హీల్స్‌ అంటే ఇష్టం.. కానీ!

హీల్స్‌ అంటే చాలా ఇష్టం. తెగ కొనేస్తుంటాను. కానీ అవి వేసినప్పుడు వేళ్లపై, పాదం వెనుక మచ్చలు పడుతున్నాయి. పొరపాటున శాండిల్స్‌ వేసుకుంటే అసహ్యంగా కనిపిస్తున్నాయి. వీటిని పోగొట్టుకునే వీలుందా?

Published : 06 Nov 2022 00:53 IST

హీల్స్‌ అంటే చాలా ఇష్టం. తెగ కొనేస్తుంటాను. కానీ అవి వేసినప్పుడు వేళ్లపై, పాదం వెనుక మచ్చలు పడుతున్నాయి. పొరపాటున శాండిల్స్‌ వేసుకుంటే అసహ్యంగా కనిపిస్తున్నాయి. వీటిని పోగొట్టుకునే వీలుందా?

- ఓ సోదరి

హీల్స్‌ వేయడం వల్ల శరీర బరువు పాదాలపై అసమానంగా పడుతుంది. ఆ ఒత్తిడి, దానివల్ల కలిగే రాపిడి వేళ్లు, పాదం వెనక మచ్చలకు కారణమవుతాయి. వీలున్నంత వరకూ వీటి వాడకాన్ని తగ్గించండి. మచ్చలే కాదు చాలా శారీరక సమస్యలకూ ఇవి కారణమవుతాయి. రోజంతా వేసుకోవాల్సి వస్తే వాటిని ఎంచుకోకపోవడమే మేలు. కొద్ది సేపటి కోసమే అయినా.. వేసుకునే ముందు, తర్వాత లెగ్‌ స్ట్రెచ్‌లు చేయాలి. కూర్చున్నప్పుడు వీలైనంతవరకూ తీసేయాలి. తప్పనిసరి అయితే ఫ్లాట్‌ హీల్స్‌ ఎంచుకోవచ్చు. పాయింటెడ్‌ హీల్స్‌ అయితే 2 అంగుళాలకు మించకూడదు. రోజూ వేసుకుంటోంటే రాపిడి కారణంగా పాదంపై నల్లగా కమిలినట్లుగా అవుతుంది. అయినా పట్టించుకోకుండా వాడుతుంటే చర్మం మందంగా తయారవుతుంది. కాయలు కూడా కాస్తాయి. కొద్దిరోజులు వేయడం ఆపండి. మార్పు కనిపిస్తుంది. పాదాలకీ రోజూ క్లెన్సింగ్‌, వారానికోసారి స్క్రబింగ్‌ అలవాటు చేసుకోండి. నిమ్మ, తేనె వంటి సహజ స్క్రబ్‌లను ఎంచుకుంటే మంచిది. మాయిశ్చరైజర్‌ రాసి, దానిపై సాల్సిలిక్‌ యాసిడ్‌, మాండోలిక్‌ యాసిడ్‌, లాక్టిక్‌ యాసిడ్‌ క్రీమ్‌లను రాయాలి. ఉదయం బయటికి వెళుతోంటే సన్‌స్క్రీన్‌నీ రాయాలి. ఇలా తరచూ చేస్తోంటే ఈ నల్లమచ్చలు తగ్గుతాయి. ఇవన్నీ చేస్తున్నాం కదా అని హీల్స్‌ వేస్తోంటే సమస్య అదుపులోకి రావడం కష్టం. కాబట్టి నయమయ్యే వరకూ దూరంగా ఉంటేనే ఫలితం కనిపిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని