IND vs SL: వరల్డ్‌కప్‌లో ‘ఆసియా కప్‌ ఫైనల్‌’ రిపీట్‌.. శ్రీలంక కుప్పకూలిందిలా..

వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) భారత్‌ అగ్రస్థానంలో కొనసాగుతూ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. వరుసగా ఏడు విజయాలు నమోదు చేసి అధికారికంగా సెమీస్‌కు చేరుకుంది. తాజాగా శ్రీలంకను 302 పరుగుల తేడాతో చిత్తు చేయడం విశేషం.

Published : 03 Nov 2023 08:12 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) భారత్ అత్యంత భారీ విజయాన్ని నమోదు చేసి సెమీస్‌కు దూసుకెళ్లింది. శ్రీలంకను 302 పరుగుల తేడాతో ఓడించింది. గత ఆసియా కప్‌ ‘ఫైనల్‌’ను భారత్‌ మరోసారి రిపీట్‌ చేసింది. అప్పుడు శ్రీలంకను 50 పరుగులకే ఆలౌట్‌ చేయగా.. ఇప్పుడు 55 పరుగులకు కుప్పకూల్చింది. కేవలం 19.4 ఓవర్లనే లంక పతనం జరిగింది. మరి వికెట్లు ఎలా వచ్చాయంటే?

  • తొలి బంతికే వికెట్: భారత్‌ నిర్దేశించిన 358 పరుగుల లక్ష్య ఛేదనలో బుమ్రా సంధించిన తొలి బంతికే (0.1వ ఓవర్) ఓపెనర్ నిస్సంక గోల్డెన్ డక్‌గా పెవిలియన్‌కు చేరాడు. అవుట్‌ స్వింగర్‌ను అర్థం చేసుకోవడంలో విఫలమైన నిస్సంక.. వికెట్ల ముందు దొరికిపోయాడు. డీఆర్‌ఎస్‌కు వెళ్లినా శ్రీలంకకు సానుకూల ఫలితం రాలేదు. 
  • ఈసారి సిరాజ్‌: బుమ్రా మొదటి బంతికే వికెట్‌ తీయగా.. సిరాజ్‌ కూడా తాను వేసిన ఓవర్‌ తొలి బాల్‌కు (1.1వ ఓవర్) వికెట్ పడగొట్టడం విశేషం. ఇన్‌స్వింగర్‌కు కరుణరత్నె (0) ఎల్బీగా పెవిలియన్‌కు చేరాడు. డీఆర్‌ఎస్‌లోనూ క్లీన్‌గా వికెట్ల ముందు దొరికిపోయాడు. కరుణరత్నె కూడా గోల్డెన్‌ డక్.
  • పక్కా ప్లానింగ్‌: వన్డేల్లో అరుదుగా మూడో స్లిప్‌లో ఫీల్డర్‌ను పెడుతుంటారు. అలాంటిది సిరాజ్‌ బౌలింగ్‌లో (1.5వ ఓవర్‌) సదీరా సమరవిక్రమ (0) సరిగ్గా మూడో స్లిప్ ఫీల్డర్‌కే క్యాచ్‌ ఇచ్చి డకౌటయ్యాడు. అవుట్‌సైడ్ ఆఫ్‌స్టంప్‌ మీదుగా వేసిన బంతిని ఆడబోయి శ్రేయస్‌ అయ్యర్‌ చేతికి చిక్కాడు.
  • కుశాల్‌ క్లీన్ బౌల్డ్‌: తొలి ముగ్గురు బ్యాటర్లు డకౌట్‌ కావడంతో లంక కెప్టెన్ కుశాల్ మెండిస్ (1)పైనా ఒత్తిడి తప్పలేదు. సిరాజ్‌ (3.1వ ఓవర్) ఏమాత్రం అతడికి అవకాశం ఇవ్వలేదు. అద్భుతమైన ఆఫ్‌స్టంప్‌ డెలివరీని ఆడే క్రమంలో మెండిస్‌ క్లీన్‌బౌల్డయ్యాడు. 
  • షమీ రాకతో: శ్రీలంక బ్యాటర్ అసలంక 24 బంతులు ఆడి ఒక్క పరుగు మాత్రమే చేశాడంటే భారత బౌలింగ్‌ ఎంత కఠినంగా ఉందో అర్థమవుతుంది. అయితే, షమీ బౌలింగ్‌కు (9.3వ ఓవర్‌) వచ్చిన తన తొలి ఓవర్‌లోనే అసలంకను ఔట్‌ చేశాడు. ఆఫ్‌సైడ్‌ వేసిన బంతిని ఆడబోయి అతడు బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌లోని రవీంద్ర జడేజా చేతికి చిక్కాడు.
  • వెంటనే మరో వికెట్: షమీ అద్భుతమైన ఫామ్‌కు ఇదొక నిదర్శనం. అసలంక స్థానంలో క్రీజ్‌లోకి వచ్చిన హేమంతను (0) లైన్‌ అండ్‌ లెంగ్త్‌ బంతితో ఔట్ చేశాడు. బ్యాట్‌కు ఎడ్జ్‌ తీసుకోవడంతో నేరుగా వికెట్ కీపర్‌ కేఎల్‌ రాహుల్‌ చేతుల్లోకి బంతి (9.4వ ఓవర్) వెళ్లిపోయింది. 
  • చమీరాను షమీ: రెండు ఓవర్లపాటు వికెట్ ఇవ్వకుండా శ్రీలంక బ్యాటర్లు ఆడారు. కానీ షమీ వేసిన లెగ్‌సైడ్‌ బంతిని (11.3వ ఓవర్) ఆడే క్రమంలో గ్లౌవ్స్‌కు తాకి చమీర (0) కీపర్‌ రాహుల్‌కు దొరికిపోయాడు. అంపైర్‌ వైడ్‌గా ప్రకటించినప్పటికీ.. కేఎల్ రాహుల్‌ ఆత్మవిశ్వాసంతో రివ్యూ తీసుకోమని కెప్టెన్‌కు చెప్పడం విశేషం. సమీక్షలో బంతి గ్లౌవ్‌ను తాకినట్లు తేలింది. 
  • మ్యాథ్యూస్‌ క్లీన్‌బౌల్డ్‌: శ్రీలంక సీనియర్‌ ఆటగాడు మ్యాథ్యూస్‌ (12) కాసేపు పోరాడే ప్రయత్నం చేశాడు. కానీ.. షమీ వేసిన (13.1వ ఓవర్) ఇన్‌స్వింగర్‌కు మ్యాథ్యూస్‌ వద్ద సమాధానం లేదు. క్లీన్‌బౌల్డ్‌గా పెవిలియన్‌కు చేరక తప్పలేదు. బంతి మిడిల్, లెగ్‌ వికెట్లను గిరాటేయడంలో షమీ కచ్చితత్వం అద్భుతం.
  • షమీకి ఐదు: ఈ వరల్డ్‌ కప్‌లో షమీ ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం ఇది రెండోసారి. కసున్ రజిత (14) షమీ వేసిన అవుట్‌సైడ్‌ ఆఫ్‌ బంతిని (17.6వ ఓవర్) డ్రైవ్‌ చేయబోయి రెండో స్లిప్‌లోని గిల్‌ చేతికి చిక్కాడు. దీంతో ఐదో వికెట్‌ షమీ ఖాతాలో పడింది.
  • చివరిది జడ్డూకే: పేసర్లు 9 వికెట్లు తీయగా.. ఆఖరి వికెట్‌ను స్పిన్నర్‌ రవీంద్ర జడేజా పడగొట్టాడు. జడ్డూ వేసిన (19.4వ ఓవర్) బంతిని భారీషాట్ కొట్టే ప్రయత్నంలో మదుషంక (5) శ్రేయస్‌ అయ్యర్ పట్టిన అద్భుత క్యాచ్‌తో పెవిలియన్‌ బాట పట్టాడు. దీంతో భారత్‌ సంబరాలు చేసుకుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని