డిజిటల్‌ చెరలో బాల్యం

పిల్లల్లో ఎలెక్ట్రానిక్‌ ఉపకరణాల వ్యసనం పెనుముప్పుగా పరిణమిస్తోంది. డిజిటల్‌ బానిసలుగా మారుతున్న చిన్నారులు మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.

Published : 27 Mar 2024 00:47 IST

పిల్లల్లో ఎలెక్ట్రానిక్‌ ఉపకరణాల వ్యసనం పెనుముప్పుగా పరిణమిస్తోంది. డిజిటల్‌ బానిసలుగా మారుతున్న చిన్నారులు మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇదంతా భవిష్యత్తులో విపరిణామాలకు దారితీసే ప్రమాదం ఉంది. నియంత్రణతో కూడిన వినియోగమే ఉపయుక్తం.

ప్రస్తుత కాలంలో డిజిటల్‌ ఉపకరణాలు, సామాజిక మాధ్యమాలు తప్పనిసరిగా మారాయి. అయితే, వీటిని మితిమీరి వినియోగిస్తుండటం పిల్లలకు ముప్పుగా మారుతోంది. అధిక సమయం వీటితోనే గడుపుతుండటంతో చదువుల్లో వెనకంజ వేస్తున్నారు. మానసిక రుగ్మతలు, కంటి సంబంధ వ్యాధులు ముసురుతున్నాయి. నిద్రలేమి, దుందుడుకు స్వభావం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. శారీరక వ్యాయామం లోపించి పిల్లల్లో ఊబకాయం పెరుగుతోంది. ‘లాన్సెట్‌’ అధ్యయనం ప్రకారం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల మంది బాలలు ఊబకాయంతో సతమతమవుతున్నారు. భారత్‌లో 5-19 ఏళ్ల వయసు పిల్లల్లో 1.25కోట్ల మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. వ్యాయామం లేకుండా పొద్దస్తమానం ఎలెక్ట్రానిక్‌ ఉపకరణాలతోనే గడిపితే ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదముంది.

పిల్లలు ప్రతిరోజూ 3-4 గంటలు స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లతోనే గడుపుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో దాదాపు 60 శాతం చిన్నారులు డిజిటల్‌ వ్యసనం బారినపడే ప్రమాదముందని ఇటీవల ‘బాటు టెక్‌’ అనే సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా 5-16 సంవత్సరాల చిన్నారులు వీటి ఉచ్చులో చిక్కుకోనున్నట్లు ఆ సంస్థ అధ్యయనంలో తేలింది. 70-80 శాతం పిల్లలు రోజువారీ నిర్దేశిత సమయంకంటే ఎక్కువగా డిజిటల్‌ ఉపకరణాల్లో లీనమవుతున్నారని వివరించింది. పిల్లల్ని ఎలెక్ట్రానిక్‌ ఉపకరణాలు, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంచే విషయంలో 85 శాతం తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించారు. తమ పిల్లలు డిజిటల్‌ తెరలకు వ్యసనపరులుగా మారినట్లు ఇదే సంస్థ కొన్నాళ్ల క్రితం నిర్వహించిన అధ్యయనంలో 95 శాతం తల్లిదండ్రులు ఆందోళన వెలిబుచ్చారు. ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసలయ్యారని 80 శాతం, అశ్లీల చిత్రాలు, వీడియోలు చూస్తున్నారని 70 శాతం తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు ఫోన్‌వైపు ఆకర్షితులు కాకుండా ఏం చేయాలంటూ 96 శాతం తల్లిదండ్రులు ఆన్‌లైన్‌లో పరిష్కారాల్ని వెదుకుతున్నారని మరో సంస్థ అధ్యయనంలో తేలింది. పిల్లలకు క్రమశిక్షణ అలవాటు చేయగలుగుతున్నా- ఎలెక్ట్రానిక్‌ ఉపకరణాలు, సామాజిక మాధ్యమాలు, ఆన్‌లైన్‌ గేమ్స్‌ నుంచి దూరంగా ఉంచలేకపోతున్నామని చాలామంది తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. డిజిటల్‌ ఉపకరణాలు, సామాజిక మాధ్యమాలతో విద్యార్థుల భవితకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని గుర్తించిన పలు దేశాలు- పిల్లల్లో వాటి వినియోగాన్నితగ్గించే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే ఫ్రాన్స్‌, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, కెనడాల్లో కొన్ని పాఠశాలలు విద్యార్థుల స్మార్ట్‌ఫోన్లపై నిషేధం విధించాయి. చైనా కూడా పలు ఆంక్షలు అమలు చేస్తోంది. ఎనిమిదేళ్లలోపు పిల్లలు 40 నిమిషాలు, 8-15 ఏళ్ల పిల్లలు గంట, 16-18 ఏళ్ల వయసు పిల్లలు రోజుకు రెండు గంటలకు మించి స్మార్ట్‌ఫోన్లు వాడకూడదనే నిబంధనలను చైనా అమలులోకి తీసుకొచ్చింది. అమెరికాలోని ఫ్లోరిడాలో పదిహేనేళ్లలోపు పిల్లల సామాజిక మాధ్యమాల వినియోగంపై పరిమితులు విధిస్తూ ఓ బిల్లును రూపొందించారు. 14-15 సంవత్సరాల పిల్లలు సామాజిక మాధ్యమాలను వినియోగించడానికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా ఉండాలని, 13 ఏళ్లలోపు పిల్లలకు పూర్తిగా నిషేధించాలని పేర్కొన్నారు.

ఆన్‌లైన్‌ తరగతుల కోసం వాడుతున్న డిజిటల్‌ ఉపకరణాలు విద్యార్థులకు లాభాల కంటే ఎక్కువగా కీడు చేస్తున్నాయని, వీటివల్ల చదువులు మెరుగవుతాయనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని కొన్నాళ్ల క్రితం యునిసెఫ్‌ కుండ బద్దలు కొట్టింది. చిన్నారులను కట్టుబానిసలుగా మార్చుతున్న స్మార్ట్‌ఫోన్ల కట్టడికి చర్యలు చేపట్టాలని అన్ని ప్రభుత్వాలకు సూచించింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు డిజిటల్‌ ఉపకరణాలను ఎక్కువగా వినియోగించకుండా అవసరమైన నిబంధనలు రూపొందించాలి. సామాజిక మాధ్యమంలో ఖాతా కలిగి ఉండే వయసును 21 ఏళ్లకుగాని, 18 ఏళ్లకుగాని పరిమితం చేయాలని కొన్ని నెలల క్రితం కర్ణాటక హైకోర్టు సూచించింది. దీని అమలు ప్రక్రియను అన్ని రాష్ట్రాలూ పరిశీలించవచ్చు. పిల్లలు నిర్ణీత సమయం వరకే ఎలెక్ట్రానిక్‌ ఉపకరణాలు, సామాజిక మాధ్యమాలను వినియోగించేలా తల్లిదండ్రులు ఫోన్లలోని సెట్టింగ్స్‌లో మార్పులు చేయాలి. ఖాళీ సమయంలో చిన్నారులను ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బదులుగా ఆరుబయట ఆడేలా, వ్యాయామం చేసేలా ప్రోత్సహించాలి. ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లకు అతుక్కుపోకుండా పుస్తకపఠనం అలవాటు చేయాలి.

 ఏలేటి ప్రభాకర్‌రెడ్డి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.