అమెరికాలో చెదిరిన నృత్య కల

భారతీయులు, భారత సంతతికి చెందినవారిపై అగ్రరాజ్యం అమెరికాలో దాడులు ఆగడం లేదు. అక్కడి తుపాకీ సంస్కృతికి తాజాగా భారత్‌కు చెందిన సంప్రదాయ నృత్య కళాకారుడు బలయ్యారు.

Updated : 03 Mar 2024 05:59 IST

భారత కూచిపూడి కళాకారుడి కాల్చివేత

న్యూయార్క్‌, సూరీ (ప.బెంగాల్‌): భారతీయులు, భారత సంతతికి చెందినవారిపై అగ్రరాజ్యం అమెరికాలో దాడులు ఆగడం లేదు. అక్కడి తుపాకీ సంస్కృతికి తాజాగా భారత్‌కు చెందిన సంప్రదాయ నృత్య కళాకారుడు బలయ్యారు. కూచిపూడి, భరతనాట్యంలో ప్రవేశమున్న అమర్‌నాథ్‌ ఘోష్‌ (34)పై మిసోరి రాష్ట్రంలోని సెయింట్‌ లూయిస్‌ అకాడమి, సెంట్రల్‌ వెస్ట్‌ఎండ్‌ పరిసరాల వద్ద గుర్తుతెలియని వ్యక్తులు పలుమార్లు కాల్పులు జరిపారు. సాయంత్రపు నడకకు వెళ్లిన ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. సెయింట్‌ లూయిస్‌ మెట్రోపాలిటన్‌ పోలీసులు దీన్ని ధ్రువీకరించారు.

గత రెండు నెలల్లో అమెరికాలోని భారతీయ విద్యార్థులపై జరిగిన దాదాపు ఆరో అఘాయిత్యమిది. నృత్యంపై ఎన్నో కలలతో ఉన్న ఘోష్‌.. పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ వాషింగ్టన్‌ యూనివర్సిటీలో మాస్టర్స్‌ చేయడానికి గతేడాదే పశ్చిమబెంగాల్‌ నుంచి అమెరికాకు వచ్చారు. చెన్నైకు చెందిన ‘కళాక్షేత్ర’ పూర్వ విద్యార్థి ఈయన. చికాగోలోని ఇండియన్‌ కాన్సులేట్‌ ఈ ఘటనపై స్పందిస్తూ..‘‘అమర్‌నాథ్‌ ఘోష్‌ కుటుంబానికి అన్నివిధాలా సహాయపడతాం. దీనిపై లోతుగా దర్యాప్తు చేయాలని స్థానిక పోలీసులను, యూనివర్సిటీ అధికారులను కోరాం’’ అని ‘ఎక్స్‌’ ద్వారా పేర్కొంది. అమర్‌నాథ్‌ ఘోష్‌ దుర్మరణం గురించి అధికారిక సమాచారం ఏదీ అందక తాము ఇప్పటికీ గందరగోళంలోనే ఉన్నామని పశ్చిమబెంగాల్‌లోని సూరీ పట్టణంలో ఉంటున్న ఆయన మావయ్య శ్యామల్‌ ఘోష్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని