Rohit: ఒక్కరిపైనే ఆధారపడం.. హార్దిక్‌ ఫిట్‌గా ఉన్నా విభిన్న కాంబినేషన్లను ప్రయత్నిస్తాం: రోహిత్

వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఏడో మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధమైంది. ముంబయిలోని వాంఖడే మైదానం వేదికగా శ్రీలంకతో టీమ్ఇండియా (IND vs SL) తలపడనుంది.

Updated : 02 Nov 2023 13:27 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వరల్డ్‌కప్‌లో (ODI World Cup 2023) జట్టు కాంబినేషన్లకు సంబంధించి తమ ముందు చాలా ఆప్షన్లు ఉన్నాయని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) వెల్లడించాడు. ఒకవేళ హార్దిక్ పాండ్య (Hardik Pandya) ఫిట్‌నెస్‌ సాధించి వచ్చినా.. విభిన్న కాంబినేషన్లను ప్రయత్నించడం మాత్రం ఆపబోమని తెలిపాడు. ప్రతి ఆటగాడూ సంసిద్ధంగా ఉన్నాడని.. ఎప్పుడు అవకాశం వచ్చినా వారు తమ సత్తా నిరూపించుకొంటారని పేర్కొన్నాడు. ముంబయి వేదికగా శ్రీలంకతో భారత్ (IND vs SL) తలపడనుంది. హార్దిక్‌ పాండ్య లీగ్‌ దశలోని మ్యాచ్‌లకూ దూరంగా ఉంటాడనే వార్తలు వచ్చాయి. దీనిపై రోహిత్ శర్మ స్పందించాడు. ఒకరిపైనే అతిగా ఆధారపడే ప్రసక్తి లేదని వ్యాఖ్యానించాడు.

‘‘క్రికెట్‌లో ప్రతి కాంబినేషన్‌ కీలకమే. ఆచరణ సాధ్యమే. ఇప్పటికీ అవసరమైతే మేం ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో ఆడగలం. ఇప్పటి వరకు ఈ టోర్నీలో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించారు. మిడిల్‌ ఓవర్లలో వికెట్లు తీస్తూ జట్టుకు అండగా నిలిచారు. హార్దిక్‌ వంటి పేస్‌ ఆల్‌రౌండర్‌ అందుబాటులో ఉన్నా..? లేకున్నా..? మా ముందు చాలా ఆప్షన్లు ఉన్నాయి. పరిస్థితులకు అనుగుణంగా ముగ్గురు స్పిన్నర్లతో ఆడిస్తాం. కావాలనుకుంటే ముగ్గురు పేసర్లను బరిలోకి దింపుతాం. అయితే, ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి ఇవ్వడం కూడా ముఖ్యమే. మా పేసర్లందరూ అద్భుతమైన లయ అందుకొన్నారు. విశ్రాంతి అవసరం లేదని వారే భావిస్తున్నారు. ఇప్పటికే బౌలర్ల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్నా. మ్యాచ్‌లను ఆడేందుకు వారు ఉత్సాహంగా ఉన్నారు’’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని