Rinku Singh: అప్పుడు కేకేఆర్‌ అకాడమీలో చేసిన శ్రమకు ఫలితమిది: రింకు సింగ్

తన ఆటతీరు మెరుగు కావడానికి ప్రధాన కారణమేంటో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (KKR) ఆటగాడు రింకు సింగ్‌ (Rinku Singh) వెల్లడించాడు. అలాగే  టీమ్‌ఇండియా మాజీ క్రికెటరే తనకు ఆదర్శమని తెలిపాడు.

Published : 11 May 2023 17:11 IST

 

ఇంటర్నెట్ డెస్క్: డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్ టైటాన్స్‌పై (GT) ఒకే ఓవర్‌లో ఐదు సిక్స్‌లు కొట్టి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను (KKR) గెలిపించిన రింకు సింగ్‌ (Rinku Singh) గుర్తుండే ఉంటాడు. ఆ తర్వాత కూడా కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. మూడు రోజుల కిందట పంజాబ్‌పైనా  చివరి బంతికి బౌండరీ కొట్టి కేకేఆర్‌ను గెలిపించాడు. ఇవాళ రాజస్థాన్‌ రాయల్స్‌తో తలపడేందుకు కోల్‌కతా సిద్ధమైంది. ప్లేఆఫ్స్‌ అవకాశాలు నిలవాలంటే ఇరు జట్లకూ ఈ మ్యాచ్‌ చాలా కీలకం. మరోసారి రింకు చెలరేగిపోవాలని కేకేఆర్ అభిమానులు ఆశిస్తున్నారు. కోల్‌కతా తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌ కూడా రింకు సింగ్‌ కావడం విశేషం. ఇప్పటి వరకు 11 మ్యాచుల్లో 151.12 స్ట్రైక్‌రేట్‌తో 337 పరుగులు చేశాడు. ఈ క్రమంలో రింకు సింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. రాజస్థాన్‌తో మ్యాచ్ సందర్భంగా ప్రెస్ కాన్ఫెరెన్స్‌లో రింకు సింగ్‌ మాట్లాడాడు. మ్యాచ్‌లు లేని సమయంలోనూ కేకేఆర్‌ అకాడమీలో ప్రాక్టీస్‌ చేయడం వల్లే ఇదంతా సాధ్యమైందని పేర్కొన్నాడు. 

‘‘కేకేఆర్‌ అకాడమీలో కఠిన శ్రమ చేయడంతోనే ఇప్పుడీ సీజన్‌లోనూ రాణించగలుగుతున్నా. మ్యాచ్‌లు లేని సమయంలోనూ మా కోసం క్యాంప్‌లను ఏర్పాటు చేయడం జరిగింది. సాధనతో నా ఆటతీరును మెరుగుపర్చుకున్నా. డెత్‌ ఓవర్లలో దూకుడుగా బ్యాటింగ్‌ చేయడానికి నెట్స్‌లోనూ ప్రాక్టీస్ చేశా. నేను బ్యాటింగ్‌కు దిగే స్థానాన్ని బట్టి షాట్లను సాధన చేసేవాడిని. సింపుల్‌ షాట్లను మాత్రమే ఆడతా. విభిన్న షాట్లు కొడదామని ప్రయత్నిస్తే నా బ్యాటింగ్‌పైనే ప్రభావం పడుతుంది. అందుకే, బంతి ఎలా వస్తుందనేదానిని అంచనా వేసి  భారీ షాట్లు కొడతా. ఫినిషింగ్‌ చేయడంలో ఎంఎస్ ధోనీ దిట్ట. అతడి నుంచి ఎన్నో సూచనలు పొందా. నేను బ్యాటింగ్‌కు దిగినప్పుడు ఎలా ఆడాలని ధోనీని అడిగితే.. ఒకటే మాట చెప్పాడు. మరీ ఎక్కువగా ఆలోచించకూడదు. బంతి కోసం వేచి ఉంటే చాలు. ఇదే ధోనీ నాకిచ్చిన విలువైన సలహా. నేను ఎక్కువగా సురేశ్‌ రైనా ఆటను ఇష్టపడతా. అయితే, ఇతరులను అనుకరించాలని మాత్రం అనుకోను. యూపీ తరఫున నేను ఐదు, ఆరు లేదా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చేవాడిని. ఈ విషయంలో సురేశ్‌ రైనా నాకు మార్గదర్శకుడు’’ అని రింకు సింగ్‌ తెలిపాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని