చేటు చేస్తున్న సిమ్‌లపై వేటు

సిమ్‌కార్డు ఉంటేచాలు... సరిహద్దులతో సంబంధం లేకుండా మోసానికి పాల్పడొచ్చు, ఖాతాలు కొల్లగొట్టొచ్చు.

Updated : 10 Apr 2024 07:14 IST

రోజుకు 110 కార్డుల రద్దు
సైబర్‌ సెక్యూరిటీ విభాగం కఠిన చర్యలు

ఈనాడు, హైదరాబాద్‌: సిమ్‌కార్డు ఉంటేచాలు... సరిహద్దులతో సంబంధం లేకుండా మోసానికి పాల్పడొచ్చు, ఖాతాలు కొల్లగొట్టొచ్చు. దగాకోరులు ఉపయోగించే ఈ సిమ్‌లను పసిగట్టి... నిలువరించగలిగితే మోసగాళ్ల ఆట కట్టించవచ్చని భావిస్తున్న పోలీసులు ఈ దిశగా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా రాష్ట్రంలో సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు చేసినప్పటి నుంచి దీనిపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ (ఎన్‌.సి.సి.ఆర్‌.పి)కు వస్తున్న సమాచారం ఆధారంగా సిమ్‌లను గుర్తించి వాటిని రద్దు చేయిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సగటున రోజుకు 110 సిమ్‌ కార్డులను రద్దు చేయిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మోసాలకు కారణమవుతున్న ఫోన్లను కూడా బ్లాక్‌ చేయిస్తున్నారు.

సైబర్‌నేరాలు నానాటికీ పెరుగుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో ముందున్న తెలంగాణలో ఈ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఒక్క హైదరాబాద్‌లోనే సైబర్‌ నేరగాళ్లు రోజుకు రూ.5 కోట్లు కొట్టేస్తున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అంటే ఏటా దాదాపు రూ.1800 కోట్లు లూటీ అవుతున్నాయన్నమాట. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టినా నేరగాళ్లను గుర్తించడం కష్టమవుతోంది. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారిని అరెస్టు చేసి, ఇక్కడకు తీసుకొని రావడం సాధ్యంకావడం లేదు. అందుకే సైబర్‌నేరాలు అదుపు కావడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయిలో ఎన్‌సీసీఆర్‌పీని ఏర్పాటుచేసి ..1930 నంబర్‌ సౌకర్యం కల్పించింది. ఈ నంబర్‌కు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుమేరకు మోసానికి కారణమైన సిమ్‌కార్డు ఏ చిరునామాతో కొనుగోలు చేశారో గుర్తిస్తారు. సంబంధిత రాష్ట్ర పోలీసులకు సమాచారం ఇస్తారు. వారు సర్వీస్‌ ప్రొవైడర్‌కు లేఖ రాసి, దాన్ని బ్లాక్‌ చేయిస్తారు. గతంలో ఇలాంటి సమాచారం వచ్చినా రకరకాల కారణాలతో పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు చేసిన తర్వాత తక్షణమే స్పందిస్తున్నారు. గత ఏడాది జూన్‌ 1 నుంచి సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో పనిచేస్తుండగా అప్పటి నుంచి మార్చి 31 వరకూ అంటే పది నెలల కాలంలో తెలంగాణ చిరునామాతో ఉన్న 33,029 సిమ్‌కార్డులు, ఐఎంఈఐ నంబర్‌ ఆధారంగా 3,769 మొబైల్‌ ఫోన్లు బ్లాక్‌ చేయించారు. అంటే సగటున రోజుకు 110 సిమ్‌కార్డులు, 12 ఫోన్లు బ్లాక్‌ చేయిస్తున్నారన్నమాట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని