పంట ఉత్పత్తుల రవాణాపై నిఘా

రాష్ట్రంలో పంటల రవాణా, క్రయవిక్రయాలపై మార్కెటింగ్‌శాఖ మళ్లీ తనిఖీలు పెంచింది. గతేడాది తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దుచేస్తామని ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో గతంలో ఉన్న నిబంధలను

Published : 06 Dec 2021 05:22 IST

నూతన వ్యవసాయ చట్టాల రద్దు ప్రకటనతో తనిఖీలు పెంచిన మార్కెటింగ్‌శాఖ

పాత పద్ధతిలోనే 1% రుసుం వసూలుకు ప్రణాళిక

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పంటల రవాణా, క్రయవిక్రయాలపై మార్కెటింగ్‌శాఖ మళ్లీ తనిఖీలు పెంచింది. గతేడాది తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దుచేస్తామని ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో గతంలో ఉన్న నిబంధలను అమలుచేయాలని నిర్ణయించిన ఆ శాఖ అందుకు ఏర్పాట్లు ముమ్మరంచేసింది. చట్టాల రద్దు ప్రకటనతో పాత మార్కెటింగ్‌ చట్టమే అమల్లోకి వచ్చినట్లయిందని, ఇకపై ఆ ప్రకారం మార్కెట్‌ రుసుం చెల్లించాల్సిందేనని వ్యాపారులకు వ్యవసాయ మార్కెట్లు సూచిస్తున్నాయి.

పంటల వివరాలు ఇవ్వాల్సిందే

రాష్ట్ర పాత మార్కెటింగ్‌ చట్టం ప్రకారం రైతుల నుంచి పంట ఉత్పత్తులు కొనుగోలు చేసే వ్యాపారి, దాని విలువలో ఒక శాతం సొమ్మును మార్కెట్‌ రుసుం కింద సమీపంలోని వ్యవసాయ మార్కెట్‌కు చెల్లించాలి. ఈ రుసుం వసూలుచేసే ప్రక్రియను అధికారులు ఆరంభించారు. అన్ని రహదారులపై చెక్‌పోస్టులు ఏర్పాటుచేస్తున్నారు. వ్యవసాయ మార్కెట్ల ఆవరణలతోపాటు.. పొలాల్లో గాని, రైతుల ఇళ్ల వద్ద గాని పంటలు కొనేపక్షంలో ఆ వివరాలన్నీ పక్కాగా అందజేయాలని వ్యాపారులకు తాజాగా ఆదేశాలిచ్చారు. ‘దీనివల్ల ఏ ప్రాంతం నుంచి, ఏ పంట ఉత్పత్తి, ఎంతమేరకు ఇతర ప్రాంతాలకు తరలిపోయింది, దానిపై మార్కెట్‌ రుసుం వసూలైందా? లేదా? అనే లెక్కలు పక్కాగా తేలుతాయి. కొందరు వ్యాపారులు చెక్‌పోస్టుల్లో సిబ్బందికి లంచాలు ఇచ్చి రుసుం ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నట్టు గుర్తించాం. అక్రమాలను అడ్డుకోవడానికి విజిలెన్స్‌ విభాగం సిబ్బందితో ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నాం. రుసుం చెల్లించలేదని తేలితే సంబంధిత చెక్‌పోస్టు సిబ్బందిపైనా చర్యలు తీసుకుంటాం. ఇకపై ప్రతి వ్యాపారి పంటల కొనుగోలు వివరాలు, అందుకోసం చెల్లించిన మార్కెట్‌ రుసుం తాలూకూ బిల్లులు ఇవ్వాల్సిందే’ అని ఈ శాఖ సంచాలకురాలు లక్ష్మీబాయి స్పష్టంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని