అంతర్జాలంపైనా అసమంజస నియంత్రణ

దేశీయంగా అల్లర్లు, ఘర్షణలు తలెత్తినప్పుడు ప్రభుత్వం అంతర్జాల సేవలను నిలిపివేస్తుంది. ఒక్కోసారి కొన్ని రోజుల పాటు ఇది కొనసాగుతుంది. ఇలా అంతర్జాలాన్ని నియంత్రించడం సబబేనా? చట్టాలు, కోర్టులు దీని గురించి ఏమి చెబుతున్నాయి? ఇతర దేశాలలో పరిస్థితులు ఎలా ఉన్నాయి?

Published : 20 Apr 2024 00:52 IST

దేశీయంగా అల్లర్లు, ఘర్షణలు తలెత్తినప్పుడు ప్రభుత్వం అంతర్జాల సేవలను నిలిపివేస్తుంది. ఒక్కోసారి కొన్ని రోజుల పాటు ఇది కొనసాగుతుంది. ఇలా అంతర్జాలాన్ని నియంత్రించడం సబబేనా? చట్టాలు, కోర్టులు దీని గురించి ఏమి చెబుతున్నాయి? ఇతర దేశాలలో పరిస్థితులు ఎలా ఉన్నాయి?

భారతదేశ జనాభాలో 72 కోట్ల మందికి పైగా అంతర్జాలాన్ని వినియోగిస్తున్నారు. ఇండియా అంతర్జాల, మొబైల్‌ కూటమి (ఐఏఎంఏఐ) అంచనా ప్రకారం ఈ సంఖ్య 2025కల్లా 90 కోట్లు దాటే అవకాశం ఉంది. భారత ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన టెలికాం చట్టాలు గోప్యత హక్కు నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నాయని, టెలికాం సర్వీసులపై ప్రభుత్వం అసమంజసమైన నియంత్రణలు విధించడం సరికాదని, అది రాజ్యాంగ విరుద్ధమని రాజ్యాంగ నిపుణులు విమర్శిస్తున్నారు. ఉదాహరణకు, కొత్త టెలికాం చట్టంలో క్లాజ్‌ 3(7) ప్రకారం టెలికాం సేవలు అందించే సంస్థలు వాటి వినియోగదారుల వివరాలను బయోమెట్రిక్‌ విధానం ద్వారా గుర్తించాలి. క్లాజ్‌ 29 ప్రకారం వినియోగదారులు వారి వ్యక్తిగత విషయాలు ఏ గోప్యతా లేకుండా అడిగినవి అడిగినట్లు ఇవ్వాలి. ప్రభుత్వ వైఫల్యాలను పట్టి చూపే రచయితలు, పాత్రికేయులు తదితరులను అజ్ఞాతంలోంచి బయటకు రప్పించే వ్యూహంలో భాగంగానే ఇలాంటి నిబంధనలు ప్రవేశపెట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

సుప్రీంకోర్టు స్పష్టత

అంతర్జాల స్వాతంత్య్రానికి, గోప్యతా హక్కు నిబంధనకు సంబంధమేమిటో బోధపడాలంటే- ఇండియాలో ప్రాథమిక హక్కులుగా గుర్తింపు పొందిన గోప్యతా నియమాల్ని ప్రభుత్వాలు ఏళ్లతరబడి పట్టించుకోకుండా ఎలా వదిలేశాయో తెలుసుకోవాలి. అంతర్జాల స్వాతంత్య్రం గురించి అంతర్జాతీయ సంస్థలు ప్రతిపాదించే నిర్దిష్ట లక్ష్యాలు, ఆ ప్రమాణాలకు ఇండియా ఎంత దూరంలో ఉంది అన్న విషయాలనూ పరికించాలి. దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఘర్షణలు, అల్లర్లు చెలరేగినప్పుడు అంతర్జాల సేవలను అర్ధాంతరంగా నిలిపివేయడం ఇటీవలి కాలంలో పరిపాటిగా మారింది. అల్లర్లకు పాల్పడేవారు పెద్దయెత్తున ఒక చోట చేరడానికి అంతర్జాలం సహకరిస్తుందని, అందువల్ల ఉద్రిక్తతలు మరింతగా పెరగడానికి అవకాశం లేకుండా దాన్ని నిలిపివేస్తున్నట్లు పాలకులు చెబుతున్నారు. అయితే, ఇలా అంతర్జాల సేవలను నిలిపివేయడం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాజ్యాంగ విరుద్ధం. అంతేకాదు, దేశంలో ఏమి జరుగుతోందో తెలుసుకునే హక్కును ప్రజలకు నిరాకరించడమే! మణిపుర్‌లో ఇటీవల ఘర్షణలు చెలరేగినప్పుడు తొలి విడతలో వంద రోజుల పాటు అంతర్జాలాన్ని నిలిపివేశారు. తద్వారా అక్కడ ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన విషయం బయటకు తెలియకుండా చేసిన ప్రభుత్వం, అల్లర్లను ఆపడంలో మాత్రం సరైన చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇండియాలో 2018లో 135 సార్లు, 2020లో 132 సార్లు, 2023లో దాదాపు 96సార్లు ఆయా ప్రాంతాల్లో అంతర్జాల సేవలను నిలిపివేశారు. ఈ విషయంలో భారత్‌ గత ఆరేళ్లుగా ప్రపంచంలోనే తొలి స్థానంలో నిలుస్తోంది. సైన్యం కనుసన్నల్లో పాలన సాగే పాకిస్థాన్‌, నియంతృత్వ ప్రజాస్వామ్యంగా పిలిచే అల్జీరియా, అంతర్యుద్ధంతో నలిగిపోతున్న బర్మాలలోనూ అంతర్జాలంపై ఆంక్షలు మన స్థాయిలో లేవు.

కేరళ హైకోర్టు 2019లో ఒక కేసు విచారణ సందర్భంగా అంతర్జాలాన్ని ప్రాథమిక హక్కుగా మొట్టమొదటిసారి గుర్తించింది. అంతర్జాలం ద్వారా తమ అభిప్రాయాలను ప్రపంచానికి తెలియజెప్పే హక్కు ప్రజలకు ఉందని, ఇంటర్నెట్‌ను నిలిపివేయడం దీనికి భంగం కలిగిస్తుందని ‘అనురాధ భాసిన్‌’ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అంతర్జాల హక్కు అన్నది భావప్రకటన స్వేచ్ఛలో అంతర్భాగమని, అందువల్ల దానికి రాజ్యాంగ రక్షణ ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం ఉద్ఘాటించింది. 2020లో ‘ఫౌండేషన్‌ ఫర్‌ మీడియా ప్రొఫెషనల్స్‌’ కేసులోనూ సుప్రీంకోర్టు ఇదే మాట చెబుతూ... కశ్మీర్‌లో 4జీ సేవలపై విధించిన నిషేధాన్ని విడతలవారీగా తొలగించింది. అంతర్జాల యుగంలో వాక్‌స్వాతంత్య్ర హక్కు ప్రాధాన్యం గురించి మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు 2015లో ‘శ్రేయా సింఘాల్‌’ కేసులో ఇచ్చిన తీర్పు సందర్భంగా ప్రస్తావించింది. సామాజిక మాధ్యమాల్లో పంచుకునే అంశాల మీద పరిమితులు విధించి, వాటిని ఉల్లంఘించినవారిని అరెస్టు చేయడం గురించి సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్‌ 66ఎ వెల్లడిస్తుంది. ఇది రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు అప్పుడే తేల్చి చెప్పినా, లోక్‌సభలో దీనిపై ఎలాంటి చర్చా జరగలేదు. ఇప్పటికీ పోలీసులు ఈ చట్టం కింద ప్రజల మీద కేసులు పెడుతుండటంపై న్యాయస్థానాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

శాంతియుత పరిస్థితులతోనే...

దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు, తెలియకపోతే అడిగే హక్కు ప్రజలకు ఉన్నాయి. వాటిని ఉల్లంఘించి శాంతి భద్రతల పరిరక్షణ పేరుతో అంతర్జాలం విషయంలో ప్రభుత్వం చేపట్టే చర్యలు రాజ్యాంగ విరుద్ధం. అంతర్జాతీయ ప్రమాణాలకు, సహజ న్యాయ సూత్రాలకూ అవి విఘాతకరమే. అంతర్జాల వినియోగాన్ని నియంత్రించడం ప్రజాస్వామ్య దేశాలకు ఏమాత్రం తగని పని. దేశీయంగా అల్లర్లు తలెత్తినప్పుడు పాలకులు వెంటనే అంతర్జాలాన్ని నిలిపివేయడంపై దృష్టిపెట్టకుండా, తక్షణం ఘర్షణాత్మక ప్రాంతాల్లో శాంతియుత పరిస్థితులు నెలకొనేలా చూడాలి. అలా కాకుండా, హుటాహుటిన అంతర్జాల వినియోగంపై ఆంక్షలు ఝళిపించడమంటే ప్రజల తెలుసుకునే హక్కును తిరస్కరించడమే!


అభివృద్ధిలో కీలకం

ఐక్యరాజ్య సమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) 2003లో వెలువరించిన సూచనల ప్రకారం దేశాలు తమ ప్రజలకు అంతర్జాల లభ్యతను ఒక మానవీయ సేవగా భావించాలి. ప్రతి పౌరుడికీ అంతర్జాలం అందేలా కృషి చేయాలి. ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ప్రకారం ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ప్రతి రంగంలోనూ అంతర్జాల వినియోగం అత్యవసరం. ప్రపంచ మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనలోని ఆర్టికల్‌ 19లో సబ్‌సెక్షన్‌ 32ను సవరించి అంతర్జాల హక్కులపై కొత్త నియమాన్ని 2016లో చేర్చారు. దాని ప్రకారం దేశాలు ప్రజలందరికీ అందుబాటు ధరల్లో నాణ్యమైన అంతర్జాల సేవలు అందించాలి. అప్పట్లో చైనా, సౌదీ అరేబియా లాంటి నియంతృత్వ పాలన సాగుతున్న దేశాలతో పాటు ఇండియా సైతం దానికి మద్దతు తెలపలేదు.


గాంధీ సూర్యదేవర
(అంతర్జాతీయ వ్యవహారాలు, న్యాయ నిపుణులు)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.