకు ఆరంభంలో స్టార్క్‌ను ఎదుర్కోవడం అతి పెద్ద సవాల్‌. రోహిత్‌ శర్మను అతను లక్ష్యంగా చేసుకుంటాడనడంలో సందేహం లేదు. తొలి స్పెల్‌లో స్టార్క్‌ను సమర్థంగా ఎదుర్కొంటే భారత్‌కు బ్యాటింగ్‌లో అతి పెద్ద ముప్పు తొలగిపోయినట్లే.

మ్యాక్స్‌వెల్‌: అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్‌ అసాధారణ పోరాటాన్ని చూశాక అతణ్ని ఎవ్వరూ తేలిగ్గా తీసుకోరు. ఫైనల్లో అతడి మీద భారత్‌ ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిందే. అతణ్ని వీలైనంత త్వరగా పెవిలియన్‌ చేర్చకపోతే మ్యాచ్‌ ఫలితాలనే మార్చేస్తాడు.

జంపా: దక్షిణాఫ్రికాతో సెమీఫైనల్లో జంపా తేలిపోయి ఉండొచ్చు. కానీ టోర్నీలో అతనే అత్యుత్తమ స్పిన్నర్‌. 22 వికెట్లు తీశాడు. అహ్మదాబాద్‌ పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలం కాబట్టి జంపాతో భారత బ్యాటర్లు జాగ్రత్తగా ఉండాల్సిందే.


భారత వాయు సేనకు చెందిన సూర్యకిరణ్‌ ఏరోబాటిక్స్‌ బృందం విన్యాసాలు మధ్యాహ్నం 1.35 గంటలకు ఆరంభమవుతాయి. ఈ మ్యాచ్‌ ప్రసారదారు స్టార్‌స్పోర్ట్స్‌.. ఫైనల్‌ నేపథ్యంలో ఉదయం 7 నుంచే ప్రత్యేక కవరేజీ ఇవ్వనుంది.


286

ఈ టోర్నీలో నరేంద్ర మోదీ స్టేడియంలో నమోదైన అత్యధిక స్కోరు. ఇంగ్లాండ్‌పై ఆసీస్‌ ఈ స్కోరు చేసింది. ఛేదనలో ఇంగ్లాండ్‌ 253 పరుగులకే ఆలౌటైంది.


23

టోర్నీలో అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్న షమి తీసిన వికెట్లు.


711

ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ కోహ్లి చేసిన పరుగులు. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌ అతనే.


5-8

వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై భారత గెలుపోటములు. ఈ రెండు జట్లు 13 మ్యాచ్‌ల్లో తలపడగా భారత్‌ 5, ఆస్ట్రేలియా 8 సార్లు గెలిచాయి. చివరగా ఈ సారి ప్రపంచకప్‌ లీగ్‌ మ్యాచ్‌లో ఆసీస్‌ను 6 వికెట్ల తేడాతో టీమ్‌ఇండియా ఓడించింది. 2011లో అహ్మదాబాద్‌లోనే జరిగిన క్వార్టర్‌ఫైనల్లో టీమ్‌ఇండియా.. ఆస్ట్రేలియాను ఓడించడం విశేషం.


22

స్పిన్నర్‌ జంపా సాధించిన వికెట్లు. ఆసీస్‌ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు.


528

ఈ టోర్నీలో ఆసీస్‌ తరపున టాప్‌స్కోరర్‌గా ఉన్న వార్నర్‌ చేసిన పరుగులు.


తుది జట్లు (అంచనా)...

భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌, కోహ్లి, శ్రేయస్‌, రాహుల్‌, సూర్యకుమార్‌, జడేజా, కుల్‌దీప్‌, షమి, బుమ్రా, సిరాజ్‌;

ఆస్ట్రేలియా: వార్నర్‌, హెడ్‌, మార్ష్‌, స్మిత్‌, లబుషేన్‌, మ్యాక్స్‌వెల్‌, ఇంగ్లిస్‌, కమిన్స్‌ (కెప్టెన్‌), స్టార్క్‌, జంపా, హేజిల్‌వుడ్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని