Team India: గ్యాప్‌ లేకుండా సిరీస్‌ల మీద సిరీస్‌లు.. బీసీసీఐ ఎందుకిలా చేస్తోంది?

Eenadu icon
By Sports News Team Updated : 28 Oct 2025 11:25 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా (Team India) క్షణం తీరిక లేకుండా వరుస మ్యాచ్‌లతో బిజీ బిజీగా మారిపోయింది. ఒక సిరీస్‌కు, మరో సిరీస్‌కు మధ్య కనీసం వారం రోజుల విరామం కూడా ఉండట్లేదు. ఆసియా కప్‌ ఫైనల్‌ ముగిసిన నాలుగు రోజులకే వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో తలపడిన భారత జట్టు.. ఇప్పుడు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. వన్డే సిరీస్‌ పూర్తయిన మూడు రోజులకే టీ20 సిరీస్‌ మొదలవుతోంది. వన్డేల్లో ఆడిన ఏడుగురు ఆటగాళ్లు.. టీ20 సిరీస్‌లో ఉన్నారు. అది ఎంత వైట్‌ బాల్‌ క్రికెట్‌ అయినా ఈ గ్యాప్‌ సరిపోతుందా? అనేదే ఇప్పుడు చర్చ. ఈ క్రమంలో బీసీసీఐ ప్లానింగ్‌, వర్క్‌లోడ్‌ మేనేజ్‌మెంట్‌ ఏంటి అనేది అర్థం కావడం లేదు.

విండీస్‌తో టెస్టు సిరీస్‌లో ఆడిన 11 మంది ఆటగాళ్లు ఆసీస్‌తో వన్డే మ్యాచ్‌ల కోసం బయలుదేరారు. ఇక మూడు ఫార్మాట్‌లలో రెగ్యులర్‌గా ఆడే కొంతమంది ప్లేయర్లు నెలలతరబడి ఇంటి ముఖం చూడట్లేదు. ఇలా తీరిక లేకుండా మ్యాచ్‌లు ఆడితే ఆటగాళ్లపై పనిభారం పెరిగిపోతుంది. త్వరగా అలసిపోతారు. గాయాల బారినపడే అవకాశమూ లేకపోలేదు. శుభ్‌మన్ గిల్, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్ ఆసియా కప్‌లో 20 రోజుల వ్యవధిలో  ఏడు మ్యాచ్‌లు ఆడారు. ఆ టోర్నీ ఇలా ముగిసిందో, లేదో వెంటనే కరేబియన్ టీమ్‌తో జరిగిన తొలి టెస్టులో గిల్, కుల్‌దీప్ బరిలోకి దిగారు.

విండీస్‌తో సిరీస్ ముగిసిన వెంటనే వీరు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు. అక్కడి వాతావరణానికి అలవాటు పడేలోపే ప్రాక్టీస్ మ్యాచ్‌లు కూడా లేకుండానే వన్డే సిరీస్‌ మొదలైంది. ఇప్పుడు మూడు రోజులు గ్యాప్‌ ఇచ్చి ఐదు టీ20ల సిరీస్‌ మొదలుపెడుతున్నారు. వన్డేల్లో ఆడిన శుభ్‌మన్‌ గిల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, హర్షిత్‌ రాణా, కుల్‌దీప్‌ యాదవ్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌ టీ20 మోడ్‌ ఆన్‌ చేసి ఇటొచ్చేస్తున్నారు. ఇలా తీరిక లేని షెడ్యూల్‌ వల్ల ఆటగాళ్లకు సరైన విశ్రాంతి దొరకడం కష్టమవుతోంది. ఇది వ్యక్తిగత ప్రదర్శనతోపాటు జట్టు ఫలితాలపై ప్రభావం చూపే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పనిభారం నిర్వహణ కొందరికేనా?

కొంతమంది ఆటగాళ్ల విషయంలో మాత్రం వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌ సరిగ్గా అమలవుతోంది. ఆసియా కప్‌లో బుమ్రాకు రెండు మ్యాచ్‌ల్లో విశ్రాంతి ఇచ్చారు. ఈ పేసర్‌ను పనిభారం నిర్వహణ దృష్ట్యా ఆసీస్‌ వన్డే సిరీస్‌కు ఎంపిక చేయలేదు. సిరాజ్‌కు ఆసియా కప్ నుంచి రెస్ట్ ఇచ్చారు. ఆసీస్‌తో ఐదు టీ20లకు ఎంపికైన సూర్యకుమార్, అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబె వంటి ప్లేయర్లకు నెల రోజులు విశ్రాంతి దొరికింది. మూడు ఫార్మాట్లలో రెగ్యులర్‌గా ఆడుతున్న ఆటగాళ్లలో కొంతమంది ప్లేయర్ల విషయంలో టీమ్‌ మేనేజ్‌మెంట్ రిస్క్ చేస్తోందనే చర్చ నడుస్తోంది. వర్క్‌లోడ్ గురించి పట్టించుకోకుండా వరుసగా మ్యాచ్‌లు ఆడుతున్న ప్లేయర్లపై మేనేజ్‌మెంట్‌ వెంటనే ఈ పరిస్థితిపై ఫోకస్ పెట్టి ప్రత్యామ్నాయ ఆటగాళ్లను సిద్ధం చేసుకోవాల్సిన అవసరముందనే వాదనలు వినిపిస్తున్నాయి. అన్నట్లు గిల్‌ను వరుస సిరీస్‌లు గ్యాప్‌ ఇవ్వకుండా ఆడిస్తున్నారు ఇబ్బంది అవ్వదా అని ఆ మధ్య చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ను అడిగితే.. ‘కుర్రాడు కదా ఫర్వాలేదు’ అన్నారు. అంటే కుర్రాళ్లతో రిస్క్‌ చేస్తున్నారనేగా?

రెస్ట్ లేకపోవడమే కారణమా?

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను భారత్ 1-2తో చేజార్చుకుంది. ఈ సిరీస్‌లో గిల్, కేఎల్ రాహుల్ లాంటి కీలక ఆటగాళ్లు ఆశించిన మేర ప్రదర్శన చేయలేదు. విండీస్‌తో టెస్టు మ్యాచ్‌లు ముగియగానే సరైన విశ్రాంతి లేకుండా ఆస్ట్రేలియాకు బయలుదేరడం, అక్కడి వాతావరణ పరిస్థితులకు అలవాటు పడేలోపే వన్డే సిరీస్ మొదలైంది. అప్పటివరకు భారత పిచ్‌లకు అలవాటు పడిన బ్యాటర్లు, బౌలర్లు.. ఉన్నట్టుండి మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండానే బౌన్సీ పిచ్‌లపై ఆడారు. ఇది కూడా టీమ్ఇండియా ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రభావం చూపిందనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి రెస్ట్ లేకుండా మ్యాచ్‌లు ఆడిస్తే ప్రదర్శన పడిపోతుందని తెలిసినా మేనేజ్‌మెంట్ ఎందుకు రిస్క్‌ చేస్తుందో అర్థం కావడం లేదు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్ ఉండటంతో ఇప్పటి నుంచే కీలక ఆటగాళ్ల విషయంలో మేనేజ్‌మెంట్ జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరముంది.

Tags :
Published : 28 Oct 2025 10:44 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు