Israel-Hamas: ఇజ్రాయెల్‌పై మరోవైపు నుంచి హెజ్బొల్లా దాడులు ప్రారంభం..!

తాజాగా గాజాలోని హమాస్‌ మిలిటెంట్లకు మద్దతుగా లెబనాన్‌లోని హెజ్బొల్లా కూడా చేరింది. హమాస్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌పై రాకెట్లు, మోర్టార్లతో దాడులు మొదలుపెట్టింది.

Updated : 08 Oct 2023 17:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం తీవ్ర రూపం దాలుస్తోంది. హమాస్‌కు మద్దతుగా తాజాగా లెబనాన్‌లోని మిలిటెంట్‌ సంస్థ ‘హెజ్బొల్లా’ కూడా యుద్ధంలోకి దిగింది. ఆదివారం హెజ్బొల్లా గ్రూప్‌ డజన్ల కొద్దీ రాకెట్లు, మోర్టార్‌ షెల్స్‌ను ఇజ్రాయెల్‌ సైనిక స్థావరాలపై ప్రయోగించింది. ఈ స్థావరాలు ఇజ్రాయెల్‌ ఆధీనంలోని గోలన్‌హైట్స్‌ వద్ద ఉన్నాయి.

ఈ దాడులపై హెజ్బొల్లా అధికారికంగా స్పందించింది. భారీ సంఖ్యలో రాకెట్లు, షెల్స్‌ను ఉపయోగించినట్లు వెల్లడించింది. తాము పాలస్తీనా పోరాటానికి సంఘీభావంగా దాడి చేసినట్లు ప్రకటన చేసింది. ఇక్కడ పోరాటం కొనసాగుతుంది. జిబ్‌డెన్‌ ఫామ్‌, షీబా ఫామ్స్‌ వద్ద ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తాము ఇజ్రాయెల్‌పై చేసిన మెరుపుదాడికి ఇరాన్‌ నుంచి మద్దతు లభించిందని హమాస్‌ ప్రకటించింది. తాజాగా లెబనాన్‌లోని హెజ్బొల్లా కూడా ఈ యుద్ధంలోకి రావడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారే ప్రమాదముంది.

పశ్చిమాసియాలో యుద్ధజ్వాలలు

మరోవైపు హెజ్బొల్లా  దాడులను ఇజ్రాయెల్‌ దళాలు తిప్పికొట్టాయి. కాకపోతే ఈ ఘటనలో ఎంతమంది మృతి చెందారో మాత్రం వెల్లడించలేదు. తమపైకి మోర్టార్‌ గుండ్లను ప్రయోగించిన ప్రదేశంపై ఎదురు దాడి చేశామని ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించంది. గోలన్‌ హైట్స్‌ను ఇజ్రాయెల్‌ 1981లో స్వాధీనం చేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని