Virat Kohli: ‘పాకిస్థాన్‌తో మ్యాచ్‌ అనగానే కోహ్లీ చెలరేగి ఆడతాడు’

పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీ (Virat Kohli) చాలా ప్రమాదకరంగా ఉంటాడని భారత మాజీ వికెట్ కీపర్‌ మహమ్మద్ కైఫ్‌ (Mohammad Kaif) అభిప్రాయపడ్డాడు. 

Published : 31 Aug 2023 01:35 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్ 2023  ప్రారంభమైంది. నేపాల్‌తో జరిగిన టోర్నీ ఆరంభ పోరులో పాకిస్థాన్‌ 238 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల దృష్టంతా సెప్టెంబరు 2న జరిగే భారత్, పాకిస్థాన్‌ (IND vs PAK) మ్యాచ్‌పైనే ఉంది. రెండు బలమైన జట్లే కావడంతో మ్యాచ్‌ హోరాహోరీగా సాగడం ఖాయం. టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma)తోపాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)పై  అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. వీరిద్దరూ రాణిస్తే సగం మ్యాచ్‌ గెలిచినట్లేనని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే  కోహ్లీ గురించి భారత మాజీ వికెట్ కీపర్‌ మహమ్మద్ కైఫ్‌ (Mohammad Kaif) మాట్లాడాడు. గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై కోహ్లీ (82; 53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆడిన ఇన్నింగ్స్‌ను అతడు ప్రస్తావించాడు. కోహ్లీకి బౌలింగ్‌ చేస్తున్నప్పుడు పాకిస్థాన్‌ బౌలర్లు ఒత్తిడికి గురవుతారని కైఫ్‌ అభిప్రాయపడ్డాడు. 2022 టీ20 ప్రపంచ కప్‌లో విరాట్ చెలరేగి ఆడి భారత జట్టును గెలిపించిన క్షణాలు పాక్‌ బౌలర్లలో మదిలో మెదులుతుంటాయని పేర్కొన్నాడు. 

అమ్మానాన్న చిరకాల కల నెరవేరింది.. థాంక్యూ మహీంద్రా సర్‌: ప్రజ్ఞానంద

‘‘గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌ అనగానే అతడు చెలరేగిపోతాడు. పూర్తి బాధ్యత తీసుకుని ఆడతాడు. అతడు ఛేజింగ్ మాస్టర్. టీ20 ప్రపంచకప్‌లో కోహ్లీ బాగా ఆడటానికి కారణం 2022 ఆసియా కప్‌. ఆ టోర్నీలో అఫ్గానిస్థాన్‌పై సెంచరీ బాది తిరిగి ఫామ్‌ అందుకున్నాడు. టీ20 ప్రపంచ కప్‌లో కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్‌ ఇప్పటికీ పాకిస్థాన్‌ బౌలర్ల మదిలో మెదులుతూనే ఉంటుంది. కోహ్లీతో ప్రమాదం పొంచి ఉందని, అతడిని ఔట్ చేస్తే మ్యాచ్ చాలా సులువవుతుందని పాక్‌ బౌలర్లకు తెలుసు. కానీ, కోహ్లీ ఇప్పుడు ఫామ్‌లో ఉన్నాడు. బౌలర్లపైనే ఒత్తిడి ఉంటుంది. పాక్‌ బౌలర్లు ఎలా బౌలింగ్ చేస్తారు, వారి బలాలు, బలహీనతలెంటో కోహ్లీకి తెలుసు. పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీ చాలా ప్రమాదకరంగా ఉంటాడు” అని మహమ్మద్‌ కైఫ్‌ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు