Ricky Kej: బ్రిటన్‌ గడ్డపై ‘స్వాతంత్ర్య’ సంబరాలు.. 100 మంది ఆర్కెస్ట్రా బృందంతో ‘జనగణమన’

బ్రిటన్‌లోని ప్రఖ్యాత ‘అబ్బే రోడ్ స్టూడియోస్‌’లో 100 మంది ఆర్కెస్ట్రా బృందంతో రికార్డు చేసిన ‘జనగణమన’ గీతాన్ని భారతీయ స్వరకర్త రికీ కేజ్‌ విడుదల చేశారు. ఆయన మూడు సార్లు ‘గ్రామీ పురస్కార’ విజేత.

Published : 14 Aug 2023 20:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జాతీయ గీతం ‘జనగణమన (Jana Gana Mana)’ ఎప్పుడూ విన్నా.. సగటు భారతీయుడి గుండె ఉప్పొంగుతుంది. అలాంటిది ఏకంగా 100 మందితో కూడిన ఓ ప్రఖ్యాత ఆర్కెస్ట్రా బృందం తమ సంగీత పరికరాలతో ఈ గీతాన్ని వాయిస్తే.. అదీ బ్రిటన్‌ గడ్డపైనా.. ఉద్వేగం తారస్థాయికి చేరుతుంది కదూ! ఇదే చేసి చూపించారు భారతీయ స్వరకర్త, మూడు సార్లు ‘గ్రామీ అవార్డు’ విజేత రికీ కేజ్‌ (Ricky Kej). 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ ‘జనగణమన’ వీడియోను ఆయన ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు. భారత జాతీయ గీతాన్ని (Indian National Anthem) రికార్డు చేసిన అతిపెద్ద ఆర్కెస్ట్రా ఇదేనని వెల్లడించారు.

2047లోగా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో భారత్‌ ఉండాలి: రాష్ట్రపతి

‘లండన్‌లోని పేరుపొందిన ‘అబ్బే రోడ్ స్టూడియోస్‌’లో ‘ది రాయల్‌ ఫిల్హార్మోనిక్‌ ఆర్కెస్ట్రా (RPO)’కు చెందిన 100 మంది బృందంతో జనగణమన గీతాన్ని రికార్డు చేశా. భారత జాతీయ గీతాన్ని రికార్డ్ చేసిన అతిపెద్ద ఆర్కెస్ట్రా ఇదే. చాలా అద్భుతంగా వచ్చింది. గీతం చివర్లో నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. భారతీయ స్వరకర్తగా గొప్ప అనుభూతిని పొందా’ అని రికీ కేజ్‌ పేర్కొన్నారు. బ్రిటన్‌కు భారత హైకమిషనర్‌ విక్రమ్‌ దొరైస్వామి.. రికీ కేజ్‌ ప్రయత్నాన్ని కొనియాడారు. నెటిజన్లు సైతం అద్భుతమైన ప్రదర్శన అంటూ స్పందిస్తున్నారు. ఇదిలా ఉండగా.. 1946లో స్థాపించిన ఆర్పీవోకు బ్రిటన్‌లో అత్యంత డిమాండ్ కలిగిన ఆర్కెస్ట్రాగా గుర్తింపు ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని