పండంటి ఆరోగ్యానికి ‘చిరు’ సంకల్పం

చిరుధాన్యాలను విస్తృతంగా వినియోగిస్తేనే సాగు విస్తరిస్తుంది. అన్నదాతలకు ప్రోత్సాహం లభిస్తుంది. చిరుధాన్యాల సాగు, ఉత్పత్తి, ఎగుమతుల్లో ముందంజలో ఉన్న భారత్‌- దేశంలో చిరుధాన్యాలను రోజువారీ ఆహారంలో భాగం చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతోంది.

Published : 20 Apr 2024 00:52 IST

చిరుధాన్యాలను విస్తృతంగా వినియోగిస్తేనే సాగు విస్తరిస్తుంది. అన్నదాతలకు ప్రోత్సాహం లభిస్తుంది. చిరుధాన్యాల సాగు, ఉత్పత్తి, ఎగుమతుల్లో ముందంజలో ఉన్న భారత్‌- దేశంలో చిరుధాన్యాలను రోజువారీ ఆహారంలో భాగం చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతోంది.

దేశంలో పోషకాహార, సూక్ష్మపోషకాల లోపాలు, జీవనశైలిలో మార్పులు పలురకాల అనారోగ్యాలకు దారితీస్తున్నాయి. నిత్యజీవితంలో రోజువారీ ఆహారంలో భాగంగా చిరుధాన్యాలను వినియోగించడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు. చిరుధాన్యాలు సులభంగా జీర్ణమవుతాయి. ప్రొటీన్‌, యాంటీఆక్సిడెంట్లు, డైటరీ ఫైబర్‌, ఐరన్‌, మెగ్నీషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. శరీర బరువును నియంత్రించడం, హెమోగ్లోబిన్‌ స్థాయులను మెరుగుపరచడం, ఇనుము లోపాన్ని తగ్గించడంతో పాటు రక్తహీనత, మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్‌, వ్యాధుల నివారణకు అవి సహాయ పడతాయని తేలింది. చిరుధాన్యాలకు బహుళ ప్రయోజనాలు ఉన్నట్లు గుర్తించడంతో వాటికి అంతకంతకూ ఆదరణ పెరుగుతోంది. వాతావరణ మార్పులు అనేక దేశాల్లో వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అస్థిర వర్షపాతం, కరవుల వల్ల పంటల దిగుబడులు తగ్గిపోతున్నాయి. ఈ తరుణంలో చిరుధాన్యాలు వినియోగదారుడికి మాత్రమే కాకుండా- సాగుపరంగా రైతులకు, పర్యావరణానికి కూడా అనుకూలమైనవిగా గుర్తింపు పొందాయి. నీటి పారుదల ప్రాంతాలే కాకుండా మెట్ట, కొండ ప్రాంతాల్లోనూ ఇవి సాగవుతాయి. భిన్న వాతావరణ పరిస్థితులను, కరవును కూడా తట్టుకోగలవు. తక్కువ నీటి అవసరాలు కలిగి ఉంటాయి. తెగుళ్ల సమస్య కూడా తక్కువే. చిరుధాన్యాల ప్రాధాన్యాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వినియోగాన్ని పెంచేందుకు పలు పథకాలకు శ్రీకారం చుట్టింది. ఐక్యరాజ్యసమితి 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడంతో వాటికి విశేష ప్రాధాన్యం లభించింది.

అన్ని వర్గాలకు అందుబాటులో...

దేశ సేద్య రంగంలో రోజురోజుకు విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 60వ దశకంలో విజయవంతమైన హరిత విప్లవం నేపథ్యంలో భారత్‌ ఎన్నో మైలురాళ్లు అధిగమించింది. ప్రధాన ఆహార పంటలైన వరి, గోధుమ, పప్పులు, పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించింది. ఇదే క్రమంలో వ్యవసాయంలో విప్లవాత్మక ఆవిష్కరణలు, కొత్త సాంకేతికతలు అమలు చేయడం ద్వారా గణనీయమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. చిరుధాన్యాల ఆవశ్యకత దృష్ట్యా దేశవ్యాప్తంగా జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, వరిగెలు, ఊదలు, అరికెల సాగు విస్తీర్ణం పెంచి దేశ జనాభాకు పోషకాహారాన్ని అందించే దిశగా అడుగులు వేస్తోంది. కేంద్రం నిర్దేశాలకు అనుగుణంగా వివిధ పరిశోధక సంస్థలు దేశవ్యాప్తంగా 220 రకాల వంగడాలను సిద్ధం చేసి 5.8లక్షల టన్నుల విత్తనాలను పంపిణీ చేశాయి. వీటివల్ల హెక్టారుకు ఏడు నుంచి ఎనిమిది టన్నుల మేర దిగుబడులు వచ్చే అవకాశముంది. రాబోయే అయిదేళ్లలో అధిక దిగుబడులు ఇచ్చే బ్రీడర్‌, ఫౌండేషన్‌ విత్తనాల పరిశోధనల్ని విస్తృతం చేసి రైతులకు అందించాలని కేంద్రం నిర్ణయించింది. సాగు పెంపుదలతో పాటు చిరుధాన్యాలను అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చిరుధాన్యాల ధరలు అధికంగా ఉండటంతో వాటిని మార్కెట్లో కొనలేని పరిస్థితి నెలకొంది. మిల్లెట్‌ హబ్‌లు వంటివాటిని ఏర్పాటు చేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు పిలుపిచ్చింది. సైనిక బలగాలకు చిరుధాన్యాల ఆహారాన్ని అందిస్తోంది. కేంద్రీయ పోలీస్‌ కల్యాణ్‌ భండార్‌, క్యాంపస్‌లలోని కిరాణా దుకాణాల్లోనూ వాటిని అందుబాటులోకి తెచ్చింది. దీంతోపాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, ఏపీ వంటి రాష్ట్రాలు అంగన్‌వాడీ కేంద్రాలతో పాటు గిరిజన ప్రాంతాల్లో చిరుధాన్యాలను పౌష్టికాహారంగా అందిస్తున్నాయి.

మరింత పెంచేలా...

చిరుధాన్యాల సాగు, వినియోగం దేశవ్యాప్తంగా విస్తృతం కావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బృహత్తర చర్యలు చేపట్టాలి. నాణ్యమైన ఉత్పత్తులు, వాటికి విలువ జోడింపు, మార్కెటింగ్‌ వంటివాటిని బలోపేతం చేయాలి. రైతులకు మార్కెటింగ్‌ సదుపాయాలను పెంచడం తప్పనిసరి. మద్దతు ధరలను ప్రకటించి ప్రభుత్వాలే అన్నదాతల నుంచి తృణధాన్యాలను కొనుగోలు చేయడంతోపాటు వాటిని ఇంటింటా అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేయాలి. చిరుధాన్యాల ప్రాధాన్యంపై ప్రజలను చైతన్యపరచేందుకు కార్యక్రమాలు, ప్రదర్శనలు, సెమినార్లు, వెబ్‌నార్లు, వర్క్‌షాపులు నిర్వహించాలి. చిరుధాన్యాల ధరలను నియంత్రించడం చాలా అవసరం. ప్రస్తుతం బియ్యం, గోధుమల కంటే సిరిధాన్యాల ధరలు బహిరంగ మార్కెట్లో ఎక్కువగా ఉన్నాయి. రేషన్‌ దుకాణాల ద్వారా చిరుధాన్యాల పంపిణీ పేద వర్గాలకు మేలు చేస్తుంది. ఇతరత్రా విక్రయ కేంద్రాలనూ ఏర్పాటు చేసి అందించడం వల్ల మధ్యతరగతి, ఉన్నత వర్గాల్లోనూ చిరుధాన్యాల వాడకం పెరుగుతుంది. స్వయంసహాయక సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతు ఉత్పత్తి సంఘాలు, మార్కెట్‌ యార్డుల్లోనూ విక్రయాలు జరగాలి. చిరుధాన్యాల వినియోగంతో ఆరోగ్యపరంగా కలిగే ప్రయోజనాలపై రేషన్‌ కార్డు లబ్ధిదారులతోపాటు అన్నివర్గాల ప్రజలకూ అవగాహన కల్పించాలి.

ఆకారపు మల్లేశం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.