Published : 07/12/2022 18:54 IST

చపాతీలు మెత్తగా.. ఇలా..!

చపాతీలు మెత్తగా, మృదువుగా చేయడం ఒక కళ. చాలామందికి చేసే విధానం సరిగ్గా తెలియకపోవడం వల్ల అవి గట్టిగా వస్తాయి. అవి తినలేక దవడలు వాచిపోతాయ్! మరి చపాతీలు మెత్తగా రావాలంటే ఏం చేయాలి?

'పిండి కొద్దీ రొట్టె' అన్నట్లు- ఎన్ని చపాతీలు అవసరమో అంతకు సరిపడా పిండినే కలుపుకోవాలి. అలా పరిమాణం నిర్దిష్టంగా ఉండటం వల్ల అందులో కలిపే ఉప్పు, నూనె.. వంటివి సులభంగా అంచనా వేయవచ్చు. పిండి కలిపే సమయంలో కొంతమంది నెయ్యి లేదా నూనె, పెరుగు అందులో కలుపుతారు. వీటన్నిటినీ ఎంతో కొంత అని కాకుండా, తీసుకున్న పిండికి తగిన పాళ్లలో కలిపినప్పుడే చపాతీలు మృదువుగా వస్తాయి.

ఈ క్రమంలో ముందుగా నాణ్యమైన చపాతీ పిండి తీసుకోవాలి. అవసరమైతే దాన్ని జల్లెడ పట్టాలి. అవసరమయ్యే పరిమాణంలో పిండిని తీసుకుని తగు పాళ్లలో నూనె, ఉప్పు, నీళ్లు కలుపుకోవాలి. ఉదాహరణకు మూడుకప్పుల (చిన్నవి) పిండి కలపాలనుకుంటే; అందులో రెండు చెంచాల నూనె, కాస్త ఉప్పు, ఒకటిన్నర కప్పుల నీళ్లు (పిండి కొలిచిన కప్పుతో) కలపాలి. మొదట్లో మెల్లగా పిండి కలుపుకొంటూ కొద్దికొద్దిగా నీళ్లు పోసుకోవాలి. ఒకేసారి నీళ్లన్నీ పోసేయకూడదు. పిండి బాగా కలవాలంటే ముందు గోధుమ పిండిని ఒక కొండ ఆకారంలో పోసి దాని మధ్యలో నూనె, ఉప్పు, నీళ్లు వేసి కలపాలి. అప్పుడు మొత్తం అన్నీ సమానంగా కలుస్తాయి.

మదించడమూ ముఖ్యమే!

పిండిలో అన్నీ వేసి కలుపుకొన్న తర్వాత దాన్ని మదించడం చాలా ముఖ్యం. అప్పుడే ఆ పిండి మెత్తగా, మృదుత్వాన్ని సంతరించుకుంటుంది. వెడల్పుగా ఉండే పాత్ర లేదా గిన్నెలో పిండి కలుపుకొంటే బాగా పిసకడానికి వీలుంటుంది. మీ బలం అంతా ఉపయోగించి కలిపిన పిండిని ఎంత వీలైతే అంత మదించడానికి ప్రయత్నించండి. తర్వాత దాని మీద తడి వస్త్రం కప్పి, 15 నుంచి 20 నిమిషాల పాటు కదపకుండా వదిలేయాలి. దీనివల్ల పిండికి వచ్చిన మెత్తదనం, మృదుత్వం పోకుండా ఉంటాయి.

ఒకేలా చేయాలి

చపాతీలు చేసుకోవడానికి పిండి సిద్ధమైన తర్వాత వాటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. అన్ని ఉండల్నీ ఒకేలా, ఎక్కడా హెచ్చుతగ్గులు లేకుండా సమానంగా, గుండ్రంగా అప్పడాల్లా ఒత్తుకోవాలి. ఈ క్రమంలో చపాతీలు ఒత్తే పీటకు తడి పిండి అంటుకోకుండా పొడి గోధుమ పిండి చల్లుతూ ఉండాలి. అలా చపాతీలు చేస్తున్నప్పుడు వాటిని ఎప్పుడూ సవ్యదిశలోనే తిప్పుతూ ఒత్తుకోవాలి.

చపాతీలు ఒత్తుకున్న తర్వాత వాటిని మొదట పచ్చిదనం పోయేవరకు పెనం మీద కాసేపు ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కాలనివ్వాలి. తర్వాత మంట మధ్యస్థంగా ఉంచాలి. ఇలా అవసరమైనంత ఉష్ణోగ్రత అందించడం వల్ల చపాతీలు మెత్తగా ఉంటాయి. మరీ, ఎక్కువ మంట పెట్టి కాల్చినా అవి గట్టిగా అవుతాయి. అందుకే ఈ విషయం గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. ఇలా ఒక క్రమ పద్ధతిలో చపాతీలు చేస్తే.. చాలా చక్కగా, మెత్తగా, మృదువుగా వస్తాయి. ఎన్ని తిన్నా ఇంకా తినాలనే అనిపిస్తుంది. దీంతో పాటు మరికొన్ని చిట్కాలు పాటించడం వల్ల కూడా మెత్తటి చపాతీలు చేసుకోవచ్చు..

⚜ గోధుమ పిండిని కలుపుకొనేటప్పుడు చల్లటి నీళ్లకు బదులు వేడి నీటిని ఉపయోగించవచ్చు.

⚜ అరచెంచా బేకింగ్ సోడా పిండిలో కలపడం వల్ల కూడా చపాతీలు మెత్తగా వస్తాయి. పొంగుతాయి కూడా.

⚜ చపాతీలు చేయడానికి ఒక గంట ముందే పిండిని కలిపి పెట్టుకోవాలి.

⚜ నీళ్లకు బదులు పాలు కూడా కలుపుకోవచ్చు.

⚜ చపాతీలు చేసుకునేటప్పుడు పొడి పిండిని ఎంత వీలైతే అంత తక్కువగా ఉపయోగించాలి. లేకపోతే చపాతీలు గట్టిపడే ప్రమాదం ఉంది.

⚜ కాల్చిన చపాతీలను వెంటనే మూత ఉండే పాత్రల్లో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల చపాతీలు మెత్తగా, మృదువుగా, వేడిగా ఉంటాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని