విద్యుత్తు ఒప్పందాలపై ఫిర్యాదు చేయండి

యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్తు ఒప్పందాలకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ కోసం జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి కమిషన్‌ బహిరంగ ప్రకటన జారీ చేసింది.

Published : 17 May 2024 02:58 IST

జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ ప్రకటన

ఈనాడు, హైదరాబాద్‌: యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్తు ఒప్పందాలకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ కోసం జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి కమిషన్‌ బహిరంగ ప్రకటన జారీ చేసింది. ఆ నిర్ణయాలకు సంబంధించిన వాస్తవాలు, ఇతర విషయాలపై నిపుణులు, ప్రజలు తమకు తెలిసిన సమాచారాన్ని, ఫిర్యాదులను పది రోజుల్లోగా కమిషన్‌కు అందజేయాలని కోరింది. మౌఖిక సాక్ష్యాలు ఇవ్వదలచుకున్న వారు కూడా స్పందించాలని సూచించింది. గత ప్రభుత్వం 2014లో బహిరంగ బిడ్డింగ్‌ పోటీని అనుసరించకుండా నామినేషన్‌ పద్ధతిన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర డిస్కమ్‌ నుంచి విద్యుత్తును సేకరించిందన్న ఆరోపణలు వచ్చాయి. సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీ కాకుండా సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో భద్రాద్రి విద్యుత్తు కేంద్రాన్ని నిర్మించిందని, రెండేళ్ల వ్యవధిలో పూర్తిచేయాల్సిన ప్రాజెక్టును ఏడేళ్ల కాలానికి పొడిగించిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బిడ్డింగ్‌ నిర్వహించకుండా నామినేషన్‌ ప్రాతిపదికన ప్రాజెక్టు అప్పగించడంలో నిబంధనల ఉల్లంఘనలపై కమిషన్‌ విచారణ చేస్తుంది. ఆయా అంశాలపై నిపుణులు, అవగాహన కలిగిన వ్యక్తులు తమ సూచనలు, వివరాలు, ఫిర్యాదులను కమిషన్‌ కార్యాలయానికి నేరుగా కానీ, పోస్టు(కమిషన్‌ కార్యాలయం, ఏడో అంతస్తు, బీఆర్‌కే భవన్‌, హైదరాబాద్‌) ద్వారా కానీ, ఈ-మెయిల్‌ ద్వారా (coi2024.power@gmail.com) గానీ పంపించొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని