రాజకీయ ఉగాది

‘పంచాంగం చూసి ఈ ఏడాది నాకు ఎలా ఉంటుందో కాస్త చెప్పండి గురువుగారూ...’ ‘ఈ సంవత్సరం మీకు భేషుగ్గా ఉంది. పైగా ఇది ఎన్నికల నామ సంవత్సరం కదా... ఇక చెప్పేదేముందీ...’ ‘అంతేనంటారా... మరైతే ఆదాయం వ్యయం, రాజపూజ్యం అవమానాల సంగతేమిటి?’ ‘భలేవారే... నేతగా ఒక్కసారి అవతారం ఎత్తాక ఆదాయానికి ఇక కరవు ఏముంటుందీ...

Published : 22 Mar 2023 00:12 IST

‘పంచాంగం చూసి ఈ ఏడాది నాకు ఎలా ఉంటుందో కాస్త చెప్పండి గురువుగారూ...’
‘ఈ సంవత్సరం మీకు భేషుగ్గా ఉంది. పైగా ఇది ఎన్నికల నామ సంవత్సరం కదా... ఇక చెప్పేదేముందీ...’
‘అంతేనంటారా... మరైతే ఆదాయం వ్యయం, రాజపూజ్యం అవమానాల సంగతేమిటి?’
‘భలేవారే... నేతగా ఒక్కసారి అవతారం ఎత్తాక ఆదాయానికి ఇక కరవు ఏముంటుందీ... ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఖర్చు గురించి బెంగటిల్లుతున్నారా... అయినా, కుదిరిన చోటల్లా కుస్తీపట్లుపట్టి మీరు వెనకేసుకున్న భారీ ఖజానా కొండ ముందు... ఆ ఎలెక్షన్లలో విదిలించేది ఏపాటి చెప్పండి! అయినా చెరువులో భారీ చేపను పట్టాలంటే గేలానికి చిన్న ఎరను కట్టాల్సిందే కదా! ఇక రాజపూజ్యం అవమానాల సంగతంటారా... ఎన్నికల్లో గెలిస్తే దండలు, సన్మానాలు, సత్కారాలు, జేజేలు... ఒక వేళ ఓడిపోయినా అధికార పార్టీలోకి అనాయాసంగా గెంతి... వ్యాపారాలు, ఇతర దందాలు మహ దర్జాగా నడపవచ్చు కదా!’
‘భలే గొప్పగా సెలవిచ్చారు గురువుగారూ’

‘అదిసరే వచ్చిన దగ్గరి నుంచి చూస్తున్నాను... అదేదో పుస్తకాన్ని తెగ దాస్తున్నారు... ఏమిటది?’
‘మన తెలుగు పాటకు ఆస్కార్‌ పురస్కారం వచ్చిన దగ్గర నుంచీ ఈ ఉగాది కవి సమ్మేళనంలో పాల్గొనాలని నాకూ మా చెడ్డ కోరిక పుట్టుకొచ్చేసింది... అందుకే ఈ పుస్తకంలో కొన్ని రాసుకొచ్చాను’
‘అలాగా...  ఇంతకీ ఏమి కవితలు రాశారో మచ్చుకు ఒకటి రెండు వినిపించండి’
‘ఏదోలే గురువు గారూ... నాకు వచ్చినంతలో కొన్ని పాటలకు పేరడీలు రాశాను. ఎన్నికల నామ సంవత్సరమని మీరే అన్నారు కదా... అందుకనే, ‘పార్టీ కాదు, గుర్తూ కాదు, నన్ను చూసే ఓటెయ్యీ... మందూ ముక్కా కావాలంటే మాతోపాటే తిరిగెయ్యి... ఓటే వేస్తావా, నన్నే గెలిపించేస్తావా మావా...’  
‘బాగుంది... అయితే ఈసారి ఎన్నికల్లో సొంతంగా పోటీ చేస్తున్నారన్నమాట...’
‘మన చేతిలో ఏముంది గురువుగారూ... పరిస్థితులనుబట్టి మారిపోవడమే. ‘పొత్తులు కుదిరితే ఎత్తర జెండా, జిత్తులు ఫలిస్తే కొట్టర కొండ’ అనుకుంటూ ఎవరు వస్తే వాళ్లతో కలిసిపోవడమే’
‘అంతేలే... అయినా, మీ లెక్కలు బాగానే ఉన్నాయిగానీ, అసలు ఓటర్లు ఏమనుకుంటున్నారో గమనించారా?’
‘అన్నన్నా... వాళ్ల నాడి గురించి తెలుసుకోకపోతే ఎలా గురువుగారూ... అదే ప్రధానం కదా?’
‘మరైతే... ‘పార్టీలంటే గెంతులాటల వింత... నీతికి తిలోదకాలంట... ప్రజలకు పన్నుల వాతల చింత... అరచేతిలో వైకుంఠ దర్శనమే అంతా...’ అంటూ ప్రజలు తెగ నిట్టూరుస్తున్నారు’
‘అవన్నీ మా దృష్టికొచ్చాయి. ఎటొచ్చీ ప్రజలకు ఓటేయక తప్పదు కదా మరి. అప్పటికి సురగంగా ఆనకట్టలను తెంచి, లక్ష్మీదేవి గలగలలను వాడవాడలా హోరెత్తించి ఏదోలా ఎన్నికల్లో గట్టెక్కాలంతే’
‘అంతేలే... మీ ఉగాదుల కోసం ఏమైనా చేస్తారు... పాపం ప్రజలే జీవితాల్లో వసంతాలు దూరమై నిరాశా నిస్పృహల్లో మునిగిపోతున్నారు’
‘వాటిని దూరం చేయాలనే కదా ప్రజల నెత్తిమీద అప్పుల కొండలు మోపి... అలవిగాని పంచుడు పథకాల పేరుతో అరచేతిలో తోలుబొమ్మలాట చూపిస్తాము. పెట్టుబడుల మేళా అంటూ నానా హడావుడి చేసి, లక్షల కోట్ల రూపాయలు వెల్లువలా వచ్చి పడబోతున్నాయని బులిపిస్తాము’
‘బాగుందిలే వరస. ప్రజలను తేలిగ్గా మభ్యపెట్టవచ్చునని ఎంత నమ్మకం మీకు?! అయినా ఇన్ని గజకర్ణ, గోకర్ణ విద్యలు ప్రదర్శిస్తుంటే ప్రజలు ఓటేయడానికి పోలింగ్‌ బూత్‌లకు రాకుండా ఏమి చేస్తారులే’
‘అదే గురువుగారూ! ప్రజలు బూత్‌లోకి వచ్చి ఓటేస్తే చాలు, అది నోటాకైనా సరే... మిగిలింది మేము చూసుకుంటాం’
‘అవునులే... గెలిచిన వాళ్లందరూ అధికారపక్షంలోకి దూరిపోవడం మొన్న నాగాలాండ్‌లో జరిగిన నాటి నుంచీ నాయకులందరికీ అదో రోల్‌ మోడల్‌లా కనిపిస్తున్నట్లుంది’
‘హహ్హహ్హ... మహ బాగా చెప్పారు! చిన్న రాష్ట్రమైనా ఎంత చక్కటి పరిష్కారం చూపించింది! రాజకీయాల్లో ఆస్కార్‌ ప్రవేశపెడితే... తప్పకుండా ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిందే’
‘మొత్తానికీ ప్రజాస్వామ్యాన్ని నిట్టనిలువునా కూల్చేసి ఆ మంటల్లో టీ కాచుకొని విందులు చేసుకుంటారన్న మాట. ఏది ఏమైనా, ఒకటి గుర్తుంచుకోండి... ఈ వికృత రాజకీయాలు చూసి ప్రజలు విసిగిపోయి ‘మా ఆట చూడు, మా ఓటు చూడు... నాటు నాటు నాటు నాటు ఊరనాటు... నాటు నాటు నాటు విచ్చుకత్తిలాగ వెర్రినాటు... అన్నట్లు తీర్పు ఇస్తే అంతా తారుమారు కాక తప్పదు’
‘ఉగాది ఖుషీలో నేనుంటే ఇలాంటివన్నీ చెప్పి భయపెడతారేమిటి. అంతదాకా వస్తే అప్పుడు చూద్దాముగానీ, ప్రస్తుతానికైతే కవి సమ్మేళనానికి వెళ్ళొస్తా...’

ఎంఎస్‌ఆర్‌ఏ శ్రీహరి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.