Kim-Putin meet: విలాసవంతమైన రైల్లో.. రష్యాకు బయలుదేరిన కిమ్‌?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ( Vladimir Putin)తో భేటీకి సిద్ధమైన కిమ్‌-జోంగ్‌-ఉన్‌.. విలాసవంతమైన రైలులో రష్యాకు బయలుదేరినట్లు తెలుస్తోంది.

Updated : 11 Sep 2023 15:59 IST

సియోల్‌: ఉత్తర కొరియా నియంత కిమ్‌-జోంగ్‌-ఉన్‌ ( Kim Jong Un ).. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ( Vladimir Putin)తో త్వరలో భేటీ కానున్నారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఓ రైల్లో రష్యాకు బయలుదేరినట్లు సమాచారం. కిమ్‌కి చెందిన విలాసవంతమైన రైలు.. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌ నుంచి ఆదివారం సాయంత్రమే రష్యాకు బయలుదేరిందని దక్షిణ కొరియా మీడియా వెల్లడించింది. దీంతో మంగళవారం (సెప్టెంబర్‌ 12) పుతిన్‌-కిమ్‌ల భేటీ ఉండవచ్చని అంచనా వేశాయి.

ఉక్రెయిన్‌తో యుద్ధం జరుపుతోన్న రష్యా.. ఆయుధాలను సమీకరించే ప్రయత్నం చేస్తోందనే సమాచారం ఉంది. అందుకే కిమ్‌ రష్యాలో పర్యటించే అవకాశాలున్నాయని అమెరికా నిఘావర్గాలు ఇటీవల పేర్కొన్నాయి. గత నెలలో రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఉత్తర కొరియా వెళ్లారని.. క్రెమ్లిన్‌కు ఆయుధాలు విక్రయించేలా చర్చలు జరిపారని తెలిపాయి. ఈ నేపథ్యంలో కిమ్‌ జోంగ్‌ ఉన్.. తన ప్రత్యేక రైల్లో రష్యాకు బయలుదేరినట్లు స్థానిక మీడియాతోపాటు జపాన్‌ న్యూస్‌ ఏజెన్సీలు వెల్లడించాయి. ఇదే విషయాన్ని మాస్కో అధికారులు కూడా ధ్రువీకరించినట్లు పేర్కొన్నాయి. అయితే, దీనిపై దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం, రక్షణశాఖ లేదా అక్కడి నిఘా వర్గాలు మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు.

అసలైన యుద్ధానికి సిద్ధంగా ఉండండి.. సైన్యానికి కిమ్ ఆదేశాలు

పుతిన్‌తో కిమ్‌ భేటీ కావడం ఇదే తొలిసారి కాదు. 2019లో ఉత్తరకొరియా సరిహద్దుకు సమీపంలోని రష్యా నగరమైన వ్లాదివోస్తోక్‌లో రష్యా అధ్యక్షుడితో కిమ్‌ భేటీ అయ్యారు. ఆ సందర్భంలోనూ విలాసవంతమైన రైలులో 20 గంటలు ప్రయాణించి వ్లాదివోస్తోక్‌ చేరుకున్నారు. ఈసారి కూడా ఆ నగరంలోనే ఇరు నేతల భేటీ ఉండొచ్చని సమాచారం. వ్లాదివోస్తోక్‌లో జరుగుతోన్న ఈస్ట్రన్‌ ఎకానమీ సదస్సులో పుతిన్‌ పాల్గొననున్నందున.. మరోసారి వారిద్దరి భేటీ అక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది. అందుకే ప్యాంగాంగ్‌ నుంచి ప్రత్యేక రైలులో కిమ్‌ బయలుదేరినట్లు అక్కడి మీడియా వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని