Shami: నా అవసరం ఉందనుకోవాలి.. మార్పును ఎవరైనా అంగీకరించాల్సిందే: షమీ

Eenadu icon
By Sports News Team Published : 09 Oct 2025 11:19 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్ డెస్క్‌: భారత సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ (Shami) కెరీర్‌ ఇప్పుడు డోలాయమానంలో పడింది. ఛాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత ఫిట్‌నెస్‌ సమస్యను ఎదుర్కొన్న అతడు జట్టుకు దూరమయ్యాడు. ఇటీవల దేశవాళీలో ఆడి తన అదృష్టాన్ని పరీక్షించుకొన్నాడు. కానీ, ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక అవుతాడని చాలామంది ఊహించారు. బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాత్రం అవకాశం కల్పించలేదు. దీంతో అతడి కెరీర్‌ దాదాపు ముగిసినట్లేనని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. షమీ మాత్రం రంజీల్లో ఆడి మళ్లీ జాతీయజట్టులోకి వస్తానని దీమా వ్యక్తంచేశాడు. ఎందుకు ఎంపిక కాలేదని తన సమాధానం కోసం చాలామంది ఎదురుచూస్తున్నారని షమీ వ్యాఖ్యానించాడు. 

‘‘నాపై సోషల్ మీడియాలో రూమర్లు, మీమ్స్‌ చాలా వచ్చాయి. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ఎంపిక కాకపోవడంపై నా అభిప్రాయం చెప్పాలని అభిమానులు కోరుకున్నారు. ఈ సందర్భంగా ఒక్క మాట చెబుతున్నా. జట్టుకు ఎంపిక చేయడమనేది నా చేతుల్లో ఉండదు. అది సెలక్షన్ కమిటీ బాధ్యత. కోచ్‌, కెప్టెన్‌కు నా అవసరం ఉందనిపించాలి. వారే నన్ను ఎంపిక చేయాలి. ఇంకాస్త సమయం కావాలని వారు భావిస్తే.. అందుకోసం నేను సన్నద్ధంగానే ఉంటా’’ అని షమీ తెలిపాడు. 

ఫిట్‌నెస్ బాగుంది..

ఆస్ట్రేలియాతో సిరీస్‌లకు జట్టును ప్రకటించేటప్పుడు సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్‌కు ఓ ప్రశ్న ఎదురైంది. షమీ ‘ఫిట్‌నెస్‌’ ఎలా ఉందని ప్రశ్నించగా.. తమకు సరైన సమాచారం లేదంటూ వ్యాఖ్యానించాడు. ఆ వ్యాఖ్యలపై షమీ స్పందిస్తూ ‘‘ నా ఫిట్‌సెస్‌ చాలా బాగుంది. మైదానానికి దూరంగా ఉన్నప్పుడు మనకు మనమే స్ఫూర్తి పొందాలి. నేను దులీప్ ట్రోఫీలో ఆడా. చాలా సౌకర్యంగా అనిపించింది. బౌలింగ్‌ లయ కూడా బాగుంది. దాదాపు 35 ఓవర్లపాటు బౌలింగ్ చేశా. నాకెక్కడా సమస్యగా అనిపించలేదు’’ అని షమీ వెల్లడించాడు.

మనం అంగీకరించాల్సిందే..

‘‘మీరు నన్ను అడిగిన ప్రశ్నకు చాలా మీమ్స్‌ వచ్చాయి. ఇందులో నాకెలాంటి అభ్యంతరం, పొరపాటు కనిపించలేదు. బీసీసీఐ, సెలక్టర్లు, కోచ్‌లు తీసుకున్న నిర్ణయం. శుభ్‌మన్‌ ఇప్పటికే ఇంగ్లాండ్‌ పర్యటనలో కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌ను నడిపిస్తున్నాడు. అతడికి మంచి అనుభవం ఉంది. ఎవరో ఒకరికి బాధ్యతలు అప్పగించాల్సిందే. బీసీసీఐ శుభ్‌మన్‌ గిల్‌కు ఇచ్చింది. మనమంతా దానిని అంగీకరించాల్సిందే. కెప్టెన్సీ విషయంలో అనవసరమైన ప్రశ్నలు వేయక్కర్లేదు. ఇదేమీ మన చేతుల్లో ఉండదు. ఇవాళ ఒకరు ఉంటారు.. రేపు మరొకరు. ఇదంతా సహజంగా జరిగే ప్రక్రియ’’ అని షమీ తెలిపాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని