సంక్షిప్త వార్తలు

తెలంగాణ నుంచి పసుపు, మిర్చి, పండ్లు ఇతర ఉద్యాన పంట ఉత్పత్తుల ఎగుమతిని ప్రోత్సహిస్తామని రాష్ట్ర ఉద్యాన సంచాలకుడు కె.అశోక్‌రెడ్డి తెలిపారు.

Published : 17 May 2024 02:38 IST

ఉద్యాన పంటల ఎగుమతులకు ప్రోత్సాహం
సంచాలకుడు అశోక్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ నుంచి పసుపు, మిర్చి, పండ్లు ఇతర ఉద్యాన పంట ఉత్పత్తుల ఎగుమతిని ప్రోత్సహిస్తామని రాష్ట్ర ఉద్యాన సంచాలకుడు కె.అశోక్‌రెడ్డి తెలిపారు. దీనికోసం ప్రత్యేకంగా నోడల్‌ ఏజెన్సీని ఏర్పాటు చేస్తామన్నారు. గురువారం హైదరాబాద్‌లో సుగంధ ద్రవ్యాల బోర్డు, డీజీఎఫ్‌టీ, ఎంపీపీ, ఓఎఫ్‌ఎస్‌సీ, ఐజీఎంఆర్‌ తదితర సంస్థల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాష్ట్రంలో 12లక్షల ఎకరాలలో ఉద్యానపంటలు సాగులో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో మల్బరీసాగును మరింత విస్తరిస్తామని తెలిపారు.


రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలి: అన్వేష్‌రెడ్డి

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: విత్తనాలు అమ్మే కంపెనీలు, డీలర్లు రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో కోరారు. కల్తీ విత్తనాలు అమ్మే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. కంపెనీలు నకిలీ విత్తనాల కారణంగా నష్టపోయిన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. విత్తన కంపెనీలు విత్తనోత్పత్తి కోసం పంట సాగు చేసే విధానంలో లోపాలను సరిదిద్దుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఎఫ్‌1 విత్తనాలు అవసరం ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాలకు అమ్మి, రాష్ట్ర రైతులకు మాత్రం ఎఫ్‌2 రకం విత్తనాలు అమ్ముతున్నారని అన్వేష్‌రెడ్డి విమర్శించారు.


4 రోజుల్లో 4.3 లక్షల మంది ప్రయాణం
దక్షిణ మధ్య రైల్వే వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: పార్లమెంటు ఎన్నికలు, వేసవి సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని మే 9-12 వరకు హైదరాబాద్‌ నుంచి బయల్దేరే రైళ్లలో అదనపు బోగీలు ఏర్పాటు చేయడంతో 4.3 లక్షల మంది ప్రయాణాలు చేశారని ద.మ.రైల్వే గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. సగటున రోజుకు 1.05 లక్షల మంది ప్రయాణించారని పేర్కొంది. రెండు తెలుగురాష్ట్రాల మధ్య మే 9-15 వరకు 60కి పైగా ప్రత్యేక రైళ్లను నడిపినట్లు వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని