సంక్షిప్త వార్తలు (5)

ఉక్రెయిన్‌ భూభాగాన్ని విలీనం చేసుకుంటూ రష్యా అధ్యక్షుడు చేసిన ప్రసంగం అత్యంత మోసపూరితంగా ఉంది. బూటకపు రెఫరెండంతో ఉక్రెయిన్‌ను వలస రాజ్యంగా చేయడానికి చట్టవిరుద్ధ ప్రయత్నం చేశారు.

Updated : 02 Oct 2022 07:02 IST

పుతిన్‌ ప్రసంగం మోసపూరితం

ఉక్రెయిన్‌ భూభాగాన్ని విలీనం చేసుకుంటూ రష్యా అధ్యక్షుడు చేసిన ప్రసంగం అత్యంత మోసపూరితంగా ఉంది. బూటకపు రెఫరెండంతో ఉక్రెయిన్‌ను వలస రాజ్యంగా చేయడానికి చట్టవిరుద్ధ ప్రయత్నం చేశారు. ప్రపంచం దీన్ని అంగీకరించదు. ఉక్రెయిన్‌కు నిరంతరం తోడుంటాం.

- బోరిస్‌ జాన్సన్‌


మరో రెండు క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా

సియోల్‌: ఉత్తర కొరియా ఆయుధ ప్రయోగాలు కొనసాగుతున్నాయి. శనివారం రెండు స్వల్పశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణులను ఆ దేశం పరీక్షించింది. ఇలాంటి ప్రయోగాలు చేపట్టడం ఈ వారంలో ఇది నాలుగోసారి. దీనిపై పొరుగుదేశాలు తీవ్రంగా మండిపడ్డాయి. అణ్వస్త్రాల కోసం ఉత్తర కొరియా అర్రులు చాచడం వల్ల ఆ దేశ ప్రజల కష్టాలు మరింత పెరుగుతున్నాయని దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ తెలిపారు. అలాంటి ఆయుధాలను ఉపయోగిస్తే దక్షిణ కొరియా, అమెరికా సైన్యాల నుంచి తీవ్ర ప్రతిస్పందన తప్పదని హెచ్చరించారు. ఇటీవల దక్షిణ కొరియా, అమెరికా నౌకాదళాల విన్యాసాలే ఉత్తర కొరియా తాజా క్షిపణి పరీక్షలకు కారణమని భావిస్తున్నారు. ఈ ప్రయోగాలను తాము నిశితంగా పరిశీలించామని దక్షిణ కొరియా, జపాన్‌, అమెరికా సైన్యాలు తెలిపాయి. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌ సమీపం నుంచి ఇవి జరిగినట్లు భావిస్తున్నారు. ఈ అస్త్రాలు గరిష్ఠంగా 30-50 కిలోమీటర్ల ఎత్తుకు చేరాయని, దాదాపు 350-400 కిలోమీటర్లు ప్రయాణించాయని పేర్కొన్నారు. అవి కొరియా ద్వీపకల్పానికి జపాన్‌కు మధ్య ఉన్న సముద్ర జలాల్లో పడ్డాయని వివరించారు. ఈ క్షిపణులు అస్పష్ట పథంలో ప్రయాణించాయని, దీన్నిబట్టి వాటికి అణ్వస్త్ర సామర్థ్యముందని అర్థమవుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అవి రష్యాకు చెందిన ఇస్కాందర్‌ క్షిపణిని పోలి ఉన్నాయన్నారు.


సుమత్రా దీవుల్లో భూకంపం
ఒకరి మృతి.. 11మందికి గాయాలు

జకార్తా: ఇండోనేసియాలోని సుమత్రా దీవుల్లో శనివారం భూకంపం సంభవించి ఒకరు మరణించడంతోపాటు 11 మందికి గాయాలయ్యాయి. 15 వరకు ఇళ్లు దెబ్బతిన్నాయి. ఉత్తర సుమత్రా ప్రాంతంలోని సిబోల్గాలో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ప్రకంపనల తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 5.9గా నమోదైంది. భూకంపం వచ్చినప్పుడు రక్షణ కోసం పరుగెత్తుతూ 62 ఏళ్ల వృద్ధుడు ఒకరు గుండెపోటుతో చనిపోయారు.


నింగిలోకి చేరిన ఆల్ఫా రాకెట్‌

వాషింగ్టన్‌: అమెరికాకు చెందిన ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్‌ కంపెనీ తొలిసారిగా భూకక్ష్యలోకి ప్రయోగం చేపట్టింది. ఆ సంస్థకు చెందిన ఆల్ఫా రాకెట్‌.. కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి శనివారం నింగిలోకి దూసుకెళ్లింది. ఈ సందర్భంగా అనేక చిన్న ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి చేర్చింది. ఇవి పలు సాంకేతిక ప్రయోగాలు నిర్వహిస్తాయి. విద్యా సంబంధ అవసరాలను నెరవేరుస్తాయి. ప్రయోగం 100 శాతం దిగ్విజయంగా సాగిందని ఫైర్‌ఫ్లై సంస్థ ప్రకటించింది. ఆల్ఫా రాకెట్‌ను నింగిలోకి పంపేందుకు శుక్రవారం ప్రయత్నించగా.. చివరి నిమిషంలో అది ఆగిపోయింది. ఈ కంపెనీకి ఇది రెండో ప్రయోగం. తొలి ప్రయత్నం గత ఏడాది సెప్టెంబరు 2న జరిగింది. నాడు రాకెట్‌ కక్ష్యలోకి చేరలేదు.


ఇరాన్‌లో పోలీసుస్టేషన్‌పై దాడి
19 మంది మృతి

టెహ్రాన్‌: ఇరాన్‌లోని జహెదాన్‌ నగరంలో సాయుధ వేర్పాటువాదులు పోలీసుస్టేషన్‌పై చేసిన దాడిలో ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ సభ్యులు నలుగురు సహా 19 మంది మరణించారు. మసీదు సమీపంలో భక్తుల ముసుగులో ఉన్న కొందరు దాడికి పాల్పడినట్లు ఇరాన్‌ అధికారిక వార్తాసంస్థ ఇర్నా తెలిపింది. ఈ దాడిలో 32 మంది రక్షణ దళాల సభ్యులు గాయపడినట్లు రాష్ట్ర గవర్నర్‌ హొస్సైన్‌ మొదరెసి చెప్పారు. పోలీసు కస్టడీలో ఓ యువతి మరణించిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో భాగంగానే ఈ దాడి జరిగిందా? లేదా? అన్న విషయమై స్పష్టత లేదు. సెప్టెంబరు 17న ఈ నిరసనలు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు కనీసం 41 మంది నిరసనకారులు, పోలీసులు మరణించినట్లు ఇరాన్‌ అధికారిక టీవీ తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని