Shami: మంచి మనసు చాటుకున్న షమీ.. రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిని కాపాడి..

టీమ్‌ఇండియా సీనియర్ ఆటగాడు షమీ (Shami) చేసిన ఓ పని నెట్టింట అభినందనలు కురిపిస్తోంది. ప్రమాదం బారిన పడిన ఓ వ్యక్తిని అతడు కాపాడాడు.

Published : 26 Nov 2023 10:34 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమ్‌ఇండియా స్టార్‌ పేసర్‌ షమీ.. మంచి మనసు చాటుకున్నాడు. రోడ్డు ప్రమాదానికి గురైన ఓ వ్యక్తిని కాపాడాడు. ఆ ఘటనకు సంబంధించిన వివరాలను సోషల్‌ మీడియాలో షేర్ చేశాడు. శనివారం రాత్రి నైనిటాల్‌ రోడ్డు మార్గంలో ఓ కారు అదుపు తప్పి పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకుపోయింది. ఆ వెనుకే కారులో వస్తున్న షమీతోపాటు వాహనదారులు వెంటనే స్పందించి బాధితుడిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. కారు ప్రమాదానికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షమీ పోస్టు చేశాడు.

‘‘అతడు అదృష్టవంతుడు. దేవుడు అతడికి మళ్లీ జీవితం ఇచ్చాడు. నైనిటాల్‌లో అతడి కారు ఘాట్‌ రోడ్‌ నుంచి పక్కకు దూసుకుపోయింది. నా కారుకు కాస్త ముందుగానే ఈ సంఘటన చోటు చేసుకుంది. వెంటనే అక్కడున్న వారితో కలిసి సురక్షితంగా అతడిని బయటకు తీసుకొచ్చాం. అతడి పరిస్థితి బాగానే ఉంది’’ అని షమీ ఆ వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చాడు. 

ట్రావెలింగ్‌ చేయడం నాకిష్టం: షమీ

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో షమీ మాట్లాడుతూ తనకు ట్రావెలింగ్‌ చేయడం చాలా ఇష్టమని చెప్పాడు. ‘‘ప్రయాణించడం ఇష్టపడతా. అలాగే ఫిషింగ్‌ చేయడం నచ్చుతుంది. దూరప్రాంతాలకు డ్రైవింగ్‌ కూడా ఇష్టమే. కార్లు, బైకులు నడపుతా. కానీ, భారత్‌ తరఫున ఆడే సమయంలో బైక్‌ రైడింగ్‌ను ఆపేశా. అలాంటి సమయంలో గాయపడితే? చాలా ఇబ్బంది ఎదురవుతుంది. హైవేలపైనా, గ్రామాల్లోనూ బైకులపై విపరీతంగా తిరిగేవాడిని. బైకులు, కార్లే కాకుండా ట్రాక్టర్‌, బస్‌, ట్రక్కులను కూడా నడిపేవాడిని. నా స్నేహితుడికి ట్రక్‌ ఉండేది. చిన్న వయసులోనే దానిని ఓ మైదానంలో నడిపేవాళ్లం. ఒకసారి మా ట్రాక్టర్‌తో చెరువులోకి దూసుకెళ్లా. అప్పుడు మా నాన్న చీవాట్లు పెట్టేశారు’’ అని షమీ గుర్తు చేసుకున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని