Droupadi Murmu: 2047లోగా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో భారత్‌ ఉండాలి: రాష్ట్రపతి

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడారు. మువ్వన్నెల జెండా చూస్తే మన హృదయం ఉప్పొంగుతుందని చెప్పారు.

Updated : 14 Aug 2023 20:54 IST

దిల్లీ: మువ్వన్నెల జెండా చూస్తే భారతీయుల హృదయం ఉప్పొంగుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని (Independence Day) పురస్కరించుకొని జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ప్రపంచంలోనే భారత్‌ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పారు. ప్రతి భారతీయుడికి కులం, మతం, భాష తదితర అనేక గుర్తింపులు ఉంటాయని, కానీ వాటన్నింటికంటే భారతీయుడు అనే గుర్తింపు చాలా గొప్పదని  అన్నారు. ప్రతి భారతీయుడు రాజ్యాంగం ముందు సమానమేనని, దేశంలోని ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు, హక్కులు, విధులు ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య మహా సంగ్రామంలో కీలక పాత్ర పోషించిన మతాంగిని హజ్రా, కనక్లట బారూహా, కస్తూర్బా గాంధీ, సరోజినీ నాయుడు, అమ్ము స్వామినాథన్‌, రమాదేవి, అరుణ అసఫ్‌ అలీ, సుచేతా కృపాళిని తదితర మహిళా స్వాతంత్ర్య సమరయోధులను ఆమె స్మరించుకున్నారు.

‘‘1947 ఆగస్టు 15న మనమంతా పరాయి పాలన నుంచి విముక్తి పొందడమే కాదు, మన విధిని తిరిగి రాసుకునే స్వేచ్ఛను కూడా పొందాం. దేశ జీడీపీ ఏటా పెరుగుతోంది. గ్రామీణ యువతకు ఉపాధి కల్పించేందుకు అనే కార్యక్రమాలు చేపడుతున్నాం. ఆదివాసీల అభివృద్ధి కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. వ్యక్తిత్వ వికాసానికి మెరుగైన శిక్షణ అవసరం. మహిళలు సత్తా చాటుతూ ప్రతిరంగంలోనూ దూసుకెళ్తున్నారు. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనేందుకు మహిళలు సిద్ధపడుతున్నారు. మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇవ్వాలని దేశ పౌరులందర్నీ కోరుతున్నా. మా సోదరీమణులంతా ధైర్యంగా సవాళ్లను అధిగమించి జీవితంలో ముందుకు సాగాలని కోరుకుంటున్నా’’ అని ద్రౌపది ముర్ము తెలిపారు.

దేశ ఆర్థిక అభివృద్ధితోపాటు మానవ వనరుల అభివృద్ధి, వివాద రహిత సమాజానికి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం గురించి మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థలో మార్పు మొదలైందని అన్నారు. విద్యార్థులు, పలువురు విద్యావేత్తలతో చర్చించిన తర్వాత అభ్యాస ప్రక్రియ మరింత సరళంగా మారిందని తాను గ్రహించానన్నారు. పురాతన విలువలను ఆధునిక నైపుణ్యాలతో మేళవించడం వల్ల జాతీయ విద్యా విధానం 2020 విద్యారంగంలో అపూర్వ మార్పులు తీసుకువస్తుందని, ఇది దేశ పరివర్తనకు దారితీస్తుందని తెలిపారు.

పర్యావరణ పరిరక్షణ కోసం అనేక చర్యలు చేపట్టినట్లు ద్రౌపది ముర్ము తెలిపారు. సౌర, పవన విద్యుదుత్పత్తి పెంచే కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. ఈ ఏడాది ఎంతో గర్వంగా చంద్రయాన్-3ని పంపించామని, అది జాబిల్లిపై అడుగుపెట్టే క్షణం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు. 2047లోగా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో భారత్‌ ఉండాలని ఆకాంక్షించారు. స్వాతంత్ర్య దినోత్సవం ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేస్తోందన్నారు. భారతదేశం ప్రపంచ వేదికపై తన సముచిత స్థానాన్ని తిరిగి పొందడమే కాకుండా, అంతర్జాతీయ క్రమంలో తన స్థానాన్ని కూడా పెంచుకుందన్నారు. G20 అధ్యక్ష పదవితో దేశ వాణిజ్యం, ఆర్థిక విషయాల్లో పురోగతి దిశగా నిర్ణయం తీసుకోగలదు’’ అని ద్రౌపదీ ముర్ము తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని