Mayank Yadav: ‘మా వాడు మాంసాహారం మానేశాడు.. త్వరలో టీమ్‌ఇండియాకు ఆడతాడు’

ఐపీఎల్‌ 17 సీజన్‌లో లఖ్‌నవూ పేసర్‌ మయాంక్‌ యాదవ్‌ (Mayank Yadav) అదరగొడుతున్నాడు. ఈ 21 ఏళ్ల కుర్రాడు మున్ముందు ఇదే ప్రదర్శన కొనసాగిస్తే టీమ్‌ఇండియాకు ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. 

Published : 05 Apr 2024 00:04 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌ 17 సీజన్‌లో లఖ్‌నవూ పేసర్‌ మయాంక్‌ యాదవ్‌ (Mayank Yadav) అదరగొడుతున్నాడు. బుల్లెట్‌లాంటి బంతులు విసురుతూ ప్రత్యేక ముద్ర వేసుకుంటున్నాడు. వేగంతోపాటు వికెట్లు పడగొడుతున్నాడు. ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ నిలకడగా గంటకు 150 కి.మీ. కంటే ఎక్కువ స్పీడ్‌తో బౌలింగ్‌ చేసి ఆరు వికెట్లు తీశాడు. మయాంక్‌ తొలి రెండు మ్యాచ్‌ల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్న తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 156.7 కి.మీ. వేగంతో బౌలింగ్‌ చేశాడు. ఈ సీజన్‌లో ఫాస్టెస్ట్ బాల్ ఇదే. ఈ 21 ఏళ్ల కుర్రాడు ఐపీఎల్‌లో మున్ముందు ఇదే ప్రదర్శన కొనసాగిస్తే టీమ్‌ఇండియాకు ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మయాంక్‌ యాదవ్‌ తల్లిదండ్రులు కూడా తమ కుమారుడు త్వరలో టీమ్‌ఇండియాకు ఆడతాడని విశ్వాసం వ్యక్తంచేశారు. 

‘‘వందకు వంద శాతం మయాంక్‌ త్వరలో టీమ్‌ఇండియా తరఫున అరంగేట్రం చేస్తాడు.  బాగా ఆడతాడు కూడా. ఈ విషయంలో నాకంటే మయాంక్‌ తండ్రి ఎంతో నమ్మకంగా ఉన్నారు. చాలామంది ఇప్పుడు మయాంక్ పెర్ఫామెన్స్‌ చూసి అతడు భారత్‌కు ఆడితే బాగుంటుందని అంటున్నారు. కానీ, రెండేళ్ల కిందటే మా ఆయన ఈ మాట అన్నారు. ఒకవేళ మయాంక్ గాయపడకపోతే వచ్చే టీ20 ప్రపంచకప్‌ ఆడి ఉండేవాడు అని నా భర్త అంటుంటారు’’ అని మయాంక్ తల్లి మమత యాదవ్‌ పేర్కొన్నారు.

అందుకే నాన్‌ వెజ్‌ మానేశాడు 

మయాంక్ డైట్‌ ప్లాన్‌ గురించి ఆమె వివరించారు. ‘గతంలో మాంసాహారం తినేవాడు. ఇప్పుడు పూర్తి శాఖాహారుడిగా మారిపోయాడు. గత రెండేళ్లుగా వెజ్‌టేరియన్‌ ఫుడ్ మాత్రమే తింటున్నాడు. తన డైట్‌ చార్ట్‌కు అనుగుణంగా ఏది కావాలని కోరితే అది తయారుచేసి ఇస్తాం. మరీ ప్రత్యేకంగా ఏమీ తినడు. పప్పు, రోటీ, అన్నం, పాలు, కూరగాయలు వంటివి తింటాడు. మయాంక్‌ నాన్‌ వెజ్‌ మానేయడానికి రెండు కారణాలు చెప్పాడు. ఒకటి.. తను శ్రీకృష్ణుడిని నమ్మడం మొదలుపెట్టానన్నాడు. రెండు.. మాంసాహారం తన శరీరానికి పడటం లేదని చెప్పాడు’’ అని మయాంక్ తల్లి వివరించారు. 

‘‘మయాంక్‌ భారత్‌ తరఫున అరంగేట్రం చేస్తాడని వంద శాతం నమ్ముతున్నా. అతనికి 12 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే తను క్రికెటర్ అవుతాడని ఫిక్సయ్యా. ఆ లక్ష్యం వెనక నేను ఉన్నాను. 14 ఏళ్ల వయసులో ట్రయల్‌కు వెళ్లినప్పుడు అతను అందరికంటే ముందున్నాడు. మయాంక్‌ ఎప్పుడూ నా సూచనలను ధిక్కరించలేదు. 16 ఏళ్లు వచ్చేసరికి అతను మరింత శక్తిని కలిగిఉండటమే కాక మరింత పరిణితి చెందాడు’’ అని మయాంక్ తండ్రి చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని