Xi Jinping: తైవాన్‌.. చైనాలో భాగంకాక తప్పదు: జిన్‌పింగ్

తైవాన్‌(Taiwan) ద్వీపం తమ దేశంలోని అంతర్భాగమేనని తరచూ చైనా(China) వాదిస్తూనే ఉంటుంది. తాజాగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ నుంచి ఇదే తరహా ప్రకటన వచ్చింది.    

Published : 27 Dec 2023 14:36 IST

బీజింగ్‌: చైనా(China), తైవాన్(Taiwan) మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. తైవాన్‌ తమ దేశంలో విలీనంకాక తప్పదని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్(Xi Jinping) వ్యాఖ్యానించారు. జనవరిలో ఈ ద్వీపంలో ఎన్నికలు జరగనున్న తరుణంలో జిన్‌పింగ్‌ నుంచి ఇటువంటి స్పందన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. చైనాను పాలించిన మావో 130వ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘మాతృభూమితో పునరేకీకరణ జరగాలి. అది అనివార్యం. తైవాన్‌ను చైనా నుంచి వేరు కానీయం. తైవాన్‌ జలసంధి అంతటా శాంతియుత సంబంధాలను ప్రోత్సహించాలి’ అని జిన్‌పింగ్‌(Xi Jinping) ప్రతిజ్ఞ చేశారు. తైవాన్‌ విషయంలో బీజింగ్ వైఖరిని ఆయన పునరుద్ఘాటించారు. త్వరలో అక్కడ జరగబోయే ఎన్నికలు, తైవాన్‌పై బలప్రయోగం వంటి అంశాలను ఆయన ప్రస్తావించలేదు.

‘ విపత్తులు మిగిల్చిన విషాదం.. భీకర యుద్ధాలు!’

చైనా(China) నుంచి ముప్పు ఎదుర్కొంటున్న తైవాన్‌(Taiwan).. జనవరి 13న దేశంలో ఎన్నికలకు సిద్ధమవుతోంది. 2027లో తైవాన్‌పై దండయాత్రకు చైనా సిద్ధంగా ఉండాలని షీ జిన్‌పింగ్‌ ఆదేశించినట్లు అమెరికా సైనిక వర్గాలు చెబుతున్న వేళ ఈ ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. డెమొక్రాటిక్‌ ప్రొగ్రెసివ్‌ పార్టీ నేత లయ్‌ చింగ్‌-టే ఈ ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఉన్నట్లు అంచనాలున్నాయి. తైవాన్‌లో ఎన్నికలు తమ అంతర్గత వ్యవహారమని చైనా వాదిస్తోంది. 

తన విధానాలకు విరుద్ధంగా వ్యవహరించిన ప్రతిసారి తైవాన్‌ మీదకు యుద్ధవిమానాలు, నౌకలను పంపి చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. కొద్దిరోజుల క్రితం తైవాన్‌ భవిష్యత్తు అభివృద్ధికి బ్లూప్రింట్‌గా చెబుతున్న ఓ ప్లాన్‌ను చైనీస్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ సెంట్రల్‌ కమిటీ విడుదల చేసింది. తైవాన్‌తో సమగ్ర అభివృద్ధికి ఫుజియాన్‌ను ‘ప్రత్యేక జోన్‌’గా మారుస్తానని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని