Republican Debate: నా కుటుంబాన్ని లాగొద్దు: వివేక్‌ను హెచ్చరించిన నిక్కీ

అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న భారత సంతతి నేతలు రిపబ్లికన్‌ చర్చాకార్యక్రమంలో (Republican Debate)లో పరస్పరం వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా వివేక్‌ రామస్వామి(Vivek Ramaswamy) చేసిన వ్యాఖ్యలను నిక్కీహేలీ(Nikki Haley) తీవ్రంగా ఖండించారు. 

Updated : 09 Nov 2023 15:50 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న నేతల మధ్య మరోసారి వాడీవేడీ చర్చ జరిగింది. మూడో దఫా బహిరంగ చర్చ(Republican Debate)లో భాగంగా భారత సంతతికి చెందిన వివేక్‌ రామస్వామి(Vivek Ramaswamy), నిక్కీహేలీ(Nikki Haley) మధ్య మాటల తూటాలు పేలాయి. రామస్వామి తన కుమార్తె ప్రస్తావన తేవడంపై  నిక్కీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 

ఈ ఏడాది ప్రారంభంలో చైనా(China)కు చెందిన టిక్‌టాక్‌(Tiktok) ప్లాట్‌ఫాంలోకి వివేక్‌ ఎంటర్ అయ్యారు. దీనిపై రెండో బహిరంగ చర్చలో నిక్కీ విమర్శలు చేశారు. ఆ విషయాన్ని తాజా డిబేట్‌లో వివేక్ ప్రస్తావిస్తూ.. ‘నేను టిక్‌టాక్‌లో చేరడాన్ని నిక్కీ ఎగతాళి చేశారు. కానీ, ఆమె కుమార్తె చాలాకాలంగా ఆ యాప్‌ను వాడుతున్నారు. ముందు మీ కుటుంబం గురించి చూసుకోండి’ అని రామస్వామి ఆమె విమర్శలకు ఘాటుగా బదులిచ్చారు. దీనిపై నిక్కీ తీవ్రంగా స్పందించారు. ‘నా కుటుంబాన్ని ఇందులోకి లాగొద్దు’ అంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. అమెరికా తర్వాతితరం ఈ యాప్‌ను వాడుతోందని చెప్పడమే ఇక్కడ తన ఉద్దేశమని రామస్వామి అన్నారు. దాంతో ‘నువ్వొక చెత్త’ అని అర్థం వచ్చేలా వ్యాఖ్యానిస్తూ నిక్కీ తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.

మత్తుమందు ఇవ్వకుండానే చిన్నారులకు ఆపరేషన్లు

మొదటి బహిరంగ చర్చ నుంచే వీరిద్దరి మధ్య తీవ్ర వాదోపవాదాలు జరుగుతున్నాయి. వివేక్‌కు విదేశాంగ విధానంపై ఉన్న అనుభవాన్ని నిక్కీ ప్రశ్నిస్తున్నారు. ‘మీ మాటలు విన్న ప్రతిసారి నేను బ్లాంక్‌ అవుతున్నాను’ అని రెండో బహిరంగ చర్చలో వివేక్‌ను విమర్శించారు. ఇదిలా ఉంటే.. ఈ చర్చలో అభ్యర్థులంతా చైనా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్‌ విషయంలో తమ భవిష్యత్తు ప్రణాళికను  వివరించారు.

రిపబ్లికన్‌ పార్టీ తరపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సహా మొత్తం 8 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 2024 అధ్యక్ష ఎన్నికల కోసం రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి ముందంజలో ఉన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌(Trump).. ఈ ప్రైమరీ డిబేట్లకు తాను హాజరుకాబోనని వెల్లడించారు. ‘‘నేనెవరో.. ఎంత విజయవంతంగా అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించానో ప్రజలందరికీ తెలుసు. అందువల్ల నేను చర్చలో పాల్గొనాల్సిన అవసరం లేదు’’ అని గతంలోనే వెల్లడించారు. ఆయన తీరును మిగతా అభ్యర్థులు ఖండిస్తున్నారు. ఇదిలా ఉంటే.. రేసులో ముందున్న ట్రంప్‌ ప్రస్తుతం కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని