Gujarat vs Punjab: ఉత్కంఠ పోరు.. గుజరాత్‌పై పంజాబ్‌ విజయం

ఐపీఎల్‌-17లో భాగంగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో పంజాబ్‌ విజయం సాధించింది.

Updated : 04 Apr 2024 23:43 IST

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌ 17 సీజన్‌లో పంజాబ్‌ మళ్లీ విజయాల బాట పట్టింది. గుజరాత్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ఆ జట్టు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 200 పరుగుల భారీ లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పంజాబ్ బ్యాటర్లలో శశాంక్ సింగ్ (61*; 29 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఆశుతోష్ శర్మ (31; 17 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ప్రభ్‌సిమ్రన్‌ సింగ్ (35; 24 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించాడు. బెయిర్‌స్టో (22), జితేశ్‌ శర్మ (16), సికిందర్ రజా (15) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. శిఖర్ ధావన్‌ (1), సామ్‌కరన్‌ (5) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. గుజరాత్‌ బౌలర్లలో నూర్‌ అహ్మద్‌ 2, మోహిత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌, ఒమర్జాయ్‌, రషీద్‌ ఖాన్‌, దర్శన్‌ నల్కండే ఒక్కో వికెట్‌ తీశారు. శశాంక్‌ సింగ్ ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. 

శశాంక్‌, ఆశుతోష్ మెరుపులు  

70 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన పంజాబ్‌ను శశాంక్ ఆదుకున్నాడు. ఉమేశ్‌ యాదవ్ వేసిన 11 ఓవర్‌లో వరుసగా 4,6,4 బాదేసి జోరందుకున్నాడు. సికిందర్, జితేశ్‌ ఔటైనా ఆశుతోష్‌ శర్మతో కలిసి జట్టును విజయం దిశగా నడిపించాడు. చివరి మూడు ఓవర్లలో 48 పరుగులు అవసరమైన దశలో ఒమర్జాయ్‌ వేసిన 18 ఓవర్‌లో ఆశుతోష్‌ మూడు ఫోర్లు బాదేశాడు. మోహిత్ శర్మ వేసిన 19 ఓవర్‌లో శశాంక్‌, ఆశుతోష్‌ చెరో సిక్స్‌ బాదారు. ఈ ఓవర్‌లో మొత్తం 18 పరుగులు రావడంతో పంజాబ్‌ విజయానికి చేరువైంది. చివరి ఓవర్‌ (బౌలర్‌ దర్శన్‌ నల్కండే)లో ఏడు పరుగులు అవసరం కాగా.. తొలి బంతికి ఆశుతోష్‌.. రషీద్‌ ఖాన్‌కు చిక్కాడు. శశాంక్‌ మిగతా పని పూర్తి చేశాడు.

అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. కెప్టెన్, ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌ (89*; 48 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) దంచికొట్టాడు. సాయి సుదర్శన్‌ (33; 19 బంతుల్లో 6 ఫోర్లు) దూకుడుగా ఆడాడు. కేన్ విలియమ్సన్‌ (26; 22 బంతుల్లో 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. రాహుల్ తెవాటియా (23; 8 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) చివర్లో మెరుపులు మెరిపించాడు. వృద్ధిమాన్‌ సాహా (11), విజయ్ శంకర్‌ (8) నిరాశపర్చారు. పంజాబ్‌ బౌలర్లలో కగిసో రబాడ 2, హర్‌ప్రీత్‌ బ్రార్‌, హర్షల్ పటేల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని