Published : 17 Aug 2022 00:19 IST

ఆంగ్లం మోజులో భావదాస్యం

అన్నింటా తెల్లవాడి ముద్ర!

స్వాతంత్య్ర అమృత మహోత్సవం ఘనమైన సంబరాలకే కాదు, ఆత్మవిమర్శకూ సరైన సమయం. ఈ సందర్భంలో 75 ఏళ్ల స్వతంత్ర భారత ప్రస్థానాన్ని అవలోకించుకోవడంతో పాటు, ఆంగ్లేయుల నుంచి నిజంగానే మనం స్వతంత్రులమయ్యామా అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. నిజానికి 75 ఏళ్ల క్రితం తెల్లవారు దేశాన్ని విడిచి వెళ్ళిపోయినా, వారి పద్ధతుల్నే మనమింకా గుడ్డిగా అనుసరిస్తున్నాం. చదువుల నుంచి శిక్షల దాకా, కార్యాలయాల్లో ఫైళ్లు నడిపే తీరు నుంచి సైన్యంలో కవాతు దాకా, నిత్య జీవితంలోనూ అడుగడుగునా వలస పాలనలోని వాసనలే ఇంకా రాజ్యమేలుతున్నాయి. మనకు రాజకీయ స్వాతంత్య్రం వచ్చింది కానీ, పాలనలో ఇంకా స్వేచ్ఛ లభించలేదు.

మంచిని మరుగుపరచి...

‘పుట్టుక ఒక్కటే భారతీయం కావాలి. వారి ఆలోచనలు, పద్ధతులన్నీ మనవే కావాలి. అందుకు సరైన మందు ఆంగ్లవిద్య’ అంటూ 1834లో మెకాలే కన్న కలను భారతావని నేడు వేగంగా నిజం చేస్తోంది. ఆంగ్లం మోజులో పడి కన్నతల్లి లాంటి మాతృభాషలకు భారతీయ ప్రజలు నానాటికీ దూరమవుతున్నారు. దేశీయంగా 19 వేలకు పైగా అమ్మభాషలు భారతావనిలో ఉన్నాయి. క్రమంగా అవి ప్రజల వాడుక నుంచి కనుమరుగవుతున్నాయి. జపాన్‌, జర్మనీ, చైనా లాంటివి మాతృభాషల్లోనే ఉన్నత విద్యను సైతం అందిస్తున్నాయి. ఇండియాలో అక్షరాభ్యాసం నుంచే ఆంగ్లం మోజులో పడిపోతున్నాం. ఆంగ్ల మాధ్యమంలో చదవడం, ఇంగ్లిషులో మాట్లాడటమే గొప్ప అనే భావనలో మునిగి తేలుతున్నాం. నిజానికి ఆంగ్ల మాధ్యమాన్ని సమర్థిస్తున్న వారిలో అత్యధికులు మాతృభాషల్లోనే చదివి మేధావులైనవారేనన్న విషయం మరవకూడదు. మాతృభాష అన్నప్పుడల్లా ‘మీ పిల్లలు ఆంగ్లంలో చదువుకోవాలి... మా వాళ్లు మాతృభాషలో విద్యను అభ్యసించాలా?’ అనే ప్రశ్న పదేపదే తలెత్తుతుంటుంది. అది ఉద్వేగాలను రేకెత్తించి సమస్యను పక్కదారి పట్టిస్తుందే తప్ప పరిష్కారం చూపదని అందరికీ తెలుసు. అన్నింటా శాస్త్రీయతల గురించి ప్రశ్నించేవారు మాతృభాష దగ్గరకు వచ్చేసరికి చెవులు మూసుకుంటున్నారు. మాతృభాషలో బోధనే మేలన్న శాస్త్రీయ పరిశోధనల సత్యాన్ని అంగీకరించడానికి మన బానిస మనస్తత్వం అంగీకరించడం లేదు! ప్రాపంచిక పరిస్థితుల దృష్ట్యా ఎవరూ ఆంగ్లాన్ని వ్యతిరేకించడం లేదు. అలాగని దాని కోసం అమ్మఒడిని వదిలేయాల్సిన అవసరం లేదు. మాతృభాషల్లో చదువుతూనే ఆంగ్లం నేర్చుకునేలా చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఆ విషయంలో అలక్ష్యం వహిస్తున్నాం. మరోవైపు ఇంజినీరింగ్‌, వైద్య విద్యలను మాతృభాషలో బోధిస్తామంటున్న ప్రభుత్వాలు... ప్రాథమిక స్థాయి బడుల్లో మాతృభాషలో బోధనకు మాత్రం చొరవ తీసుకోకపోవడం విడ్డూరంగా అనిపిస్తుంది.

ఆంగ్లేయులు కేవలం ఆర్థికంగానే మనల్ని కొల్లగొట్టలేదు. సాంస్కృతికంగా, సామాజికంగానూ మనల్ని, మన మెదళ్లను ఆక్రమించారు. 200 ఏళ్ల బ్రిటిష్‌ పాలనలో అనేకమంది విదేశీ చరిత్రకారులు, సామాజిక శాస్త్రవేత్తలు ఆంగ్లేయ ఆధిపత్యాన్ని అన్ని కోణాల్లోనూ మనపై రుద్దడానికి ప్రయత్నించారు. ఏ దశలోనూ భారతీయుల గొప్పదనాన్ని అంగీకరించకుండా మన పద్ధతులు, అలవాట్లు, ఆచారాలు, చదువులు... అన్నింటినీ ఎద్దేవా చేశారు. భారత్‌కు ఆధునికత తెలియదన్నారు. మేం వచ్చాకే పాలన అంటే ఏమిటో చెప్పాం, చదువు అంటే ఏమిటో తెలిపాం, అభివృద్ధి అంటే అర్థం చేయించాం, ఆధునికతను నేర్పించాం అన్నారు. నిజంగా ఆంగ్లేయులు రాకముందు భారతీయులకు బట్టకట్టడం తెలియదా, తిండితినడం తెలియదా?

తెల్లవారి హయాములో భారత్‌లో పర్యటించి వెళ్లిన ప్రఖ్యాత అమెరికా రచయిత మార్క్‌ ట్వెయిన్‌ ఇలా రాశారు... ‘ఇది స్వప్నాల సామ్రాజ్యం. ప్రేమకు నెలవు.అద్భుతమైన సంపద... అత్యంత పేదరికం... వందల దేశాల సమాహారం... లక్షల గొంతుల సమ్మేళనం...ఎన్నో మతాలు, కోట్ల దేవుళ్లు! ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్రదేశం... అదే భారత దేశం!’ అంటూ కీర్తించారు. ప్రపంచంలోని అన్ని సమాజాల్లాగే భారత్‌లోనూ కొన్ని అవలక్షణాలు లేకపోలేదు. కానీ, ఆంగ్లేయులు మన సమాజంలోని మంచిని, ఘనతను మరుగున పడేసి, కేవలం అవలక్షణాలను మాత్రమే ప్రధానంగా ప్రచారం చేశారు. వాటినే పదేపదే ప్రస్తావిస్తూ మనలో ఆత్మన్యూనతను పెంచారు. మనలో మనకు గొడవలు పెట్టారు. చరిత్రను వారికనుగుణంగా చిత్రీకరించారు.

వదిలించుకోవాల్సిన తరుణం

ప్రస్తుతం పాలనలో, చదువుల్లో, పద్ధతుల్లో, సంప్రదాయాల్లో అన్నింటా ఆంగ్లేయ పద్ధతులే కొనసాగుతున్నాయి. విశ్వవిద్యాలయాల్లో స్నాతకోత్సవ వేళ ధరించే దుస్తులు, పెట్టుకొనే టోపీలు, రిపబ్లిక్‌ డే పరేడ్‌ లాంటి వాటిలో వాయించే సంగీత వాద్యాలు... ఇలా అన్నింటిపైనా వలస పాలన ముద్రలే ఇంకా రాజ్యమేలుతున్నాయి! ఒక్క చదువులే కాకుండా ఇవాల్టికీ మెకాలే రాసిన నేరస్మృతినే అనుసరిస్తున్నాం. ప్రభుత్వాన్ని, ప్రజలను వేరు చేసి, జనాలను భయపెట్టే వలస పాలన నాటి పోలీసు వ్యవస్థనే కొనసాగిస్తున్నాం. రాజకీయ బానిసత్వం తొలగినా మానసిక దాస్యం భారతీయులను ఇంకా వదిలిపెట్టడంలేదు. అందుకే ఈ అమృతోత్సవాల వేళ మన మానసిక స్వాతంత్య్రం గురించి పాలకులు, ప్రజలు ఆలోచించాలి. ఆగస్టు 15న జెండా ఆవిష్కరణ వేళ ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్రమోదీ వచ్చే 25 ఏళ్లకు సాధించాల్సిన లక్ష్యాలను జాతి ముందుంచారు. వాటిలో ప్రధానమైంది వలస పాలన వాసనలకు దూరమవడం. రాజకీయాలకు అతీతంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘వజ్ర సంకల్పం’తో ముందుకు కదిలితేనే అది సాధ్యమవుతుంది!


స్వేచ్ఛ లేదా?

తెల్లవారు 1947లో అధికారాన్ని వదిలి వెళ్లిపోయినా... చరిత్ర, సామాజిక రంగాల్లో వారి ముద్ర అలాగే కొనసాగడం మన మానసిక దౌర్భాగ్యం! వారి సిద్ధాంతాల రొంపిలో మనం ఇంకా కొట్టుమిట్టాడుతున్నాం. మేధావర్గం సైతం వారి మాయలో పడింది. దాన్నుంచి బయటపడి మన ఘనమైన చరిత్రను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. న్యూటన్‌ ఖ్యాతి గుర్తెరిగిన భారతీయులు, ఆరో శతాబ్దానికి చెందిన బ్రహ్మగుప్తుడి గొప్పతనాన్నీ తెలుసుకోవాలి. పుష్పక విమానమే మొదటి ఎగిరే వాహనం వంటి పసలేని వాదనలు వదిలి పురాతన విజ్ఞానాన్ని మనం తవ్వితీయాలి. ఖగోళ, వైద్య, లోహ శాస్త్రాల్లో సనాతన భారతీయుల పాత్రే లేదా? మన నిర్మాణ కౌశలం సంగతేమిటి? వాటిని గమనంలోకి తీసుకోవడానికి మనకు అడ్డుపడుతున్నదేమిటి? వేద గణితాన్ని గుర్తించడానికి మనకెందుకంత విముఖత? విక్టోరియా రాణి, నెపోలియన్‌, అలెగ్జాండర్‌లతో పాటు శాతవాహనులు, పల్లవులు, గుప్తులు వంటి సామ్రాజ్యాల గురించి మనలో ఎంతమందికి తెలుసు?

- రేగళ్ళ సంతోష్‌కుమార్‌

Read latest Vyakyanam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts