World Roundup 2023: విపత్తులు మిగిల్చిన విషాదం.. భీకర యుద్ధాలు!

గడిచిన ఏడాది కాలాన్ని తిరిగి చూస్తే.. ప్రకృతి విపత్తులు, భీకర యుద్ధాలు పలు దేశాలను వణికించాయి.

Updated : 27 Dec 2023 10:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సరికొత్త ఆశలు, ఆశయాలతో నూతన సంవత్సరంలో (New Year) అడుగుపెట్టేందుకు యావత్‌ ప్రపంచం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో గడిచిన ఏడాది (Year 2023) కాలాన్ని ఓసారి తిరిగి చూస్తే.. ప్రకృతి విపత్తులు (Natural disasters), భీకర యుద్ధాలు (Conflicts) పలు దేశాలను వణికించాయి. వీటితోపాటు పలు ప్రాంతాల్లో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టు, భారత్‌-కెనడా మధ్య దౌత్య సంబంధాలు (India-Canada relations) బీటలువారడం వంటి పరిణామాలకు 2023 సాక్ష్యంగా నిలిచింది.

తుర్కియే విషాదం

తుర్కియేతోపాటు సిరియాలో చోటుచేసుకున్న భూకంపం (Turkey earthquake) కనీవినీ ఎరుగని విషాదాన్ని మిగిల్చింది. ఫిబ్రవరి 6న 7.8, 7.7 తీవ్రతలతో కంపించిన భూమి.. రెండు దేశాల్లో దాదాపు 67వేల మందిని పొట్టనబెట్టుకుంది. లక్షల మంది తీవ్రగాయాలపాలయ్యారు. లక్షలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. 1939 తర్వాత తుర్కియే చవిచూసిన అతిపెద్ద భూకంప విలయం ఇదే. ఆ దేశంలో సుమారు 59వేల మంది చనిపోగా.. సిరియాలో ఎనిమిది వేల మంది మృత్యువాతపడ్డారు.

టైటాన్‌ సబ్‌మెరైన్‌

అట్లాంటిక్‌ మహాసముద్రంలో సుమారు 12 వేల అడుగుల లోతులో ఉన్న టైటానిక్‌ (Titanic) నౌక శకలాలను చూసేందుకు వెళ్లి గల్లంతైన టైటాన్‌ మినీ జలాంతర్గామి (Titan Submarine) కథ విషాదాంతమైంది. నీటి ఒత్తిడికి టైటాన్‌ పేలిపోవడంతో ఓషన్‌గేట్‌ (OceanGate) వ్యవస్థాపకుడు స్టాక్టన్‌ రష్‌ సహా అందులో వెళ్లిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరు బయలుదేరిన మూడో రోజుకు ఈ మినీ జలాంతర్గామి శకలాలను టైటానిక్‌ ఓడకు 500 మీటర్ల దూరంలో అమెరికా కోస్ట్‌ గార్డ్‌ రెస్క్యూ బృందాలు గుర్తించాయి.

‘పిట్ట’ పోయి ‘ఎక్స్‌’ వచ్చే..

మైక్రో బ్లాగింగ్‌ వేదిక ‘ట్విటర్‌’ను కొనుగోలు చేసిన ఎలాన్‌ మస్క్‌ (Elon Musk).. అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. అక్టోబర్‌ 2022లో 44 బిలియన్‌ డాలర్లతో ట్విటర్‌ను మస్క్‌ కొనుగోలు చేశారు. ఈ క్రమంలో ‘ట్విటర్‌’ (Twitter) పేరును ‘ఎక్స్‌’గా మారుస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జులై 2023 నుంచి ట్విటర్‌ లోగో స్థానంలో ‘ఎక్స్‌’ను చేర్చారు. సంస్థలో అనేక మంది ఉద్యోగులను తొలగించడంతోపాటు బ్లూటిక్‌ సబ్‌స్క్రిప్షన్‌కు రుసుం వసూలు వంటి మార్పులు చేశారు.

ఇమ్రాన్‌ జైలుకు.. నవాజ్‌ పాకిస్థాన్‌కు:

పాకిస్థాన్‌ రాజకీయాల్లో (Pakistan Politics) 2022తోపాటు 2023లోనూ కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అంతకుముందు ఏడాది అవిశ్వాస తీర్మానంతో ప్రధాన మంత్రి పదవి కోల్పోయిన ఇమ్రాన్‌ ఖాన్‌.. ఈ ఏడాది జైలుకు వెళ్లాల్సి వచ్చింది. తోషాఖానా అవినీతి కేసులో ఆయన్ను దోషిగా తేల్చిన ఇస్లామాబాద్‌లోని సెషన్స్‌ కోర్టు.. మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఇదే సమయంలో మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ పాకిస్థాన్‌లో అడుగుపెట్టారు. నాలుగేళ్లుగా లండన్‌లో తలదాచుకున్న ఆయన.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

జనాభాలో చైనాను దాటి..

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ అవతరించింది. ఇదివరకు ఈ జాబితాలో చైనా మొదటి స్థానంలో ఉండగా.. 2023లో భారత్‌ దాన్ని అధిగమించింది. ఐక్యరాజ్యసమితి పాపులేషన్‌ ఫండ్‌ నివేదిక ప్రకారం 142.86 కోట్లతో భారత్‌ తొలిస్థానానికి చేరుకోగా.. 142.57 కోట్ల జనాభాతో చైనా రెండోస్థానంలో నిలిచింది. భారత్‌ మొత్తం జనాభాలో 68 శాతం మంది 15-64 ఏళ్ల మధ్య ఉన్న వారే.

గాజాపై ఇజ్రాయెల్‌ యుద్ధం..

హమాస్‌ ఉగ్రవాదులు అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేయడం.. పశ్చిమాసియాలో భీకర యుద్ధానికి దారితీసింది. అనంతరం ఇజ్రాయెల్‌ మొదలుపెట్టిన ప్రతిదాడులతో పాలస్తీనా ప్రాంతమంతా ఛిద్రమవుతోంది. హమాస్‌ దాడుల్లో 1200 మంది ఇజ్రాయెల్‌ పౌరులు చనిపోగా.. గాజాలో ఇప్పటివరకు 20 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 23 లక్షల గాజా పౌరులు నిరాశ్రయులయ్యారు. హమాస్‌ ఉగ్రవాదులను అంతం చేసేవరకు తమ పోరు ఆగదని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు స్పష్టం చేశారు.

ఆధిపత్య పోరుతో రక్తసిక్తం..

అంతర్యుద్ధం, సైనిక తిరుగుబాటుతో సూడాన్‌ వణికిపోతోంది. అధికారంపై పట్టు కోసం సైన్యం, పారామిలిటరీ ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ల మధ్య కొనసాగుతున్న పోరుతో దేశం రక్తసిక్తంగా మారింది. ఇరువర్గాల మధ్య కాల్పుల విరమణ అమలు కాకపోవడంతో విమానాశ్రయాలే రణక్షేత్రాలుగా మారాయి. ఈ క్రమంలో ఖార్తూమ్‌ ఎయిర్‌పోర్టులోని పలు విమానాలు దగ్ధమయ్యాయి. సుదీర్ఘకాలం పాలించిన ఒమర్‌-అల్‌-బషీర్‌ను అధికారం నుంచి తొలగించిన తర్వాత అక్కడ అంతర్యుద్ధం మొదలయ్యింది. ఈ నేపథ్యంలో సూడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్‌ కావేరీ’ని చేపట్టింది. ఈ మిషన్‌ ద్వారా దాదాపు 4వేల మందిని సురక్షితంగా తీసుకువచ్చింది.

భారత్‌- కెనడా సంబంధాలు..

కెనడాలో ఖలిస్థానీ మద్దతుదారుల దుశ్చర్యలు పెచ్చుమీరాయి. ఈ క్రమంలోనే ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హతమయ్యాడు. అతడి మరణానికి భారత్‌తో సంబంధముందంటూ కెనడా చేసిన ఆరోపణలు.. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపాయి. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన వ్యాఖ్యలపై భారత్‌ కూడా దీటుగా స్పందించింది. ఇదే సమయంలో అమెరికాలోని ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ భారత్‌కు హెచ్చరికలు చేస్తూనే ఉన్నాడు.

రెండో ఏడాది.. రష్యా యుద్ధం..

ఉక్రెయిన్‌పై రష్యా మొదలుపెట్టిన యుద్ధం రెండో ఏడాదీ కొనసాగుతోంది. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం ఇప్పటి వరకు 10 వేల మంది ఉక్రెయిన్‌ పౌరులు మృతి చెందినట్లు అంచనా. మరోవైపు ఉక్రెయిన్‌, రష్యాలకు చెందిన ఐదు లక్షల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. తమ లక్ష్యం చేరే వరకూ యుద్ధం ఆపే ప్రసక్తే లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తెగేసి చెబుతుండటంతో దాని ముగింపు ఎప్పుడు ఉంటుందనే దానిపై స్పష్టత లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని